స్పెక్ట్రమ్ వేలం: లాభం 65 వేల కోట్లు, తప్పిన అంచనాలు!

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 4G స్పెక్ట్రమ్ పూర్తయింది. భారీ మొత్తంలో 4G స్పెక్ట్రమ్ ని వేలానికి పెట్టిన ప్రభుత్వానికి అంచనా వేసినంత భారీ ఆదాయం మాత్రం దక్కలేదు. కొన్ని కేటగిరీలలోని స్పెక్ట్రమ్ ని కంపెనీలు అసలు ముట్టుకొనే లేదు. బేస్ ధర చాలా ఎక్కువగా ఉన్నదని కంపెనీలు పెదవి విరిచాయి. మొత్తం మీద వేలంలో 65,789 కోట్ల మేర స్పెక్ట్రమ్ కొనుగోలు జరిగింది. అందులో ఈ సంవత్సరం రు 32,000/- ప్రభుత్వానికి ఆదాయంగా రానుంది. 

అమ్మకానికి పెట్టిన స్పెక్ట్రమ్ మొత్తం అమ్ముడు పొతే 5.65 లక్షల కోట్లు  ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 2354.55 మెగా హర్ట్జ్ ల స్పెక్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు. అందులో 965 MHz కు మాత్రమే కంపెనీల నుండి బిడ్లు అందాయి. ఇది మొత్తం స్పెక్ట్రంలో 41 శాతం మాత్రమే. 59% శాతం స్పెక్ట్రమ్ కు అసలు బిడ్ లు అందలేదు. 

700, 800, 900, 1800, 2100, 2300, 2500 MHz ల ఫ్రిక్వెన్సీల స్పెక్ట్రమ్ లు వేలానికి పెట్టగా వాటిలో 700, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ఒక్క బిడ్ కూడా రాలేదని తెలుస్తోంది. తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అత్యధిక విలువ కలిగి ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ తరంగాలు గోడల గుండా చొచ్చుకు వెళ్లగల శక్తిని కలిగి ఉంటాయి. ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు. కాబట్టి టవర్లు  ఎక్కువగా నిర్మించవలసిన అవసరం లేదు. బేస్ ధర అధికంగా ఉండటంతో తాము కొనలేకపోయామని కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

4G స్పెక్ట్రమ్ వేలం ద్వారా రు 98,995/- కోట్ల ఆదాయం వస్తుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో అంచనా వేశారు. 5.63 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ ధరకు గాను ముందస్తు ఫీజు కింద ఈ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ 41% స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడు కావడంతో ముందస్తు ఫీజు కూడా తగ్గిపోయింది. 700, 800, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ముందస్తు ఫీజు 25% గా నిర్ణయించగా ఇతర అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లకు ముందస్తు ఫీజు 50% గా నిర్ణయించారు. 

చిత్రంగా, ఆదాయం అంచనాకు తగ్గిపోయినప్పటికీ, కేవలం 41% మాత్రమే స్పెక్ట్రమ్ వేలంలో పోయినప్పటికీ వేలం విజయవంతం అయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రు 32,000 కోట్ల ఆదాయం రావటం తక్కువ మొత్తం కాదని టెలికం మంత్రి మనోజ్ సిన్హా గొప్పలు పోయారు. “5 ఏళ్లలో ఇదే అత్యధిక ముందస్తు ఫీజు” అని ఆయన భుజం చరుచుకున్నారు. బడ్జెట్ లో అంచనా వేసిన దాదాపు లక్ష కోట్లకు రు 32,000 కోట్లు మాత్రమే రావడం తక్కువ కాకుండా ఎలా పోయింది? ఎంత సేపూ వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడమే గాని, వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తూ  దాన్ని జనానికి చెప్పడం మంత్రులకు ఎప్పటికి సాధ్యం అయ్యేను? 

 

ఈసారి స్పెక్ట్రమ్ వేలం 5 రోజుల్లో పూర్తి కావడం గమనార్హం. అక్టోబర్ 1 న మొదలై సెప్టెంబర్ 5 తో బిడ్ లు పూర్తయ్యాయి. వాస్తవానికి సెప్టెంబర్ 29 నే వేలం మొదలు కావలసి ఉన్నది. కానీ దుర్ముహూర్తం అని ఎవరో చెప్పటంతో అక్టోబర్ 1 కి వాయిదా వేశారు. దుర్ముహూర్తాన్ని తప్పించినా వేలం వైఫల్యం (అనుకున్నంత ఆదాయం రాకపోవడం) మాత్రం తప్పలేదు అని అనుకోవచ్చా? 

2010 లో 2G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు 30 రోజులకు పైగా వేలం కొనసాగింది. 2010 లో 3G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు 10 రోజులకు పైగా వేలం కొనసాగింది. 4G స్పెక్ట్రమ్ వేలానికి వచ్చేసరికి 5 రోజులతో ముగిసిపోయింది. ఇదంతా దుర్ముహూర్తానికి అంటగట్ట వచ్చా? 

భారత దేశంలో అతి పెద్ద టెలికం కంపెనీగా పేరు పొందిన ఎయిర్ టెల్ కంపెనీ, తాము రు 14,244 కోట్లు ఖర్చు పెట్టి 173.8 MHz ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశామని ప్రకటించింది. 1800, 2100, 2300 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేశామని చెప్పింది. “ఈ వేలం ద్వారా వచ్ఛే 20 సం.లకు సరిపడా స్పెక్ట్రమ్ అవసరాలను కొనుగోలు చేసాము. ఈ కొనుగోలుతో 4G, 3G స్పెక్ట్రమ్ లకు సంబంధించి అన్ని సర్కిళ్లలోను ఇప్పుడు మేము స్పెక్ట్రమ్ సంపాదించినట్లయింది” అని ఎయిర్ టెల్ చెప్పింది. 

వోడా ఫోన్ కంపెనీ తాము రు 20,000 కోట్లకు పైగా పెట్టుబడితో తాజా వేలంలో కొనుగోళ్లు జరిపామని తెలిపింది. 

రు 13,672 కోట్లు పెట్టి 22 సర్వీస్ ఏరియాలలో 269 MHz ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశామని రిలయన్స్ జియో తెలిపింది. “ఈ కొనుగోలుతో మా స్పెక్ట్రమ్ పాద ముద్రలను దేశ వ్యాపితంగా విస్తరించుకున్నాము. భారత దేశాన్ని ప్రపంచ డిజిటల్ లీడర్ గా అభివృద్ధి చెందేలా తీర్చి దిద్దెందుకు రిలయన్స్ జియో కట్టుబడి ఉన్నది” అని రిలయన్స్ జియో తన సొంత బాజా మోగించుకుంది. 

దేశ వ్యాపితంగా వైర్ లెస్ బ్రాడ్ బంద్ సేవలు అందించే శక్తిని ఈ వేలం ద్వారా సంపాదించామని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. తాము రు 12,798 కోట్లతో 349.20 MHz ల స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేశామని కంపెనీ తెలిపింది. “4G LTE టెక్నలాజి రంగంలో మేము ప్రధానంగా కేంద్రీకరిస్తాం. 100 కోట్ల మందికి పైగా భారతీయులకు ఈ టెక్నలాజి అందించాలని మా లక్ష్యం” అని ఐడియా కంపెనీ ప్రకటించింది.