Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల మాట ఇప్పుడు అందుకు విరుద్ధంగా ధ్వనిస్తున్నది. లేదా కేంద్ర మంత్రులే (ప్రధాని, ఆర్ధిక మంత్రి మొ.వారు) అధికారుల ద్వారా చిన్నగా ఉప్పు అందిస్తున్నారు. నిన్నటి దాకా “అబ్బే, తగ్గే సమస్యే లేదు” అని ఠలాయించిన జైట్లీ ఇప్పుడు హఠాత్తుగా “ప్చ్! తగ్గుతుంది” అని చెబితే విపక్షాలకు ఆయన విందు భోజనం అవుతారు. పత్రికలకు ‘పుల్కాలో చికెన్’ అయిపోతారు. అందుకని చిన్నగా అధికారుల చేత చెప్పించి చిన్న జి‌డి‌పి అంకెకు ఇప్పటి నుండే పత్రికలను, విశ్లేషకులను, కాస్తో కూస్తో పట్టించుకునే జనాన్ని అలవాటు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

రాయిటర్స్ వార్తా సంస్ధతో పేరు చెప్పకుండా మాట్లాడినా ప్రభుత్వ అధికారుల ప్రకారం 2016-17 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4 – జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో భారత దేశ జి‌డి‌పి 4 శాతానికి పడిపోతుంది. మొదటి త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కాగా, రెండవ త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు (వాస్తవ త్రైమాసిక వృద్ధి రేటును 4 తో హెచ్చిస్తే అది ఆ త్రైమాసిక కాలానికి వార్షిక వృద్ధి రేటు అవుతుంది) 7.3 శాతం నమోదయింది. మూడో త్రైమాసికంలో ఇది భారీగా పతనమై 3.5 % నమోదు కావచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నవంబర్ 29 తేదీన ప్రచురించిన విశ్లేషణలో అంచనా వేసింది.

కాగా జనవరి నుండి మార్చి వరకు విస్తరించే నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 4 శాతం మాత్రమే నమోదు కావచ్చని ప్రభుత్వమే అంచనా వేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఫలితంగా ఫిబ్రవరి 1 తేదీన ప్రతిపాదించనున్న కేంద్ర బడ్జెట్ లో పాపులిస్టు చర్యలు ప్రకటించడానికి ప్రధాని మోడీకి అవకాశాలు లేవని వారు సెలవిచ్చారు.

“రైతులకు రుణాల మాఫీ, పేద ప్రజల ఖాతాల లోకి డబ్బు జమ చేయడం లాంటి బిగ్-టికెట్ ఖర్చులకు బడ్జెట్ లో అవకాశం ఉండదు” అని అధికారులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

అయితే జి‌డి‌పి లో బడ్జెట్ లోటు వాటా టార్గెట్ అయిన 3.5 శాతం లక్ష్యాన్ని చేరడానికి వీలుగా పెట్టుబడులకు, మౌలిక నిర్మాణాలకు ఖర్చులు కొనసాగించే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పారు. 2018 మార్చి నాటికి బడ్జెట్ లోటు జి‌డి‌పి లో 3% ఉండేలా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. మార్చి 2017 నాటికి బడ్జెట్ లోటు జి‌డి‌పిలో 3.5 శాతానికి తగ్గించాలని మోడి ప్రభుత్వం లక్ష్యం. ఈ లక్ష్యం సిద్ధించాలంటే పేద ప్రజల జన్ ధన్ ఖాతాలకు ఎంతో కొంత డబ్బు జమ చేసే లక్ష్యానికి తిలోదకాలు ఇస్తున్నారని కేంద్ర అధికారులు చెబుతున్నారు.

డీమానిటైజేషన్ ద్వారా 3 లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఆదా చేసి జన్ ధన్ ఖాతాలలో కనీసం 50 వేలు జమ చేయాలని, తద్వారా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూకుమ్మడిగా ఓట్లు కుమ్ముకోవాలని మోడి పధకం వేశారు. (డీమానిటైజేషన్ – రీమానిటైజేషన్ లు ముగిశాక ఒక్కో జన్ ధన్ ఖాతాలో 50 వేల నుండి లక్ష వరకు మోడి జమ చేస్తారని ఉత్తర ప్రదేశ్ లో బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ తదితర హిందూత్వ కార్యకర్తలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. -ఫ్రంట్ లైన్)

కానీ రద్దయిన 1000/- 500/- నోట్లు మొత్తం 15.4 లక్షల కోట్లకు గాను ఇప్పటికే 14.6 కోట్లు జమ అయ్యాయని ఆర్‌బి‌ఐ నిర్ధారించినట్లుగా కొన్ని పత్రికలు చెప్పాయి. పాత నోట్ల డిపాజిట్ కు ఎన్‌ఆర్‌ఐ లకు జూన్ 2017 వరకు గడువు ఇచ్చారు కనుక ఇది ఇంకా పెరగవచ్చు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి డీమానిటైజేషన్ ద్వారా కేవలం 50 వేల కోట్లు మాత్రమే గిట్టనున్నాయని అధికారులను ఉటంకిస్తూ పత్రికలు చెప్పాయి. ఇంత హడావుడి చేసి, జనాన్ని నానా అగచాట్లకు గురి చేసి మోడి కూడగట్టిన నల్ల ధనం కేవలం 50 వేల కొట్లే అని అధికారికంగా తెలిసాక జనం స్పందన ఏమిటో చూడవలసే ఉన్నది.

నిజానికి 50 వేల కోట్లు కూడా మిగల కూడదు. కేష్ రిజర్వ్ రేషియో కింద ఆర్‌బి‌ఐ వద్ద ఉన్న డబ్బు కూడా కలిపితే 15.4 లక్షల కోట్ల కంటే ఇంకా ఎక్కువే రద్దయిన నోట్లు జమ అయినట్లు తేలాలి. కానీ ఈ లెక్కలను కేంద్రం బైటికి రానివ్వడం లేదు. ప్రతి వారం ఆర్‌బి‌ఐ చేత జమ అయిన పాత నోట్ల మొత్తానికి లెక్క చెప్పించిన కేంద్రం జమలు  ఎక్కువ కావడంతో లెక్కలు చెప్పడం మానిపించింది. అనగా లెక్కలను తారుమారు చేసేపనిలో పెద్దలు మునిగి ఉన్నారని స్పష్టం అవుతోంది. ఎంత తారుమారు చేసినా 14.6 లక్షల కోట్లు జమ అయినట్లు చెప్పక తప్పలేదులా ఉంది.

ఈ 50 వేల కోట్లు బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికి జమ చేసి, కొంత డబ్బు పెరిగిన పన్నుల ఆదాయంగా చూపించి (ఈ మేరకు పన్నుల ఆదాయం పెరిగిందని జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. ఎంత పెరిగిందో మాత్రం చెప్పలేదు) మొత్తం మీద జనానికి ఇస్తానన్న దానిని హుళక్కి చేసేస్తున్నారు.

కనుక మోడి ప్రభుత్వం బడ్జెట్ లోటును అనుకున్నట్లుగా తగ్గించేసి ఐ‌ఎం‌ఎఫ్, బహుళజాతి ఫైనాన్స్, రేటింగ్ కంపెనీలను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప పేద ప్రజలకు కాస్తయినా సహాయం చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదన్నమాట!

 

One thought on “Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s