పౌండ్: సెకన్లలో 10% పతనం

బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ శుక్రవారం లిప్తపాటు కాలంలో భారీగా పతనమై కలకలం సృష్టించింది. అనంతరం తిరిగి కోలుకున్నప్పటికీ పౌండ్ క్రాష్ తో ప్రపంచ మార్కెట్లు  ఒక్కసారిగా కలవర పడ్డాయి. 

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం అయ్యాక ఒక దశలో పౌండ్ విలువ 1.2600 డాలర్ల వద్ద ఉన్నది. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా పతనం కావడం మొదలయింది. ఎంత వేగంగా పతనం అయిందంటే కొద్ది సెకన్ల తర్వాత చూస్తే పౌండ్ విలువ 1.1378 డాలర్లుగా తెరల పైన ప్రత్యక్షం అయింది. ఇది 10 శాతం పతనంతో సమానం. 

ఇంతకీ పౌండ్ స్టెర్లింగ్ ఎందుకు క్రాష్ అయిందో ఎవరికీ అంతుబట్టలేదు. సాంకేతిక కారణం వలన (కంప్యూటర్ లో సాఫ్ట్ వేర్ బగ్) క్రాష్ అయి ఉంటుందని కూడా ఎవరు చెప్పకపోవడం విశేషం. స్టాక్ మార్కెట్లు ముఖ్యానంగా పశ్చిమ దేశాల స్టాక్ మార్కెట్లు  కంప్యుటర్ సాఫ్ట్ వేర్ ల సహాయంతో అత్యంత వేగంగా నడుస్తుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ట్రాఫిక్ లో ఆటంకాలు తలెత్తడంతో లేదా ఇతర కారణాల వల్లనో (కంప్యుటర్ గ్లిచ్ అని వీటిని అంటూ ఉంటారు) సాధారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటి క్రాష్ కి దానిని కూడా కారణంగా చెప్పడం లేదు. 

కారణం ఏమిటో చెప్పలేదు గాని ఈ కొద్ది సెకన్ల ట్రేడింగ్ ని రద్దు చేశారని రాయిటర్స్ న్యూస్ తెలిపింది. రద్దు  చేసాక పౌండ్ విలువ 1.1491 గా నిర్ధారించారని తెలిపింది. 31 ఏళ్ళ క్రితంతో (1985) పోల్చితే ఇది కూడా అత్యల్ప స్ధాయి కావడం గమనార్హం.  

అనంతర ట్రేడింగ్ లో పౌండ్ విలువ కోలుకుని 1.2460 డాలర్లకు చేరినట్లు తెలుస్తున్నది. ఇది 1.2% తగ్గుదలకు సమానం. మార్కెట్ల రియాక్షన్ చూసేందుకు కావాలని పౌండ్ విలువను పతనం చేశారా అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే దీనికి చాలా చాలా తక్కువ అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. 

ఆదివారం నాడు ధెరెసా మే బ్రెగ్జిట్ గురించిన ప్రకటన చేసిన తర్వాత మార్కెట్లు ఆందోళనలో పడ్డాయని కొందరు సూచిస్తున్నారు. మార్చి 2017 చివరి కల్లా ఆర్టికల్ 50 కింద ఈయూ కు ఎగ్జిట్ నోటీసు ఇస్తామని, బ్రిటిష్ ప్రజల తీర్పు ని శిరసా వహించ వలసిందేనని ఆమె తమ పార్టీ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.  

“యూరోపియన్ యూనియన్ బ్రిటన్ తో గట్టిగా వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ ప్రధాని ధెరేసా మే యూరప్ నుండి కఠినమైన షరతులతో వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది” అని నిన్న -గురువారం- ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండే సూచించారు. ఆయన ప్రకటనను మార్కెట్లు పరిగణించినట్లు కనిపిస్తున్నదని కొందరు సూచించారు.  

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సరళతరమైన విత్త విధానం అనుసరించడం పట్ల బ్రిటిష్ ప్రధాని స్వల్పంగా విమర్శించారు. మానిటరీ పాలసీని కఠినం కావించాలని ఆమె సూచించినట్లుగా భావించి మార్కెట్లు మరింత ఆందోళనకు గురైనాయని కొందరు విశ్లేషకులు సూచించారు. 

ఈ వారంలో పౌండ్ విలువ ఇప్పటి వరకు 4% పడిపోయింది. దేశాధినేతల ప్రసంగాలు, వ్యాఖ్యలు, షేర్ మార్కెట్ల కదలికలతో పాటు కరెన్సీ విలువలను కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పౌండ్ స్టెర్లింగ్ విలువ పతనం తెలియజేస్తున్నది. కాగా పౌండ్ పతనం డాలర్ బలీయం కావడానికి దారి తీసి మరింత ఆశాజనకమైన భవిష్యత్తును అమెరికా ఆర్ధిక వ్యవస్ధ చూసేలా ప్రభావం కలగజేయడం దీనికంతటికి  కొసమెరుపు!

1 thoughts on “పౌండ్: సెకన్లలో 10% పతనం

వ్యాఖ్యానించండి