మన ప్రధాన మంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులు, చివరికి ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎఫ్.డి.ఐ లు, ఎఫ్.ఐ.ఐ ల కోసం పరితపిస్తూ ఉంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు గత పదేళ్ళలో కాలికి బలపం కట్టుకుని మరీ ఏ ప్రధాన మంత్రీ తిరగనన్ని దేశాలు తిరిగి “ఇండియా రండి, పెట్టుబడులు పెట్టండి. ఏ దేశమూ ఇవ్వనన్ని లాభాలు మోసుకు పొండి” అని అభ్యర్ధించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలయితే ఎఫ్.డి.ఐ ల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఒక రాష్ట్రానికి రావలసిన కంపెనీ మరో రాష్ట్రం మరిన్ని లాభాలు, సౌకర్యాలు ఆశ చూపిస్తూ ఆ కంపెనీని తమ రాష్ట్రానికి తన్నుకుపోయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి కూడా.
ప్రభుత్వాలు ఈ రకంగా ఉంటే భారత కార్పోరేట్ కంపెనీలు సైతం విదేశీ ఇన్వెస్ట్^మెంట్ బ్యాంకుల నుండి అప్పుల కోసం వెంపర్లాడుతూ ఉంటాయి. అంబాని, అదాని మొదలు కొని ఆంద్ర ప్రదేశ్ లోని జిఎంఆర్ వరకూ ఇలా వాల్ స్ట్రీట్, లండన్ లలోని ఫైనాన్స్ కంపెనీల నుండి అప్పుల కోసం దేబిరించే వాళ్ళే. అప్పు ఇవ్వడానికి లండన్ లేదా వాల్ స్ట్రీట్ కంపెనీ అంగీకరిస్తే దానిని ఒక పెద్ద విజయంగా మన పెట్టుబడిదారులు సగర్వంగా ప్రకటించుకుంటాయి కూడా. వారి పాటకి ప్రభుత్వాలు తందానా అంటుంటాయి.
ఇలా భారత దేశానికి వచ్చే పెట్టుబడుల్లో “ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు” ఒక రకం. ఇవి ఎఫ్.ఐ.ఐ లలో భాగం. ఎఫ్.ఐ.ఐ అంటే Foreign Institutional Investments లేదా విదేశీ సంస్థాగత పెట్టుబడులు అని అర్ధం. వీటిని ఒక్కోసారి ఎఫ్.పి.ఐ (Foreign Portfolio Investments) లు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఎఫ్.ఐ.ఐ లు ఎఫ్.పి.ఐ లలో ఒక భాగం. ఈ చర్చ మరోసారి చూద్దాం.
అసలు విషయానికి వస్తే ఇలా మన ప్రధాన మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళరిగేలా తిరిగి దేశానికి రప్పించుకునే పెట్టుబడుల వల్ల ఎవరికీ లాభం కలుగుతోంది? ఆర్.బి.ఐ లెక్కల ప్రకారం చూస్తే దేశంలోకి వస్తున్న డాలర్ పెట్టుబడుల కంటే దేశం దాటి పోతున్న లాభాల డాలర్లే అధికంగా ఉంటున్నాయి.
మార్చి 2023తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియాలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 27 బిలియన్ డాలర్లు (రు 2.241 లక్షల కోట్లు) ఉండగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు ఇండియా చెల్లించిన లాభాలు అక్షరాలా 40 బిలియన్ డాలర్లు (రు 3.32 లక్షల కోట్లు). అంటే విదెశీ పెట్టుబడుల వల్ల భారత దేశానికి లాభం కలగక పోగా నష్టమే జరిగింది.
ఆర్.బి.ఐ ప్రకటించే బ్యాలన్స్ షీట్ లో “ఈక్విటీ మరియు పెట్టుబడి నిధుల షేర్లపై ఆదాయం” (Income on equity and investment fund shares) అన్న హెడ్/ఖాతా కింద మనకు ఈ వివరం కనిపిస్తుంది. విదెశీ బహుళజాతి సంస్థల (MNC) లాభాలు మొ.న వంటి వాటి ద్వారా వచ్చిన ఆదాయాల తరలింపు ఈ ఖాతా ద్వారా చూపిస్తారు. ఇలా ఇండియా నుండి విదేశీ కంపెనీలు లాభాలు తీసుకెళ్ళాలంటే డాలర్లలోనే తీసుకెళ్తాయి తప్ప రూపాయిలలో తీసుకెళ్లవు. రూపాయి అంటే వాటికి ఎర్ర ఏగాని కింద కూడా పనికిరాదు మరి!
మార్చి 2023తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తరలించుకెళ్ళిన 40 బిలియన్ డాలర్లు రికార్డు మొత్తం అని ఎకనమిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఎందుకంటే మార్చి 2021 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇలా విదేశీ కపెనీలు ఇండియా నుండి మోసుకు పోయిన లాభాలు 33 బిలియన్ డాలర్లు కాగా, మార్చి 2022తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో తీసుకెళ్ళిన లాభాలు 36 బిలియన్ డాలర్లు.
అంటే మార్చి 2020 కోవిడ్ వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తర్వాత మూడు సంవత్సరాలలో విదేశీ కంపెనీలు అక్షరాలా 109 బిలియన్ డాలర్లు లేదా రు. 9.047 లక్షల కోట్లు తమ పెట్టుబడులకు లాభాలుగా డాలర్ల రూపంలో పట్టుకుపోయాయి. ఇలా విదేశీ కంపెనీలు డాలర్ల లాభాలు తీసుకెళ్ళినప్పుడల్లా భారత దేశ విదేశీమారక ద్రవ్య నిల్వలు ఆ మేరకు తగ్గిపోతూ ఉంటాయి. కేంద్రం అప్పులు తెచ్చి ఆ లోటు పూడ్చుతూ ఉంటుంది.
నిజానికి మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం రుణాల ద్వారా సమకూర్చుకున్నవే. సెప్టెంబర్ 8, 2023 నాటికి ఇండియా వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 598.89 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇందులో బంగారం నిల్వలు 44.939 బిలియన్లు కాగా ఐ.ఎం.ఎఫ్ వద్ద ఉండే ఎస్.డి.ఆర్ (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) లు 18.195 బిలియన్లు. మిగిలినవి డాలర్, యూరో, యెన్ లతో కూడిన నిల్వలు.
కోవిడ్ వల్ల భయంతో తమ పెట్టుబడులు కాపాడుకునేందుకు తమ లాభాల్ని విదేశీ బహుళజాతి కంపెనీలు తలించాయి తప్ప మరో కారణం ఇందులో లేదు అని కొందరు అపాలజిస్టులు చెప్పబోతారు. కాని అది అవాస్తవం. అదే నిజం అయితే 1995 ప్రాంతంలో ఆసియా టైగర్ దేశాల్లో జరిగినట్లు లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎగిరిపోవాల్సి ఉంది. అలా జరగలేదు కదా!
కాబట్టి ఎఫ్.డి.ఐ/ఎఫ్.ఐ.ఐ/ఎఫ్.పి.ఐ పేరు ఏదైనా సరే విదెశీ బహుళజాతి ఫైనాన్స్ కంపెనీలు, ఇతర సంస్థాగత పెట్టుబడులు కేవలం లాభాల కోసమే ఇక్కడికి వస్తాయి తప్ప భారత దేశాన్ని, భారత జనాన్ని ఉద్ధరించడానికి కాదు. కాని మన పాలకులు ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ ల కోసం దేబిరిస్తూ ఉంటాయి. వాటి రాక కోసం దేశ ఆర్ధిక వ్యవస్థ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థలను, రెగ్యులేటరీ వ్యవస్థలను పార్లమెంటులో చట్టాలు చేసి మరీ రద్దు చేసి మాయం చేసేశారు. మన్మోహన్ హయాంలో మొదలైన ఈ తతంగం మోడీ హయాంలో కొత్త పుంతలు తొక్కుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉంది అంటే వారిని ఎన్నుకున్నది భారత ప్రజలు కాదు. విదేశీ కంపెనీలు, విదేశీ రాయబారులు, వాల్ స్ట్రీట్, లండన్, ఫ్రాంక్ ఫర్ట్, ప్యారిస్ తదితర ఫైనాన్స్ కంపెనీల సి.ఇ.ఓ లు ఏరి కోరి వారిని నియమించుకున్నట్లుగా ఉన్నది. యు.పి.ఏ హయాంలో ఈ ప్రక్రియ కాస్త మెల్లగా జరిగితే ఎన్.డి.ఏ హయాంలో ప్రభుత్వ సో కాల్డ్ సంస్కరణల వేగం ఉసేన్ బోల్ట్ స్థాపించిన రికార్డులను తిరగ రాస్తోంది.
మనలో మన మాట! అసలు పెట్టుబడి అనేది లాభం కోసం కాకుండా దీన జనోద్ధారణ కోసం పనిచేస్తుందటండీ, మరీ విడ్డూరం కాకపొతేనూ! మన పాలకులు చెప్పే కాకమ్మ కబుర్లని నెత్తిన పెట్టుకుని ఊరేగే మన మేతావుల కత ఇంకా విడ్డూరం!