RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి. 

అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ  సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు. 

తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి.

మాజీ గవర్నర్ తప్పు కోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చేత అదుపు లేని ఆరోపణలు చేయించారు. ఆయన వల్లే జీడీపీ పెరగడం లేదని, ఆయనకీ దేశభక్తి లేదని, అమెరికా పౌరుడని… ఇంకా ఏవేవో. ఈ ఆరోపణల లక్ష్యం రాజన్ తనంతట తానె తప్పుకునేలా చేయడం. 

ఎందుకని? ఎందుకంటే, ద్రవ్యోల్బణం పైన చూపుతో వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచుతున్నాడని రాజన్ పైన పరిశ్రమ వర్గాలు, స్వామి లాంటి నేతలు కత్తి గట్టారు. ఆయన తప్పుకోవాలని భావించారు. నేరుగా చెప్పలేక ‘పొమ్మన లేక పొగ పెట్టారు.’ 

ద్రవ్యోల్బణం పెరగడం అంటే ధరలు పెరగడం. ధరలు పెరగడం అంటే వ్యవస్ధలో ద్రవ్య చెలామణి ఎక్కువగా ఉండడం. కాబట్టి వడ్డీ రేటు పెంచి, లేదా తగ్గించకుండా కొనసాగించి అదనపు ద్రవ్యాన్ని చలామణి నుండి ఉపసంహరించడానికి RBI ప్రయత్నిస్తుంది. ఇది ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినా చేసే పనే. అయినా బీజేపీ గణాలు కత్తిగట్టి, రాజన్ ని పంపించారు.  

రాజన్ పోయాక RBI – వడ్డీ కోత/పెంపు లకు సంబంధించి కొన్ని పాలనా నిర్ణయాలు, కొన్ని విధాన నిర్ణయాలలో మార్పులు తెచ్చారు. 

పాలనా నిర్ణయాలు: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ని ఏర్పాటు చేయటం. ఇక ఇప్పుడు వడ్డీ రేటు మార్పులు గవర్నర్ ఒక్కరే కాకుండా కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సభ్యులను కొందరిని కేంద్రం నియమిస్తుంది. తద్వారా RBI నడకని తన నియంత్రణలోకి కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంది.

వాస్తవానికి ఏ దేశంలో నైనా సెంట్రల్ బ్యాంకు -చట్టం ప్రకారం- స్వతంత్రంగా వ్యవహరించాలి. చట్టాలలో కొన్ని సవరణలు తెఛ్చి RBI స్వతంత్రతను మోడీ ప్రభుత్వం హరించివేసింది. తద్వారా మానిటరీ విధానాల్లో ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు చేసే అవకాశాన్ని గవర్నర్ నుండి ప్రభుత్వం లాగేసుకుంది. కేంద్రం మాట వినక తప్పని పరిస్ధితిని కల్పించింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు మంచిది కాదు.

img_0386

విధాన నిర్ణయాలు: గతంలో రాజన్, ద్రవ్యోల్బణం 4 శాతంగా నిర్ణయించి దానిని సాధించడానికి 2018 సంవత్సరాన్ని గడువుగా పెట్టారు. ఇప్పుడు కమిటీ ద్వారా దీనిని 2021 కి పొడిగింపు జేశారు. మధ్య కాలిక ద్రవ్యోల్బణం లక్ష్యం 4% అనే చెబుతూ గడువుని మరో 3 ఏళ్ళు పొడిగించారు. అనగా స్వల్ప కాలిక లక్ష్యం కాస్తా మధ్య కాలిక లక్ష్యంగా మార్చారు. 

ఇందువల్ల ఏం ఒరిగింది? చాలా ఒరిగింది. ద్రవ్యోల్బణం లక్ష్యం దూరం జరిపితే వడ్డీ రేటుని తగ్గించే గడువు కూడా పెరిగింది. అనగా మరింత ఖాళి సమయం దొరికింది. గడువు దగ్గరగా ఉంటె దాన్ని సాధించాలన్న తొందరలో త్వరత్వరగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (ఆగస్టు 2016 నాటికీ) 5% ఉండగా, హోల్ సేల్ ధరల ద్రవ్యోల్బణం 5.05% (డిసెంబర్ 2015 నాటికి) ఉంది. కాబట్టి 4% లక్ష్యం చేరాలంటే వడ్డీ రేటు పెంచవలసి ఉంటుంది. 

ఎందుకని? ఎందుకంటే, ఇటీవల ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. ఇది నవంబర్ లో అమలులోకి రావచ్చుఁ. ఉత్పత్తి తగ్గితే ధరలు పెరుగుతాయి. మన ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రభుత్వాల పనితనం కానీ కాదు. చమురు ధరలు చారిత్రకంగా అత్యంత తక్కువగా ఉండడం వల్లనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నది. కాబట్టి చమురు ధరలు పెరిగితే ఇక ద్రవ్యోల్బణం పెరగడమే గాని తగ్గడం ఉండదు. కాబట్టి 2018 లోపు వడ్డీ రేటు తగ్గించే అవకాశం తక్కువగా ఉన్నది. పెంచడానికే అవకాశం కనిపిస్తున్నది తప్ప తగ్గించేందుకు కనిపించడం లేదు. 

గడువు పెంచితే లక్ష్యం సాధించేందుకు కావలసిన ఊపిరి/కాలం చిక్కుతుంది. ప్రస్తుతానికి వడ్డీ రేటు తగ్గించేసి లక్ష్యం చేరుకోవడానికి ఇంకా గడువు ఉన్నది కదా! అని తాము సంతృప్తి పడవచ్చూ, అడిగేవాడికి గట్టిగా చెప్పనూవచ్చు. 

మరో అంశం ఏమిటి అంటే రాజన్ వెళ్లే నాటికి న్యూట్రల్ రేటు 1.5% నుండి 2% వరకు ఉన్నదని అంచనా వేశారు. న్యూట్రల్ రేటు అంటే రిస్క్ లేని రేటు కి ద్రవ్యోల్బణ రేటుకి మధ్య ఉండే తేడా. సులువుగా చెప్పాలంటే ఒక దేశంలో ద్రవ్యోల్బణం స్ధిరంగా ఉన్నదని భావిస్తూ  ఆర్ధిక వ్యవస్ధ వాస్తవంగా ఎంత శాతం వృద్ధి అవుతున్నదో అంచనా వేస్తె అదే న్యూట్రల్ రేటు. రాజన్ ఉన్నప్పుడు భారత ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ అర్ధంలో (ద్రవ్యోల్బణం ప్రభావం తీసి వేస్తె) 1.5% నుండి 2% వరకు పెరుగుతోందని అంచనా వేయగా ఇప్పుడు ఆ అంచనాని 1.25% కి తగ్గించుకున్నారు. అనగా వృద్ధి రేటు అనుకున్నంతగా లేదని మోడీ ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ అంచనా వేస్తున్నాయన్నమాట!

కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో ఇది మొట్టమొదటి విత్త విధాన సమీక్ష. అధికారాలు పరోక్షంగా కత్తిరించబడిన రిజర్వ్ బ్యాంకుకు ఆయన ఇప్పుడు రాజు. ఆయన విత్త పాలన అనివార్యంగా కేంద్రం చెప్పు చేతల్లో ఉండబోతున్నదని, ఆర్ధిక మంత్రి – ఆర్బీఐ గవర్నర్ల మధ్య తగువులాట, అలకలు ఇక పెద్దగా ఉండకపోవచ్చని ఈ సమీక్ష చెబుతున్నది.