నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం

డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది. 

PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల రూపంలో సేకరిస్తాయి. సర్వే వివరాల ద్వారా PMI స్ధాయిని లెక్క కడతాయి. కంపెనీలనే నేరుగా సంప్రదించి సేకరించిన వివరాలు కనుక ఈ సూచిక అంచనాలు, అధికారిక ఫలితాల ప్రకటనతో దాదాపు సరిపోలుతాయి. అందువలన ఆర్ధిక సర్వే సంస్ధల PMI లను ఆర్ధిక విశ్లేషకులు, మార్కెట్ పండితులు, ప్రభుత్వ అధికారులు విశ్వాసం లోకి తీసుకుంటారు. 

PMI సూచిక 50 పాయింట్ల వద్ద భిన్న ధోరణులను ప్రతిబింబిస్తుంది. 50 పాయింట్లకు తక్కువ నమోదు అయితే ఆ రంగంలో జీడీపీ వృద్ధి (growth) లేదా విస్తరణ (expansion) చెందడానికి బదులు కుచించుకున్నదని (contraction) అర్ధం. 50 పాయింట్లకు ఎక్కువగా PMI నమోదైతే ఆ రంగం వృద్ధి చెందిందని లేదా విస్తరించిందని అర్ధం. 

డిసెంబర్ నెలకు గాను భారత సేవల రంగం యొక్క PMI, 46.8 పాయింట్లుగా నమోదు అయిందని నిక్కీ తెలియజేసింది. నవంబర్ నెలలో సేవల రంగం PMI , 46.7 గా నమోదైందని నిక్కీ గత నెలలో తెలిపింది. అనగా నవంబర్ నెలకూ, డిసెంబర్ నెలకూ సేవల రంగం జీడీపీ లో ఏ మాత్రం తేడా లేదు. నవంబరు నెలలో వలెనె డిసెంబర్ లో కూడా సేవల రంగ జీడీపీ పతనం కానున్నది. 

భారత దేశ జీడీపీలో సేవల రంగానిదే అత్యధిక వాటా. 55 శాతం నుండి 60 శాతం వరకూ సేవల రంగం నుండే భారత జీడీపీ సమకూరుతుంది. సాఫ్ట్ వేర్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వ్యాపార సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, స్టోరేజి మొ.న రంగాలు సేవల రంగం కిందికి వస్తాయి. డీమానిటైజేషన్ వాళ్ళ హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం కుదేలయింది. భీమా రంగంలో చెల్లింపులు, కొత్త వ్యాపారం తీవ్రంగా దెబ్బ తిన్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రజల నుండి బ్యాంకులకు చేరడమే తప్ప కొత్తగా ఫైనాన్స్ ఉత్పత్తి జరగలేదు. అనగా కొత్త రుణాల పంపిణి జరగలేదు. ప్రజల లిక్విడిటీని 86% రద్దు చేయడంతో వ్యాపారాలు నడవలేదు. ప్రయాణాలు కొన్ని వాయిదా పడ్డాయి; కొన్ని రద్దయ్యాయి. ఇవన్నీ అనివార్యంగా సేవల రంగం జీడీపీ వృద్ధిని దెబ్బ తీశాయని నిక్కీ ఇండియా సర్వీసెస్ సంస్ధ తెలిపింది. 

సేవల రంగంలోని ఉప విభాగాలు అన్నింటిలో హోటళ్లు, రెస్టారెంట్ల రంగం అత్యధికంగా కుచించుకుపోయిందని నిక్కీ తెలిపింది. సేవల రంగ కుచింపు కేవలం ఒకటి రెండు ఉప అంగాలకు పరిమితం కాలేదని, దాదాపు ఉప అంగాలన్నీ డీమానిటైజేషన్ ప్రభావానికి గురయ్యాయని కనుక ఇది తిరిగి వృద్ధి బాట పట్టడం వెంటనే జరిగేది కాదని నిక్కీ తెలిపింది. 

అనగా కొందరు ఆర్ధిక విశ్లేషకుల అంచనాలను నిక్కీ ధ్రువపరుస్తున్నది. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్ప కాలం మాత్రమే ఉంటుందని, వ్యవస్ధలో నోట్ల చెలామణి పుంజుకున్న వెంటనే ఆర్ధిక వృద్ధి తిరిగి గాడిన పడుతుందని ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు నమ్మ బలికారు. 

అయితే అరుణ్ కుమార్ లాంటి ఆర్ధికవేత్తలు వారి విశ్లేషణతో విభేదించారు. డీమానిటైజేషన్ ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ లోతులకు విస్తరించిందని, ఆర్ధిక చక్ర గమనాల గమనాన్ని ఆటంకపరిచి నిలిపివేసింది, అది తిరిగి వేగం పుంజుకోవాలంటే సమయం పడుతుందని వారు చెప్పారు. నిక్కీ కూడా అదే చెబుతున్నది. డీమానిటైజేషన్ ప్రభావం వివిధ ఉత్పత్తి రంగాల వ్యాపితంగా విస్తరించినందున, అవి తిరిగి ఉత్పత్తి సైకిల్ లో ప్రవేశించడానికి సమయం పడుతుందని నిక్కీ స్పష్టం చేసింది. ఆర్ధిక మంత్రి జైట్లీ ఈ అంశాలను పరిగణించక తప్పదు. లేనట్లయితే ఆర్ధిక వ్యవస్ధకు మరింత హాని చేసినవారవుతారు.             

సేవల రంగంతో పాటు ఫ్యాక్టరీ ఉత్పత్తి PMI సూచిక కూడా పతనాన్ని సూచిస్తున్నది నిక్కీ తెలిపింది. ఫలితంగా కీలక రంగాల ఉమ్మడి సూచిక నవంబర్ నెలతో పోల్చితే బాగా తక్కువ నమోదు చేసిందని తెలిపింది. నిక్కీ ఇండియా కాంపోజిట్ PMI ఉత్పత్తి సూచిక నవంబర్ లో 49.1 పాయింట్లు నమోదు కాగా అది డిసెంబర్ నెలలో 47.6 పాయింట్లకు పడిపోయిందని తెలిపింది. 

“మాన్యుఫాక్చరింగ్ PMI తో కూడా కలిపి చూస్తే, భారత జీడీపీ మూడవ క్వార్టర్ లో (అక్టోబర్-నవంబర్-డిసెంబర్ 2016) వృద్ధిని నమోదు చేస్తుంది గాని, అది బాగా తగ్గిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సేవల ప్రొవైడర్ల వ్యాపార నమ్మకం (మోడీ తరచూ చెప్పే బిజినెస్ కాన్ఫిడెన్స్) గత 11 సంవత్సరాలలో అత్యల్ప స్ధాయికి పడిపోయింది. కాబట్టి డీమానిటైజేషన్ ప్రభావం నుండి త్వరగా కోలుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు” అని నిక్కీ PMI నివేదిక తయారు చేసిన పాలియన్నా డి లిమా చెప్పారని ద హిందూ బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. 

బ్లాక్ మని పై పోరాటం అంటూ అబద్ధాలు చెప్పి, చివరికి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ అంటూ ఊదరగొడుతున్న మోడీ, జైట్లీలు తమ తుగ్లక్ చర్య ద్వారా ప్రజలకే కాకుండా భారత ఆర్ధిక వ్యవస్ధకు ఎంతటి కష్టాలు, నష్టం తెచ్చారో ఇప్పటికైనా గ్రహిస్తారా అన్నది అనుమానమే.