చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకునేందుకు చమురు ఉత్పత్తి – ఎగుమతి దేశాల కూటమి OPEC (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) నిర్ణయించింది. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
గత నాలుగైదు ఏళ్లుగా చమురు ధరలు అత్యంత అధమ స్ధాయిలో కొనసాగుతున్నాయి. ధరలు ఎంతగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల భారత దేశం లాంటి చోట్ల ప్రజలకు అందకుండా ఆయా కేంద్ర ప్రభుత్వాలే అడ్డు పడ్డాయి. చమురు ధరలు తగ్గిన మేర కస్టమ్స్ సుంకాలు, ఇంకా అనేక తరహా పన్నులు జనం నుండి వసూలు చేశాయి. ఇండియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు పన్నులు మోది ధరల తగ్గుదల కాస్త కూడా జనానికి అందకుండా చేశాయి.
చమురు ధరలు భారీ మొత్తంలో తెగ్గోయడానికి కారణం భౌగోళిక ఆధిపత్య రాజకీయాలు. మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో తన ఆధిపత్య, సామ్రాజ్యవాద విస్తరణ యుద్ధాలకు, ఎత్తులకు అడుగడుగునా అడ్డు పడుతున్న రష్యా, అమెరికా ల ఆర్ధిక వ్యవస్ధలను నష్టపరిచేందుకు, దక్షిణ అమెరికాలో తన ఆధిపత్యానికి సవాలుగా అవతరించిన వెనిజులా, ఈక్వడార్ తదితర దేశాల ఆర్ధిక వ్యవస్ధలను నాశనం చేసేందుకు సౌదీ అరేబియా, అమెరికా దేశాలు అత్యధిక మొత్తంలో చమురు ఉత్పత్తి మొదలు పెట్టాయి. అమెరికా తన భూభాగంపై షేల్ గ్యాస్ తవ్వకాలు జరుపుతూ మార్కెట్ ని ముంచెత్తింది. దానితో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా ఒపెక్ దేశం కానప్పటికీ ఆ ప్రభావాన్ని అనివార్యంగా ఎదుర్కొంటుంది.
అమెరికా ఆశించినట్లుగానే రష్యా, వెనిజులా, ఈక్వడార్ లు తీవ్ర ఆర్ధిక సమస్య ఎదుర్కొన్నాయి. చైనాతో భారీ చమురు, గ్యాస్ సరఫరా ఒప్పొందాలు చేసుకోవడం ద్వారా రష్యా ఆర్ధిక సమస్యలను అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ అమెరికా ఆసించినట్లుగా మధ్య ప్రాచ్యంలో (సిరియా, టర్కీ) గాని, ఉక్రెయిన్ లో గాని అమెరికా అదిలింపులకు లొంగలేదు. వెనిజులా మాత్రం ఇప్పటికీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల ఆదాయాలు పడిపోయి, దిగుమతులు తగ్గి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ప్రజలను అమెరికా అనుకూల ప్రతిపక్షాలు అల్లర్లకు రెచ్చగొట్టే వరకు పరిస్ధితి వెళ్ళింది.
చమురు ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు ధరలు పెరుగుతాయి. తద్వారా రష్యా, వెనిజులా తదితర దేశాల ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయంతో దిగుమతులు పెంచుకుని సరుకుల కొరత (వెనిజులా) తీర్చుకునే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రకటించిన ఉత్పత్తి కోత అంత ఎక్కువేమీ కాదు. రోజుకు 700,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గిస్తారు. ప్రస్తుత ఉత్పత్తి అంచనా 33.24 మిలియన్ బ్యారెళ్లతో పోల్చితే ఈ తగ్గింపు చాలా తక్కువ. 33.24 మిలియన్ బ్యారెళ్ల నుండి 32.5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్ కూటమి ప్రకటించింది.
ఉత్పత్తి తగ్గుదలకు ఉన్న మరో ఆటంకం సౌదీ అరేబియా – ఇరాన్ ల మధ్య విభేదాలు. అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం రీత్యా అంతర్జాతీయ మార్కెట్ లో సాపేక్షికంగా స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం ఇరాన్ కు లభించింది. ఇది సౌదీకి ఇష్టం లేదు. ప్రాంతీయంగా ఇరాన్ ను పోటీదారుగా పరిగణించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్, యూరప్, అమెరికాలతో కలిసి ఇన్నాళ్లు కుట్రలు చేసింది. చమురు ఉత్పత్తి తగ్గించాలంటే అది సౌదీ అరేబియా చేయాలని ఇరాన్, కాదు ఇరాన్ చేయాలని సౌదీ పోటీ పెట్టుకున్నాయి. ఈ కారణం కూడా చమురు ధరల్లో, ఉత్పత్తి తగ్గింపులో ప్రతిష్టంభన ఏర్పడేందుకు దారి తీసింది.
ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ ఏ దేశం ఎంత తగ్గించాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు. వచ్చే నవంబర్ లో మరో సారి సమావేశమై నిర్ణయిస్తామని కూటమి దేశాలు చెబుతున్నాయి.
చమురు ధరలు పెరిగితే ఇండియా లాంటి చోట్ల ధరలు ఇంకా పెరుగుతాయా? లెక్క ప్రకారం చుస్తే ధరలు పెరిగినంత మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను తగ్గించి వినియోగదారులకు ధరల్లో తేడా రాకుండా చూడాలి. అలా కాకుండా ధరలు పెంచడానికే మోడీ, బాబు ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం ఖాయం. పెట్రోలు ధర లీటర్ కి రు 100 దాటినా ఆశ్చర్యం లేదు.
ఒపెక్ ప్రకటనతో చమురు ధరలు ఇప్పటికి 5 శాతం పెరిగి బ్యారెల్ కు 48 డాలర్లకు చేరింది. ఒపెక్ దేశాలు ఒక ఒప్పందానికి రావడం పట్ల వాణిజ్య కంపెనీలు సంతోషం ప్రకటిస్తున్నాయి. 8 సం.ల తర్వాత ఒపెక్ కూటమి ఒక మాట మీదికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి సంతోషం ధరలు పెరిగేందుకు దోహదం చేసింది. ఇరాన్, లిబియా, నైజిరియాలు వాటి గరిష్ట సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తామని సౌదీ ఎనర్జీ మంత్రి ప్రకటించడంతో మార్కెట్ మరింత ఉత్సాహాన్ని పుంజుకుంది.
ఉత్పత్తి తగ్గింపు సౌదీ అరేబియా ను కూడా నష్టపరిచింది. సౌదీ ఆర్ధిక వ్యవస్ధ స్తంభనకు గురి కాగా 98 బిలియన్ డాలర్ల మేర బడ్జెట్ లోటు ఎదుర్కొంటున్నది. సౌదీ చమురు సంపదలు సౌదీ రాజు సొంతం. దానితో బడ్జెట్ లోటును పూర్తిగా ప్రజల మీదికి నిర్నిరోధంగా తరలిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు సైతం తగ్గించేశారు. రాజు మాత్రం నష్టాన్ని భరించడం లేదు. కొన్ని విదేశీ ఆస్తుల్ని అమ్మినప్పటికీ వాటిని పూడ్చుకోవటం సౌదీ రాజుకు పెద్ద సమస్య కాదు.