ఇటలీ: యూరోని వదిలేస్తే తప్ప ఆర్ధిక వృద్ధి అసాధ్యం!

 

బ్రెగ్జిట్ రిఫరెండం అనంతరం ఈయూ సభ్య దేశాలలో క్రమంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. యూరో జోన్ నుండి బైట పడాలని కొన్ని దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తుంటే అసలు యూరోపియన్ యూనియన్ నుండే బైట పడాలని మరికొన్ని సభ్య దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

యూరో జోన్ నుండి బైట పడడం అంటే ఉమ్మడి కరెన్సీ యూరోని జాతీయ కరెన్సీగా త్యజించడం. యూరోపియన్ యూనియన్ నుండి బైట పడటం అంటే అసలు మొత్తంగా యూరోపియన్ ప్రాజెక్టు నుండి బయట పడటం. బ్రిటన్ తన సొంత కరెన్సీని కొనసాగిస్తూ  ఈయూ లో చేరింది. అనగా అది యూరో జోన్ లోని దేశంగా ఎన్నడూ లేదు. బ్రెగ్జిట్ రిఫరెండం ఈయూ నుండే బైటకు రావాలని నిర్దేశించింది. 

ఇటలీ యూరో జోన్ దేశం. తన సొంత జాతీయ కరెన్సీ ‘లీరా’ ను వదులుకుని 1999 లో యూరో జోన్ లో భాగం అయింది. ఈయూ సభ్య దేశమే యూరో జోన్ లో చేరగలదు. కనుక ఇటలీ ఈయూ సభ్య దేశం కూడా. ఇటలీ బ్యాంకులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని యూరోపియన్ బ్యాంకింగ్ అధారిటీ గత ఆగస్టులో నిర్వహించిన స్ట్రెస్ టెస్ట్ ఫలితంగా వెల్లడి కావటంతో అప్పటి నుండి యూరో వ్యతిరేక సెంటిమెంట్లు  ఆ దేశంలో విస్తృతం అయ్యాయి. 

ఇటలీకి 360 బిలియన్ యూరోల మేర చెడ్డ రుణాలు ఉన్నాయని స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) తెలిపింది. ఇటలీ యొక్క మొత్తం రుణాలలో ఇది 20 శాతంగా తెలుస్తున్నది. ఇందులో 200 బిలియన్ యూరోలు వసూలుకు అస్సలు సాధ్యం కాని రుణాలేనని స్ట్రెస్ టెస్ట్ లో తేలింది. విదేశాలలో ఇటలీ బ్యాంకులకు 550 బిలియన్ యూరోలు రుణాలున్నాయని BIS గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రుణాలు వసూలు కాక ఒక్క బ్యాంకు మూత పడినా ఆ ప్రభావం చేయిం రియాక్షన్ తరహాలో ఇతర బ్యాంకులకు వ్యాపిస్తుంది. ఫలితంగా ఇటలీ ద్రవ్య వ్యవస్ధ కూలిపోయి ఆర్ధిక సంక్షోభంగా బద్దలు అవుతుంది. ఈ ప్రభావం ఒక్క ఇటలీకె పరిమితం కాబోదు. ఇతర ఈయూ, యూరోజోన్ దేశాలకు వ్యాపిస్తుంది. 

ఉదాహరణకి ఇటలీ రుణాలలో 200 బిలియన్ యూరోలు ఫ్రెంచి బ్యాంకులవి కాగా 90 బిలియన్ యూరోలు జర్మనీ బ్యాంకులవి. కాబట్టి ఇటలీ బ్యాంకులు కూలిపోతే ఫ్రాన్స్ పైన తీవ్రంగా పడుతుంది. ఇటలీ బ్యాంకుల్లో ఫ్రాన్స్ కంటే తక్కువ రుణాలు కలిగిన జర్మనీ పైన ఇటలీ దివాళా వాళ్ళ కలిగే ప్రభావం గ్రీసు దివాళా వాళ్ళ కలిగే ప్రభావం కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని BIS అంచనాల వేసింది. దానిని బట్టి ఫ్రాన్స్ పై కలిగే ప్రభావం ఏ పరిణామంలో ఉంటుందో గ్రహించవచ్చుఁ. ఇది అంతిమంగా మళ్ళీ ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగా పరిణామం చెందడానికి ఎన్నో రోజులు అవసరం లేదు. 

 

ఈ నేపథ్యంలో యూరో జోన్ నుండి బైటికి వస్తే తప్ప లేదా యూరో కరెన్సీని రద్దు చేసుకుని పాత జాతీయ కరెన్సీ లీరా ను పునరుద్ధరిస్తే తప్ప ఇటలీకి ఆర్ధిక వృద్ధి నమోదు చేయడం దుస్సాధ్యం అని లీగా నార్డ్ (నార్తరన్ లీగ్) పార్టీ నేత క్లాడియో బోర్గి హెచ్చరిస్తున్నారు. యూరో జోన్ ని వదిలించుకుంటే ఇటలీ ఆర్ధిక వ్యవస్ధకు మంచి రోజులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇటలీ ఆర్ధిక సార్వభౌమత్వం తిరిగి సంపాదించుకోవచ్చని స్పష్టం చేశారు. స్పుత్నిక్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇస్తూ  ఆయన ఈ మాటలు చెప్పారు. 

ఒక దేశ కరెన్సీ ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి విలువను -ఇతర దేశాలతో పోల్చితే- తెలిపే సాధనమని చెబుతూ ఆయన ఇలా చెప్పారు, “ఒక దేశ ఆర్ధిక అవకాశాలతో పోల్చితే ఆ దేశ కరెన్సీ విలువ మరీ అధికంగా ఉంటే ఆ దేశ ఉత్పత్తులు, సేవలు ఖరీదుగా మారి ఆ ఆర్ధిక వ్యవస్ధ కుప్ప కూలుతుంది. ఇది అందరికి తెలిసిన సత్యమే” అని బోర్గి చెప్పారు. 

బోర్గి ఉద్దేశం తమది కాని ఉమ్మడి కరెన్సీ వలన ఇటలీ సరుకుల విలువ అంతర్జాతీయంగా అసలు విలువ కంటే ఎక్కువ అయిందని దానితో అంతర్జాతీయ మార్కెట్ లో పోటీకి నిలబడ లేక ఎగుమతులు పడిపోతున్నాయని, దానితో ఉత్పత్తి పడిపోయి జీడీపీ వృద్ధి రేటు తగ్గుతున్నదని. 

ఇదే కారణం వలన 1999 లో అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్ధ కుప్ప కూలిందని బోర్గి గుర్తు చేశారు. అర్జెంటీనా ఆ నాడు తన కరెన్సీని డాలర్ కు సమానంగా నిర్ధారించుకున్నది. కొద్దీ కాలం పాటు బాగానే ఉన్నా త్వరలోనే ఆర్ధిక వ్యవస్ధ కుప్ప కూలింది. ద్రవ్యోల్బణం అవధులు దాటింది. అల్లర్లు చెల్లరేగాయి. రుణాలు తడిసి మోపెడు అయ్యాయి. ఆనాటి రుణాలు చెల్లించలేక ఇప్పటికి ఆ దేశం సతమతం అవుతున్నది. రుణాలు రైట్-ఆఫ్ చేయాలని కోరుతున్నది.   

కాబట్టి యూరో జోన్ నుండి బయటపడితే తమ సరుకుల ధరలు తామే నిర్ణయించుకునే సార్వభౌమాధికారం వస్తుందని కనుక యూరో ను వదిలి పెట్టాలని బోర్గ్ కోరుతున్నారు. ఈ అవగాహన ఇటలీ లో అనేకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని రెంజి మాత్రం అప్పుల భారాన్ని ప్రజలపై వేసి సంక్షోభం నుండి బైట పడాలని ప్రభోదిస్తున్నాడు. ఇది యూరో జోన్ సూత్రాలకు విరుద్ధం. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత చివరికి ఈయూ ఉనికికే ఎసరు తెస్తుందని జర్మనీ భయం. కనుక జర్మనీ అందుకు సుతరామూ ఒప్పుకోదు. 

ఈ ఘర్షణ మునుముందు మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు కూడా ఈయూ ఉనికి ఎసరు రాక మానదు. అది ఎంత దూరంలో ఉందన్నదే అసలు సంగతి!