నల్ల డబ్బుకి సంబంధించి ఎన్నికల్లో నరేంద్ర మోడి ఇచ్చిన వాగ్దానం గుర్తుందా?
అధికారం లోకి రావడం తోటే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం అన్నారు. అలా తెప్పించిన డబ్బుని ఉపయోగ పెట్టి ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో రు 15 లక్షలు జత చేస్తాం అన్నారు. అనగా రు. 18 కోట్ల కోట్లు మేర భారతీయులు దాచిన నల్ల ధనం విదేశాల్లో మూలుగుతోంది అని చెప్పారు.
ఇంతదాకా ఆ డబ్బు వెనక్కి తెచ్చే సరైన కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటీ మొదలు పెట్టలేదు. ఆరంభంలో ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు, అంతే. మళ్ళీ అటువైపు చూస్తే ఒట్టు! అసలా హామీ ఆయనకు గుర్తుందో లేదో?!
ఈ రోజు ఆర్ధిక మంత్రి ఓ ప్రకటన చేశారు. తాము ప్రకటించిన ‘(రహస్య) ఆదాయ ప్రకటన పధకం’ (Income Declaration Scheme) కింద ఇప్పటి వరకు 65,250 కోట్ల మేర ఆస్తులను ప్రకటించారని ఆయన చెప్పారు. 64,275 మంది లెక్కలు చూపని నల్ల ఆదాయాన్ని ప్రకటించారని చెప్పారు. అంటే ఒక్కొక్కరు సగటున రు కోటికి కాస్త పైనే నల్ల డబ్బు ప్రకటించారు.
కేవలం ఒక కోటి నల్ల డబ్బు ఉన్నవాళ్ళు “స్వచ్ఛందంగా” ప్రకటించిన నల్ల డబ్బే 65 వేల కోట్లు దాటింది. అది కూడా విదేశాల్లో దాచిన డబ్బు కాదు, ఇండియాలో దాచిన డబ్బు. ఇక వందలు, వేల కోట్ల నల్ల డబ్బు దాచిన వాళ్ళు కూడా ప్రకటిస్తే? దానికి విదేశాల్లో దాచిన డబ్బుని కూడా జత చేస్తే?! ఊహించడం కూడా సాధ్యం కావటం లేదు సుమా!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి లెక్క తప్ప లేదన్నమాట! ఆయన చెప్పిన లెక్క ఏదో నోటి దురదతో చెప్పింది కాదన్నమాట! నిజంగా నిపుణులను కనుక్కుని, విదేశాల్లో నల్ల డబ్బు ఎంత ఉంటుందో అంచనా వేయించే ఆ లెక్క చెప్పారన్నమాట!
జన్ ధన్ పధకం ప్రకటించిన ప్రధాని ప్రతి ఒక్కరికీ ఉచితంగా బ్యాంకు ఖాతా ఉండేలా చేశారు. ఇక ఆయన నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ఒక్కో ఖాతాలో రు 10 లక్షలు వేయడమే మిగిలింది. మరి ఆ విదేశీ నల్ల డబ్బు ఎప్పుడు వెనక్కి తెస్తారు?
ఆ మధ్య ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ పేరుతో పనామా పేపర్లు లీక్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ పేపర్లలో కొందరు భారతీయుల పేర్లు కూడా బైటికి వచ్చాయి. ఆ పేపర్లను మన వాళ్ళు కూడా వెతికారట. వాటిలో 9,000 కోట్ల భారతీయ నల్ల ధనం ఉన్నట్లు తెలిసిందని, ఆ ఖాతాలకు సంబంధించి 50 కేసులు కూడా పెట్టామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంటే, ఎవరో లీక్ చేస్తే మన వాళ్ళు వెతుకుతారు తప్ప మన ప్రయత్నాలు ఏవీ ఉండవా?
స్విట్జర్లాండ్ బ్యాంకు HSBC మనకి భారతీయుల ఖాతాల పేర్ల జాబితా ఇచ్చింది. యూపిఏ హయాంలోనే ఆ జాబితా మనకు అందింది. దాన్ని బైట పెట్టడానికి యూపిఏ ప్రభుత్వం ఒప్పుకోకపోతే బిజేపి విమర్శించింది. బిజేపి ప్రభుత్వం వచ్చింది. అందునా అవినీతి పట్ల చండశాసనుడైన మోడి ప్రధాని అయ్యారు. అయినా వారి పేర్లు బైటపడవేల? బైట పెట్టమని సుప్రీం కోర్టు కోరినా ఎందుకు ఒగ్గడం లేదు?
ఇంతకీ, ఇప్పుడు నల్ల ఆదాయం ప్రకటించిన 64,275 మంది పేర్లు కూడా జైట్లీ గారు ఎవరికీ చెప్పరట! వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు గనక దానిని పాటిస్తామని చెప్పారు. మరి రు 15 లక్షలు ఖాతాలో వేస్తామని ఇచ్చిన హామీ మాట ఏమిటి?
జనానికి ఇచ్చిన హామీలనేమో గంగలో కలిపేస్తారా? కోటీశ్వరులకి ఇచ్చిన హామీలనేమో భద్రంగా నెరవేర్చుతారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనవచ్చునా?
ప్రకటించిన నల్ల ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని జైట్లీ చెప్పారు. కాబట్టి ప్రకటించిన మొత్తానికి మరింత డబ్బు జత చేరుతుందని ఆయన సంతోషంగా చెప్పారు.
ఈ మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుందా? అబ్బే, అదేం లేదు. ప్రకటించిన ఆదాయం పైన పన్ను, అపరాధ రుసుము వసూలు చేసి మిగిలింది ప్రకటించిన వాళ్ళకి ఇచ్చేస్తారు. పన్ను, రుసుము కలిపి 45% వసూలు అవుతుంది. ఆ లెక్కన రు 29,000 కోట్ల పై చిలుకు కేంద్రం బొక్కసంలో చేరుతుంది. దీనిని 120 కోట్ల మందికి పంచితే ఒక్కొక్కరికి జన్ ధన్ ఖాతాలో రు 245/- చేరుతుంది.
కానీ అలా జనం ఖాతాలో వెయ్యడం లేదు. ఆ డబ్బుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని జైట్లీ ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ప్రజా సంక్షేమం ఏమిటో నిర్దిష్టంగా చెప్పరు. అది రహస్యం! ఇంతోసి దానికి ప్రధాని గారు జైట్లీకి (ట్విట్టర్ లో) కంగ్రాట్స్ చెప్పడం కూడానా?
జనానికి ఇవ్వకపోతే పోయే, ప్రజా సంక్షేమానికి నిజంగా ఖర్చు పెట్టకపోతే మానే. కనీసం ఇక నుండైనా పెట్రోలు రేటు పెరగకుండా చూస్తారా? ఉల్లి, కంది తదితర పప్పులు, వేరు శనగ.. ఇత్యాది రేట్లు పెరగకుండా చూస్తారా? విదేశీ కంపెనీల కోసం మరిన్ని ప్రభుత్వ కంపెనీలని అమ్మకుండా ఉంచి ఉద్యోగాలని ప్రజల కోసం కాపాడతారా? ఎల్‌ఐసి, బ్యాంకులు, పెన్షన్, గ్రాట్యుటీ నిధుల్ని విదేశీ కంపెనీలకి అప్పగించే ఆలోచనల్ని మానేస్తారా?
అబ్బే, అది కుదరదు. కుదరదంటే కుదరదు! కుదరదు గాక కుదరదు!!
కుదరనప్పుడు ‘ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తాం’ అంటూ ఉత్తుత్తి కబుర్లు ఎందుకు, సొల్లు కాకపోతే?!