పాచికలో ఒపెక్ పాత్ర -ద హిందూ…

ప్రపంచ చమురు మార్కెట్ లో సరఫరా, గిరాకీ (డిమాండ్) ల మధ్య సమతూకం నెలకొల్పే ప్రయత్నంలో రోజుకి 700,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని ఉమ్మడిగా తగ్గించడానికి అల్జీర్స్ లో జరిగిన అసాధారణ సమావేశంలో చమురు ఎగుమతి దేశాల సంఘం (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ -ఒపెక్) కుదుర్చుకున్న ఒప్పందం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్లుగా దిగజారుతున్న ప్రపంచ క్రూడ్ ధరలు మరింత పడిపోకుండా నిలబెట్టడానికి ఈ గ్రూపు నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ జారుడు వలన 2014 ఆగస్టు  చివర్లో బ్యారెల్ కు 103 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ ఈ ఏడు సెప్టెంబర్ 1 నాటికి సగానికి పైగా పడిపోయి 45.5 డాలర్లకు చేరింది. అయినప్పటికీ ఉత్పత్తి కోతలకు సంబంధించి విభేదాలతో, వివక్షలతో నిండిన ఒపెక్ సభ్య దేశాల మధ్య అర్ధవంతమైన ఏకాభిప్రాయం ఉన్నది లేనిది అస్పష్టంగానే ఉన్నది -ఈ గ్రూపులో అతి చిన్నదే అయినా సంపన్నవంతమైన పశ్చిమాఫ్రికా దేశం గాబన్ -సంక్షోభాలలో మునిగి తేలుతున్న వెనిజులా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి ముఠాలతో నిండిన పశ్చిమాసియా దేశాలు ఈ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఒక్కో దేశం నిర్దిష్టంగా ఉత్పత్తిలో ఎంత కోత విధించుకోవాలన్న అంశాన్ని నవంబర్ లో జరగనున్న సమావేశానికి వదిలివేసినప్పటికీ, 56 ఏళ్ళ వయసు గల ఈ సంస్ధలోని అత్యధిక చమురు ఉత్పత్తి దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు పరిస్ధితి ఎంతటి నిస్పృహాత్మకంగా మారిందో ఈ ఒప్పందం తెలియజేస్తున్నది. గత 8 ఏళ్లలో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఉత్పత్తి కోత, ఒపెక్ లో అతి పెద్ద ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా అనుసరించిన ‘ఇష్టారీతిన ఉత్పత్తి తీసే’ విధానాన్ని, తాను ప్రధానంగా ఏ ఉత్తర అమెరికా దేశాలనైతే -అమెరికా షేల్ ఉత్పత్తి ప్రయోజనాలతో సహా- లక్ష్యంగా పెట్టుకుని అనుసరించిందో ఆ దేశాలను ఎంతగా నష్టపరిచిందో, తనను కూడా అంతే నష్టపరిందని -బహుశా అంతకంటే ఎక్కువే నష్టపరిచి వుండవచ్చుఁ కూడా- ఆ దేశం పరోక్షంగా అంగీకరించినట్లే.   

అమెరికా బడా షేల్ ఉత్పత్తిదారులు తీవ్ర ప్రతిఘటన ధోరణితో తమ నిర్ణయానికి అంటిపెట్టుకుని ఉండగా -ఈ ఏడు మరిన్ని ఎకరాలలో పెట్టుబడిని విస్తరించారు కూడాను- సౌదీ అరేబియా బడ్జెట్ లో పెద్ద కంత ఏర్పడింది. 2015 లో కోశాగారా లోటు (బడ్జెట్ లోటు) ఆ దేశ జీడీపీ లో 16% గా నమోదు కాగా ఈ ఏడు కాస్త తగ్గి 13% మేర నమోదు కావొచ్చని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తన ఖర్చులను తగ్గించుకోక తప్పలేదు; ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలను సైతం అది తగ్గించుకోవలసి వచ్చింది. ఈ సంవత్సరం, గత పదేళ్లలో మొట్టమొదటి సారిగా సౌదీ రాజు విదేశీ రుణాలు -వచ్చే ఐదేళ్ళలో 10 బిలియన్ డాలర్లు- సేకరించేందుకు పూనుకోవలసి వచ్చింది. 2016 లో సౌదీ ఆర్ధిక వృద్ధి 1 శాతానికి నెమ్మదించనున్న నేపథ్యంలో ఆ దేశం తన ఆర్ధిక వ్యవస్ధకు ప్రధాన ఇంజన్ అయిన క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి వైపుకే తిరిగి రావటం తప్ప మరో దారి లేదు. ఈ (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలోని ఘర్షణలతో నిండా మునిగి ఉన్నందున -యెమెన్ లో ప్రత్యక్షంగానూ, సిరియాలో పరోక్షంగానూ- ప్రతి బ్యారెల్ చమురుకు మరింత ఆదాయం పిండుకోవాలని, బహుశా సౌదీ పాలకులు నిర్ణయించుకుని ఉండవచ్చు. ఒప్పందంలో ఇరాన్ ని కూడా భాగస్వామిని చేయడం కోసం తక్షణ ఉత్పత్తి కోత నుండి ఇరాన్ కి మినహాయింపు ఇవ్వడానికి ఒపెక్ అంగీకరించినట్లు  తెలుస్తున్నది. చమురు డిమాండ్ గతంలో అంచనా వేసినదాని కంటే వేగంగా క్షీణిస్తుండడంతో చమురు ధరలను పునరుద్ధరించడంలో ఉత్పత్తి కోత చర్య యొక్క విజయం, నిర్ణయాన్ని పాటించడంలో గ్రూఫు సభ్య దేశాల క్రమ శిక్షణ పైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది -గతంలో ఈ క్రమ శిక్షణే లోపించడం గమనించవలసిన విషయం.

*********

రెండేళ్ల నుండి అమెరికా షేల్ గ్యాస్ క్షేత్రాల నుండి చమురు, సహజ వాయువుల నుండి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నది. అమెరికా ఉత్పత్తి సౌదీ అరేబియాకు పోటీగా మారిందని, అమెరికా షేల్ ఉత్పత్తిని నిరుత్సాహపరిచేందుకు సౌదీ అరేబియా ‘చిత్తానుసారం ఉత్పత్తి తీసే’ ఎత్తుగడను అనుసరిస్తున్నదని అందువల్లనే చమురు ధరలు అమాంతం పడిపోయాయని ద హిందూ సంపాదకీయం చెబుతున్నది. ఈ వాదనలో నిజం పాళ్ళు చాలా తక్కువ. సౌదీ అరేబియాలో చమురు వెలికి తీసున్నది ప్రధానంగా అమెరికా కంపెనీలే. కనుక అమెరికా షేల్ క్షేత్రాల వల్ల నష్టం అంటూ జరిగితే దానివల్ల అమెరికా కంపెనీలే ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కనుక చమురు ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడంలో అమెరికాకు వ్యతిరేకంగా సౌదీ పాల్పడుతున్న కుట్రదే పాత్ర అని చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. 

చమురు ధరల పతనం వల్ల సౌదీ అరేబియా బాగా నష్టపోయింది అనడంలో సందేహం లేదు. కానీ ఆ నష్టాన్ని అమెరికా షేల్ క్షేత్రాల కంపెనీలు కూడా అంతే స్ధాయిలో ఎదుర్కొంటున్నాయి. అలాంటప్పుడు కుట్ర నుండి అమెరికాను మినహాయించడం నమ్మదగ్గది కాదు. అది కాక అమెరికా-సౌదీలు నమ్మకమైన మిత్ర దేశాలు. ఇటీవలి కాలంలో అమెరికా ఆర్ధిక శక్తి బలహీన పడుతూ భౌగోళిక రాజకీయాలలో రష్యా-చైనాల ప్రాబల్యం పెరుగుతున్నందున సౌదీ లాంటి దేశాలు అమెరికా శిబిరంలో కొనసాగడమా లేదా అని ఊగిసలాడుతుండడం కూడా ఒక వాస్తవమే. కానీ ఇది ఊగిసలాట వరకే ఉన్నది తప్ప పూర్తిగా శిబిరం మారడం మాత్రం జరగలేదు. ఒక జంఝాటంలో సౌదీ లాంటి దేశాలు ఉండడం నిజమే అయినా, అది పరస్పరం వాణిజ్య కొట్లాటకు దారి తీసే పరిస్ధితిగా మారలేదు. అమెరికాతో వాణిజ్య తగాదా మాములుగా ఉండదు. అమెరికాతో తగాదా వస్తే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నిశ్శబ్దంగా ఉండవు. తగాదా పడుతున్న దేశం పైన ఏడేడు సముద్రాలకు సరిపోని విషాన్ని కుమ్మరిస్తాయి. అలాంటిది అమెరికా-సౌదీ వాణిజ్య తగాదా పైన పశ్చిమ పత్రికలు సాదా సీదా విశ్లేషణలతో సరిపెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. 

చమురు ధరల పతనం వెనుక అమెరికా-సౌదీల ఉమ్మడి కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర లక్ష్యం రష్యాతో పాటు వెనిజులా లాంటి దక్షిణ అమెరికా చమురు ఉత్పత్తి దేశాలు. అమెరికాకు పక్కలో బల్లెంగా మారిన వెనిజులా, చమురు ధరల పతనం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలు అత్యంత తీవ్ర స్ధాయిలో కొనసాగుతున్నాయి. అమెరికా అనుకూల ప్రతిపక్షం వెనిజులా ప్రభుత్వాన్ని దాదాపు చక్ర బంధంలో పట్టి ఉంచగలుగుతోంది. పార్లమెంటు ఎన్నికలలో చావెజ్ పార్టీ ఓటమిని సైతం ఎదుర్కొన్నది. ఆ మేరకు అమెరికా కుట్ర లక్ష్యం చాలా వరకు నెరవేరినట్లే. ఒక్క రష్యా మాత్రమే అమెరికా ఊహించినట్లు లొంగి రాలేదు. అందుకు చైనా వాణిజ్య సహకారం మెండుగా తోడ్పడింది. 

పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో ప్రతీకార చర్యలు అమలు చేసిన వారికే ఎదురు తిరగడం సాధారణం. ప్రపంచ దేశాల మార్కెట్లు పరస్పరం పెనవేసుకుని ఉన్న నేపథ్యంలో ఒక చర్య ప్రభావం అలల వలే (ripple effect ) మల్లి బయలుదేరిన చోటికే తిరిగి వస్తుంది. అమెరికా, సౌదీ అరేబియాలకు చమురు ధరల పతనం ప్రభావం తమ వరకు వస్తుందని తెలియకుండా ఏమి పోలేదు. కానీ ఆ ప్రభావాన్ని, తమకు తాకే లోపు, అధిగమించవచ్చని అవి అంచనా వేసి ఉండవచ్చు. అనగా తాము లక్ష్యంగా  చేసుకున్న చోటికి వెళ్లి తమను తాకే లోపు ప్రత్యర్థి దేశం నష్టపోతాయని, ఆ తర్వాత తమ చర్యలను వెనక్కి తీసుకోవచ్చని అంచనా వేసాయి. ఆ మేరకు, వెనిజులా విషయంలో, వాటి అంచనా తప్ప లేదనే భావించవలసి ఉంటుంది. 

అలాగని అమెరికా – సౌదీల మధ్య పూర్తిగా స్నేహమే ఉన్నదని భావించనవసరం లేదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఉండలేవు. వివిధ శక్తుల మధ్య, శిబిరాల మధ్య పరిస్ధితిని బట్టి ఐక్యత, ఘర్షణలు సహజమే. కనుక పెట్టుబడిదారీ దేశాల మధ్య రీ గ్రూపింగ్ జరుగుతున్న క్రమంలో దాని ప్రభావం అమెరికా-సౌదీల సంబంధాల పైన కూడా పడుతున్నది. అయితే అటువంటి రీ గ్రూపింగ్ పాత్ర చమురు ధరల పట్నంలో అమెరికా-సౌదీల మధ్య ఘర్షణగా మారే విధంగా పని చేసింది అనటానికి తగిన పరిణామాలు ఏవి కనపడలేదు. కనుక ద హిందూ విశ్లేషణలో, పైన చెప్పినట్లు  వాస్తవాల మద్దతు, నామమాత్రంగా కనిపిస్తున్నది.