పాక్ పై ఇండియా ఎకనమిక్ వార్!

యూరి దాడికి ప్రతీకారంగా ఇండియా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది; భౌతిక మిలటరీ యుద్ధం కాదు, ఆర్ధిక యుద్ధం! అమెరికా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాగానే పాఠాలు నేర్చుకుంటున్నారు సుమీ!

ఎకనమిక్ వార్ అని భారత ప్రభుత్వం సూచిస్తున్న చర్యలలో కొన్ని అంశాలు: 

1. సాప్తా ఒప్పందం కింద ఇచ్చిన రాయితీలను ఉపసంహరించడం: సాప్తా (SAPTA ) అంటే దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అని అర్ధం. సార్క్ కూటమి దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు) తమ దేశాల పరిధుల్ని స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ప్రకటించాయి. దీని కింద కొన్ని పన్నులు, దిగుమతి సుంకాల పైన రాయితీ ఇవ్వబడుతుంది. 

2. MFN స్టేటస్ పైన WTO కు ఫిర్యాదు చేయటం: MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం- అని అర్ధం. ఒక దేశం మరొక దేశానికి ఈ స్టేటస్ ఇస్తే, ఇచ్చిన దేశంలో ఇవ్వబడిన దేశానికి కొన్ని రాయితీలు సిద్ధిస్తాయి. ఈ స్టేటస్ ని ఇండియా పాకిస్తాన్ కి ఇచ్చింది గానీ, పాకిస్తాన్ ఇండియాకు ఇవ్వలేదు. ఈ స్టేటస్ గురించిన వివాదాలపై WTO కు ఫిర్యాదు చేసి తీర్పు కోరవచ్చు. 

ఎకనామిక్ వార్ లో భాగంగా MFN స్టేటస్ ని ఇండియా ఉపసంహరించవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయటం లేదు. అది కొనసాగనిస్తు  తమకు అదే స్టేటస్ ఇవ్వకపోవటం గురించి WTO కు ఫిర్యాదు చేయాలని తలపెడుతున్నది. ఇది నిజానికి ఎకనామిక్ వార్ కాజాలదు. పాక్ కి తాము ఇస్తున్న బెనిఫిట్స్ మాకు ఇప్పించాలని ఫిర్యాదు చేయటం వార్ ఎందుకు అవుతుంది? 

సిమెంటు కంపెనీలు పాక్ నుండి దిగుమతి అవుతున్న సిమెంటు ఆగిపోవాలని కోరుకుంటాయి. యూరి దాడి అవకాశంగా సిమెంటు దిగుమతులు నిలిపేయాలని అవి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ‘ఇల్లు కాలితే చుట్టకి నిప్పు దొరికిందని సంతోషించడం’ అన్నమాట! దీనిని ఎకనామిక్ వార్ లో కలిపేస్తున్నారు. 

3. IWT ని తిరగదోడటం: IWT అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అని. ఈ ఒప్పందం ద్వారా నది జలాలను ఇరు దేశాలు పంపిణి చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందం లేకపోతె పాక్ కే ఎక్కువ నష్టం అని భారత ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి ట్రీటీని పాటించడం మానేస్తే పాక్ దారికి వస్తుందని వారు భావిస్తున్నారు. దీనివల్ల పాక్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకోవడం తధ్యం. అందుకే నిన్ననో మొన్ననో ప్రధాని మోడీ పాక్ పాలకులు ఎంత చెడ్డవాళ్ళో పాక్ జనానికి చెబుతున్నారు. తద్వారా “పాపం మోడిదేమి తప్పు లేదు, మన పాలకులే తప్పులు చేస్తూ మనకి ఈ దుర్గతి తెచ్చి పెడుతున్నారు” అని అనుకోవాలని ప్రధాని ఆశ కావచ్చు. అది గొప్ప స్ట్రేటజీ అని మనము అనుకోవాలి. 

ఈ వార్ వల్ల ఏ మాత్రం ఫలితం ఉంటుంది?       

2014-15 లో ఇరు దేశాల వాణిజ్యం కేవలం 2.35 బిలియన్ డాలర్లు. అది 2015-16 లో 11 శాతం పెరిగి 2.61 బిలియన్లకు చేరుకుంది. ఇది తక్కువే అయినా పాక్ పైన పట్టు బిగించడానికి ఇది చాలు అని ప్రభుత్వ పెద్దల నమ్మకం. 

అయితే కొన్ని అంశాలు గుర్తించాలి. WTO నిబంధనల ప్రకారం, ఒక దేశం మరొక దేశానికి MFN స్టేటస్ ఇస్తే ఇచ్చిన దేశం ఒక సరుకు పైన సుంకం తగ్గిస్తే అవతలి దేశం కూడా ఆ స్ధాయికి తగ్గించాలి. ఈ నిబంధన ప్రకారం WTO కి ఫిర్యాదు చేస్తే మనం లాభ పడతామని భావిస్తున్నారు. 

కానీ MFN స్టేటస్ ఇవ్వకుండా తప్పించుకోగల నిబంధన కూడా ఉన్నది. భద్రతా (సెక్యూరిటీ) కారణాల రీత్యా MFN స్టేటస్ ఇవ్వకుండా నిరాకరించవచ్చు. కనుక ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న తమ దేశ పరిస్ధితుల రీత్యా స్టేటస్ ఇవ్వలేమని, సుంకాలు తగ్గించలేమని పాక్ వాదించవచ్చుఁ. దానితో భారత్ తలపెట్టిన వార్ పదును కోల్పోతుంది. 

సాప్తా రాయితీలు ఇవ్వకుండా నిలిపివేయాలంటే అది సార్క్ దేశాలన్నీ అనుకోవాలి. ఏ ఒక్క దేశం నిరాకరించినా భారత్ చర్యకు ఆమోదం దక్కదు. సార్క్ దేశాలు ఇటీవల ఇండియాకు మద్దతు రావటం నిజమే గానీ సాప్తా రాయితీల ఉపసంహరణ వరకు వారి మద్దతు వస్తుందా అన్నది అనుమానం.

కాబట్టి మోడీ ప్రభుత్వం తలపెట్టిన ‘ఎకనమిక్ వార్’ వాస్తవంలో ఆచరణకు రాకపోయినా, ఆశించిన ఫలితాలు చూపలేకపోయినా ఆశ్చర్యం లేదు. విఫలం అయితే తలవంపులు తప్పవు. అసలు ఒక దేశ పాలకులు చేసే చర్యలకు ఆ దేశ ప్రజలను బలి చేస్తామనడం దుర్నీతి. నాగరిక ప్రపంచం దానికి ఒప్పుకోదు. అమెరికా అనాగరిక పాలకుల చేతుల్లో ఉన్నది గనుకనే అది ఎన్ని దుర్నీతులకైనా పాల్పడుతుంది. దాని సరసన చేరాలని అంత కోరికగా ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. కానీ అందుకు పాక్ ప్రజల నుండి మద్దతు ఉంటుంది అనుకుంటే పొరపాటు. భారత ప్రజలు కూడా ఇలాంటి వెర్రి మొర్రి ఎత్తులను వ్యతిరేకించాలి.

One thought on “పాక్ పై ఇండియా ఎకనమిక్ వార్!

విశేఖర్కు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s