45 వ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు అమెరికా ఈ రోజు ఉద్యుక్తం అవుతున్నది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 35 మిలియన్ల మంది ఓటు వేశారని, ఇంకా 70 మిలియన్ల ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉన్నదని పత్రికలు చెబుతున్నాయి. 65 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్నదని అంచనా వేసినందున మరో 30-35 మిలియన్ల వరకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
ఓటు ఫలితం కోసం అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎంత ఆందోళనతో ఎదురు చూస్తున్నారో షేర్ మార్కెట్లు కూడా అంతే ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. మార్కెట్ల ఆందోళన హిల్లరీ క్లింటన్ పైన కాకుండా డోనాల్డ్ ట్రంప్ పైన కేంద్రీకరించబడింది. వాటి భయం అంతా డోనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమో అన్నదే. ప్రపంచీకరణ విధానాల వల్ల అమెరికా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించిన ట్రంప్ తాను అధికారంలోకి వస్తే ఆ విధానాలను తిరగదోడతానని హామీ ఇవ్వడం అందుకు ఒక కారణం.
ట్రంప్ గెలుపు సాధిస్తే గనక షేర్ మార్కెట్లు 2 శాతం నుండి 6 శాతం వరకు పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిల్లరీ క్లింటన్ గెలిస్తే గనుక మరో 1 లేదా 2 శాతం మార్కెట్లు లాభ పడవచ్చని భావిస్తున్నారు. క్లింటన్ ఈ-మెయిల్ సర్వర్, ఈ మెయిళ్ల లీకేజి వ్యవహారంలో రెండో సరి విచారణకు ఆదేశించిన FBI , హిల్లరీ పైన కేసు పెట్టబోవడం లేదని సోమవారం ప్రకటించడంతో మార్కెట్లు 2% పైన లాభ పడ్డాయి. క్లింటన్ గెలుపు ప్రభావాన్ని ఈ లాభం చాలా వరకు కవర్ చేసిందని కనుక హిల్లరీ వాస్తవంగా గెలిస్తే దాని ప్రభావం షేర్ మార్కెట్ పై కాస్త తగ్గుతుందని చెబుతున్నారు.
కాగా ట్రంప్ గెలుపు పట్ల అతి పెద్ద బ్యాంకులు మోర్గాన్ స్టాన్లీ, జె పి మోర్గాన్ ఛేజ్ & కో, గోల్డ్ మెన్ సాక్స్ గ్రూప్… మొ.వి ఆందోళనతో ఉన్నాయని వాణిజ్య పత్రికలు చెబుతున్నాయి. ట్రంప్ గెలుపు బ్రెగ్జిట్ తరహాలో అతి పెద్ద కుదుపుకు కారణం అవుతుందని ఈ వాల్ స్ట్రీట్ బ్యాంకులు భావిస్తున్నాయి. దానితో అవి ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
భారత కాలమానం ప్రకారం ఎన్నికల ఫలితాలు బుధవారం ఉదయం నుండి వెలువడతాయని తెలుస్తున్నది. కనుక ఎన్నికల ప్రభావం మొదటి ఆసియా షేర్ మార్కెట్ల పైనే పడుతుంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఆసియాలో కార్యకలాపాలు కేంద్రీకరించిన బడా ద్రవ్య బ్యాంకులు మొదటిగా ప్రభావానికి గురవుతాయి. ఈ నేపథ్యంలో జపాన్ కు చెందిన నోమురా హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్ధ బుధవారం మరింత మంది సిబ్బంది విధుల్లో ఉండేట్లుగా చూస్తున్నామని తెలిపింది. ఆసియాలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్విస్ బ్యాంకు HSBC కూడా బుధవారం అధిక సిబ్బందిని నియోగించనుంది. లండన్, హాంగ్ కాంగ్ ఆఫీసుల్లో సిబ్బందిని పెంచామని తెలిపింది. ట్రేడింగ్ కార్యకలాపాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది కనుక ఎక్కువ సిబ్బంది ఉంటే ఒత్తిడికి తగినట్లు స్పందించగలమని ద్రవ్య కంపెనీలు భావిస్తున్నాయి.
గత జూన్ లో బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన అనంతరం S&P 500 షేర్ సూచిక ఏకంగా 3.6 శాతం పతనం అయిన సంగతిని మార్కెట్లు, కంపెనీలు గుర్తు చేసుకుంటున్నాయి.
స్టాప్-లాస్ ఆర్డర్ లను వినియోగపెట్టాలని అమెరికా బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. ఈ పద్ధతిలో కస్టమర్లు తమ పోర్ట్ ఫోలియోలు స్టాక్ మార్కెట్ లో పతనానికి గురయిన పక్షంలో నిర్దిష్ట స్ధాయిలో అమ్మెయ్యాలని కోరుతారు. సదరు షేర్ ఆ స్ధాయికి పడిపోయిన వెంటనే ఆటోమెటిక్ గా అమ్మకానికి పెట్టే సర్వీస్ ని అందుబాటులోకి తేవాలని మోర్గాన్ స్టాన్లీ సూచించింది. (ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ధనిక కస్టమర్ల, సంస్ధల షేర్ పెట్టుబడులను మేనేజ్ చేస్తుంటాయి. అందుకు ఫీజు వాసులు చేస్తాయి. వారి షేర్ ల అమ్మకాలు, కొనుగోళ్ల పైన సలహాలు ఇస్తూ ఫీజు వసూలు చేస్తాయి.)
ఎన్నికలకు సంబంధించి పరిణామాల పట్ల కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ మోర్గాన్ స్టాన్లీ తన సిబ్బందికి సాహిత్యం కూడా పంచి పెట్టింది. దానిని చదివి సిబ్బంది తయారుగా ఉంటె కస్టమర్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారన్నట్లు. ముఖ్యంగా వెల్త్ మేనేజ్ మెంట్ విభాగాలకు ఈ తరహా సాహిత్యాన్ని బ్యాంకు పంపిణి చేసినట్లు తెలుస్తున్నది.
అమెరికా స్టాక్ ధరలు అటు గాని ఇటు గని 2 శాతం ఊగిసలాడ వచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే గనక S&P 500 సూచి 3 నుండి 5 శాతం పతనం కావచ్చని మరో అతి పెద్ద వాల్ స్ట్రీట్ బ్యాంకు సిటీ బ్యాంక్ అంచనా వేస్తున్నది. హిల్లరీ గెలుపు ఫలితాన్ని ఇప్పటికే (సోమవారం) మార్కెట్లు గ్రహించినందున ఆమె గెలుపు పెద్దగా కదలిక తేకపోవచ్చుఁ. మార్కెట్లు మరోసారి లాభ పడతాయి గని అది పెద్ద మొత్తంలో ఉండకపోవచ్చు.
హిల్లరీ అధికారంలోకి వస్తే యధాతథ స్ధితిని కొనసాగిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి. పరాయి దేశాలపై యుద్ధాలు, రష్యాతో యుద్ధోన్మాదం తీవ్రం చేయడం, ఉక్రెయిన్, సిరియా, యెమెన్ ప్రజలను మరింత ఊచకోత కోయించడం తద్వారా యుద్ధ అమ్మకాలు స్ధిరంగా కొనసాగేలా చూసి దగ్గరి (అడ్డ) దారిలో అమెరికా వృద్ధి రేటు పెంచడం..ఇవీ హిల్లరీ నుండి మార్కెట్లు ఆశిస్తున్న యధాతథ స్ధితి. తాను అధికారంలోకి వస్తే రష్యాతో స్నేహం చేస్తానని, యుద్ధాలు నిలిపేస్తానని, శత్రు సంబంధాలు నిరాకరిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. ఇది వాల్ స్ట్రీట్ కంపెనీలకు ఎంత మాత్రం సమ్మతం కాదు. హిల్లరీ పై విచారణ లేదని FBI ప్రకటించాక 2 శాతం పైగా లాభాలు నమోదు చేయడం ద్వారా మార్కెట్లు ఆ విషయాన్నే చెప్పాయి.
2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఘటనగా అమెరికా ఎన్నికలను నోమురా బ్యాంకు పేర్కొన్నది. ట్రంప్ గెలిస్తే మార్కెట్లు , ముఖ్యంగా ఆసియా ఈక్విటీలు 6% నష్టపోతాయని నోమురా అంచనా వేసింది.
ఎన్నికల అనంతరం భారీ ట్రేడింగ్ జరగడమే గాక భారీ స్ధాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయని ‘సొసైటీ జనరల్’ సంస్ధ ఆసియా పసిఫిక్ విభాగం ప్రకటించింది. కస్టమర్ల విభాగం, బ్యాక్ ఆఫీస్ విభాగం రెండింటిలో సిబ్బందిని పెంచుతామని సొసైటీ జనరల్ తెలిపింది. టెక్నాలజీ సిబ్బందిని ఎక్కువ మందిని అందుబాటులు ఉంచుతున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా షేర్ బ్రోకింగ్ కంపెనీలు కూడా ఇవే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే పెద్ద మార్పులు జరుగుతాయని అవి అనుకోవడం లేదు. అనగా హిల్లరీ గెలుపు ఖాయం అని ఆస్ట్రేలియా కంపెనీలు భావిస్తున్నాట్లే!
Reblogged this on జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
So, More load increase on NYSE, LIBOR, NSE(Bombay Stock exchange) with respect to FrontOffice trading desks. :). It will give more pain to BackOffice Servers also with respect to DTCC, clearing and settlement departments. Finally, Investment banks beware from this political scenario’s. Automatic order management is too risky
మెచ్చుకోండిమెచ్చుకోండి