వచ్చే డిసెంబర్ చివరి వరకు ఉచిత డేటా ఆఫర్ తో 4G మార్కెట్ లో తొక్కిసలాట సృష్టించిన రిలయన్స్ జియో తన అప్లికేషన్స్ ద్వారా సేకరించే యూజర్ (కస్టమర్ల) డేటాను ప్రకటనల కంపెనీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా హ్యాకర్ గ్రూఫు హ్యాక్టివిస్ట్ సంస్ధ ‘ఎనోనిమస్’ ప్రకటించి సంచలనం సృష్టించింది.
గూగుల్ కంపెనీ లాగానే భారీ మొత్తంలో ఉచిత సేవలు, ఉచిత యాప్స్ ను యూజర్స్ కు ఇవ్వజూపుతున్న రిలయన్స్ కంపెనీ తన ఉచిత సేవలు వాస్తవానికి మరింత లాభాలు సంపాదించేందుకేనని, తన కస్టమర్ల ప్రయివసీని తాకట్టు పెట్టి మరి అధిక లాభాలు సంపాదించడమే దాని లక్ష్యమని హ్యాక్టివిస్ట్ గ్రూపు వెల్లడి చేసిన వాస్తవాల ద్వారా స్పష్టం అవుతున్నది.
దేశ వ్యాపితంగా 4G స్పెక్ట్రంలో అత్యధిక భాగాన్ని వేలంలో కొనుగోలు చేసిన రిలయన్స్ కంపెనీ ఇటీవలనే చాలా ఆలస్యంగా 4G కంయూనికేషన్, డేటా సేవలను ప్రారంభించింది. వచ్చి రావడంతోనే కస్టమర్లకు భారీ బొనాంజా ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీలు గుక్క తిప్పుకోకుండా చేసింది. రిలయన్స్ జియో ప్రకటించిన పధకంలో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి.
- జీవితాంతం ఉచిత వాయిస్, SMS సేవలు
- డిసెంబర్ 31, 2016 వరకు అన్ని సేవలు ఉచితం
- జనవరి 1, 2017 నుండి ఇతర కంపెనీల బేస్ డేటా రేటులో జియో డేటా బేస్ రేటు 10 శాతం (1GB = రు. 50/-)
ఈ మూడు అంశాల ప్రధాన లక్ష్యం ఇతర కంపెనీల నుండి కస్టమర్లను భారీ ఎత్తున ఆకర్షించడమే అని చూడగానే అర్ధం అవుతుంది. అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లు (యాండ్రాయిడ్, యాపిల్ స్టార్ రెండింటి లోను) ఇప్పటికే వాయిస్, SMS సేవలు ఇచితంగా అందిస్తున్నాయి. కేవలం డేటా ప్రవాహానికి మాత్రమే డబ్బు వసూలు చేస్తున్నాయి. అయితే వాయిస్, SMS సేవలను డేటా మార్కెట్ కు అనుసంధానం చేయడం ద్వారా తమ రెవిన్యూ వసూళ్లు తగ్గకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి.
థర్డ్ పార్టీ అప్లికేషన్లు ప్రపంచ వ్యాపితంగా ఉచిత వాయిస్, SMS సేవలు అందిస్తున్న దృష్ట్యా మొబైల్ మార్కెట్ అనివార్యంగా ఆ దిశలోనే నడుస్తున్నది. అనగా ఇండియాలో అధికారిక సర్వీసులు కూడా రేపో, మాపో వాయిస్, SMS లను ఉచితంగా అందించాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ రోజుని ముందుకు జరపడం మాత్రమే రిలయన్స్ జియో చేస్తున్నది తప్ప అది కొత్తగా వినియోగదారులకు చేస్తున్న మేలు ఏమి లేదు.
ఈ ఉచిత తొక్కిసలాటలో అసలు విషయం మరుగున పడుతోంది. అది: ఉచిత సర్వీసుల మాటున కాటికి వెళ్లిపోతున్న వినియోగదారుల ప్రయివసీ. ఉచితం అని చేప్పేవి ఏవి వాస్తవానికి ఉచితం కాదు. కాకపొతే ఆ డబ్బును కంపెనీలు ఇతర రూపాల్లో వసూలు చేయడం కంపెనీలు, ముఖ్యంగా ఇంటర్నెట్ కంపెనీలు అనుసరిస్తున్న ఎత్తుగడ.
ఇంటర్నెట్ సేవలు పొందడానికి తప్పనిసరి అవసరం అన్న నమ్మకంతో వినియోగదారులు కంపెనీలు/అప్లికేషన్లు ఏ వివరం అడిగినా వెనకా ముందు చూడకుండా ఇచ్ఛేస్తున్నారు. T&C పేరుతొ వినియోగదారులు చదవవలసి వచ్చే అనేక పేజీల ప్రయివసీ ఒప్పందాన్ని చదవ లేక దానిని చదవకుండానే యాప్స్ అడిగే అనుమతులు అన్నింటికి వినియోగదారులు ఓ కె చెప్పేస్తున్నారు. దీనినే కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి.
ఈ అనుమతుల్లోనే వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు కూడా యాప్స్ అనుమతి తీసుకుంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు మూడో వ్యక్తికీ / సంస్ధకు / కంపెనీకి ఇవ్వబోమని యాప్స్ గట్టి హామీ కూడా ఇస్తాయి. కానీ వాస్తవంలో అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకే, వాటితో వ్యాపారం చేసేందుకే యాప్స్ లేదా కంపెనీలు వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న సంగతిని అడపా దడపా హ్యాకర్లు, విజిల్ బ్లోయర్లు, ప్రయివసీ కార్యకర్తలు వెల్లడి చేస్తూనే ఉన్నారు.
ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ కంపెనీ కూడా ఇదే పని చేస్తున్నాడని హ్యాక్టివిస్ట్ అనే హ్యాకర్ల సంస్ధ ‘ఎనోనిమస్’ వెల్లడి చేసిన సమాచారం తెలియజేస్తున్నది. రిలయన్స్ జియో కంపెనీ నిర్వహిస్తున్న అప్లికేషన్లు (యాప్స్) ‘మై జియో’ ‘జియో డయలర్’. ఈ రెండు యాప్స్ సేకరించే వినియోగదారుల వ్యక్తిగత వివరాలను అమెరికా, సింగపూర్ లలోని ప్రకటనల కంపెనీలకు రిలయన్స్ కంపెనీ అమ్మేస్తున్నాడని అనానిమస్ తెలిపింది. ఇండియాలో ఎనోనిమస్ సంస్ధ @redteamin అనే పేరు గల ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కార్యకలాపాలు ప్రకటిస్తుంది.
అనానిమస్ హ్యాకర్లను తాము ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి వివరాలు కనుక్కున్నామని, సంస్ధ ప్రకటించిన వివరాలను ధృవీకరించుకున్నామని ద హిందూ బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. “RJio వెబ్ సైట్ ను హ్యాక్ చేసి మేము ఈ వివరాలు తెలుసుకున్నాము. టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు వినియోగదారుల వివరాలు రిలయన్స్ కంపెనీ అమ్మేస్తున్నది” అని ఎనోనిమస్ సంస్ధ తెలిపిందని బిజినెస్ లైన్ వివరించింది.
RJio కంపెనీ వినియోగదారుల వివరాలను ఏ విధంగా అమ్ముతున్నది తెలియజేస్తూ ఎనోనిమస్ సంస్ధ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వివరంగా తెలియజేసింది పత్రిక తెలిపింది. వెబ్ సైట్ ను హ్యాక్ చేసే పధ్ధతి గురించి కూడా బ్లాగ్ పోస్ట్ ద్వారా సంస్ధ వివరించినట్లు తెలుస్తున్నది.
ఎనోనిమస్ వెల్లడి చేసిన అంశాన్ని రిలయన్స్ కంపెనీ తిరస్కరించింది. తాము అలాంటిది ఏమి చేయడం లేదని తెలిపింది. ఎనోనిమస్ ప్రకటనను ఖండించింది. “వినియోగదారుల వివరాల భద్రతకు, వారి ప్రయివసీకి తాము అత్యంత భద్రతా, ప్రాధాన్యత ఇస్తాము” అని యధావిధి ప్రకటన చేసింది. కంపెనీ అంతకంటే గొప్పగా చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళు నిజం చెబుతారని ఆశించడమే దండగ!
రిలయన్స్ జియో అందజేస్తున్న ఉచిత తాయిలాలు చూసి ఆశపడుతున్న వినియోగదారులు ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఒక్క జియో మాత్రమే కాదు, ఎయిర్ టెల్, ఐడియా, టెలినార్ తదితర ఇతర ప్రయివేటు కంపెనీలు కూడా ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తామని ఆశించలేము. మనం ఇచ్ఛే వివరాలు సాధ్యమైనంత క్లుప్తంగా ఉంటేనే మేలు. తప్పుడు వివరాలు ఇవ్వగలిగితే ఇంకా మంచిది.
Reblogged this on జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ.
మెచ్చుకోండిమెచ్చుకోండి