అచ్ఛే దిన్ కనుచూపు మేరలో లేవు -మూడీస్

ప్రధాన మంత్రి మోడీ హామీ ఇఛ్చిన అచ్ఛే దిన్ ఎప్పటికి సాకారం అవుతాయని భారత ప్రజలు మాత్రమే అడగడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు కూడా అదే మాట అడుగుతున్నాయి. 

అయితే భారత ప్రజలు కోరే మంచి దినాలు, రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు ఒకటి కావు. పైగా పరస్పర విరుద్ధం. రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు వస్తేనేమో అవి ప్రజలకు చెందిన ఖనిజ, నీటి, మానవ వనరులను అన్నింటిని దోచి విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తాయి. భారత జనానికి మంచి దినాలు వస్తేనేమో వనరులు జనానికి ఉపయోగపెడతాయి. అనగా ప్రభుత్వ కంపెనీలు పెరుగుతాయి; ఉద్యోగాలు పెరుగుతాయి; ప్రయివేటీకరణ వెనక్కి వెళుతుంది; ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్ధలు పెరుగుతాయి.

క్రెడిట్ సుయిస్, స్విట్జర్లాండ్ కి చెందిన రేటింగ్ కంపెనీ. దాని పని బహుళజాతి కంపెనీలకు, ముఖ్యంగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు, కంపెనీలకు, బ్యాంకులకు, ద్రవ్య సంస్ధలకు రేటింగులు ఇవ్వడం. ఇతర ద్రవ్య వ్యాపారాలు కూడా ఆ సంస్ధ నిర్వహిస్తుంది గాని రేటింగ్ కి అది పేరు పొందింది. మంగళవారం ఒక నివేదిక వెలువరిస్తూ  ఆ కంపెనీ మోడీ హామీ ఇఛ్చిన సంస్కరణలు పని చేయడం మొదలయిందని పేర్కొంది. కానీ మూడీస్ దానిని నిరాకరించింది.  

ఆర్ధిక సంస్కరణలను లేదా నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని కదా అమెరికా, పశ్చిమ దేశాలు మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది! ఇప్పుడు అవి మోడీ పైన కూడా పెదవి విరిచేస్తున్నాయి. 

మూడీస్ కంపెనీ మంగళవారం మరో నివేదిక వెలువరించింది. ఓ రోజు క్రితం బ్యాంకుల పరిస్ధితి మెరుగు పడుతున్నదని చెప్పిన మూడీస్, ఆర్ధిక వ్యవస్ధ రేటింగ్ పెంచాలి అంటే మరో ఏడు లేదా ఏడున్నర ఆగాలన్నది. నెగిటివ్ గా చెప్పకుండా నెగిటివ్ సందేశం ఇచ్చిందన్నట్లు! “ఇండియా ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు చేయాలంటే మరిన్ని బలహీనతలను అధిగమించాల్సి ఉన్నది” అన్న ముక్క మాత్రం స్పష్టంగా చెప్పింది.

క్రెడిట్ సుయిస్ కంపెనీ కాస్త అనుకూలంగా చెప్పింది. “మోడీ విధానాలు ఖాళి వాగ్దానాలు కాదు. వాటిని అమలు చేసేందుకు గట్టి కృషి జరుగుతోంది. ఎట్టకేలకు ఇండియా ఫైరింగ్ మొదలు పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి” అని క్రెడిట్ సుయిస్ నివేదిక తెలిపింది. “కంపెనీలు ప్రభుత్వం నుండి సానుకూల అంశాలు చూస్తున్నాయి. (స్వదేశీ) పక్షపాతం లేకుండా ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ ను విదేశీ కంపెనీలకు ఇస్తున్నారు. స్పష్టమైన విధానాలు అమలు చేస్తున్నారు. మంత్రిత్వ శాఖలు త్వరితగతిన తమను తాము రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని సదరు నివేదిక పేర్కొంది. 

మూడీస్ ఇందుకు విరుద్ధంగా పేర్కొంది.   

“ఆర్ధిక వ్యవస్ధలో బలహీనత కొనసాగుతోంది. ప్రభుత్వ సావరిన్ రేటింగ్ (ప్రభుత్వం తీసుకునే అప్పుల రేటింగ్) పెంచాలంటే మరింత పురోగతి కావాలి. మరిన్ని సాక్షాలు కావాలి. వచ్ఛే ఒకటి, రెండు ఏళ్లలో అవి కనపడాలి” అని మూడీస్ కంపెనీ అధికారి మేరీ డిరోన్, ఓ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేసింది. 

“వేగవంతమైన ఫిస్కల్ విధానాలు అమలు చేస్తున్నట్లు మరింత సాక్షం కావాలి. మరిన్ని స్పష్టమైన సంస్కరణలు, బ్యాంకింగ్ రంగం ఆస్తుల క్వాలిటీ మెరుగుపరుస్తామన్న నిశ్చయం కావాలి” అని ఆమె పేర్కొంది.   

“సంస్కరణల అమలులో ప్రగతి కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రయివేటు రంగం పెట్టుబడులు ఇంకా బలహీనంగా ఉన్నందున రేటింగ్ అప్ గ్రేడ్ చేయాలంటే ఇంకా ఆగాలి. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గుర్తించడం మొదటి అడుగు. కానీ గుర్తించినంతనే సరిపోదు. వాటిని మెరుగుపరచాలి” అని మూడీస్ అధికారి పేర్కొంది.   

ఇతర స్వతంత్ర పరిశీలకులు కూడా మూడీస్ తో ఏకీభవిస్తున్నారు. Frontline పత్రికకు కాలమ్ రాసే సి పి చంద్ర శేఖర్ “గతం కంటే పరిస్ధితి మెరుగుపడింది అనడానికి కారణాలు ఏమి లేవు. జీడీపీ డేటా పైన ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. బ్యాంకుల్లో భారీ నిరర్ధక ఆస్తులు రుణాల స్వీకరణను దెబ్బ తీస్తాయి. ఫలితంగా డిమాండ్ పడిపోతుంది” అని చెప్పారు. 

“అలాగే, ద్రవ్యోల్బణం ఎప్పుడూ పరిమిత రేంజిలో లేదు. గ్లోబల్ ఆర్ధిక వ్యవస్ధ మందగించడం వలన మన ఎగుమతులు పడిపోతున్నాయి. దిగుమతులు కూడా పడిపోతున్నందున అది కనిపించడం లేదంతే” అని తెలిపారు చంద్ర శేఖర్. 

మోడీ విధానాలు పని చేస్తున్నాయని చెప్పే స్వతంత్ర పరిశీలకులు కూడా ఉన్నారు. అయితే వారి పరిశీలన కంపెనీలకు అనుకూలం కాగా, సి పి చంద్ర శేఖర్ పరిశీలనలో కాస్త ప్రజల పక్షపాతం వున్నది. 

క్రెడిట్ సుయిస్ చెప్పినట్లు  అచ్ఛే దిన్ వచ్ఛేసినా ప్రజలకు గడ్డు కాలమే. మూడీస్ కొన్నేళ్లు ఆగాలని చెప్పినా దానర్ధం ‘ముందుంది ముసళ్ల పండగ’ అనే అర్ధం. విదేశీ కంపెనీలు ‘శెభాష్’ అంటే ప్రోత్సాహం ఇఛ్చినట్లు! ‘ప్చ్!’ అని పెదవి విరిస్తే “ఇంకా చేయాలి’ అని హెచచరించినట్లు! వాళ్ళు ఏ మాట చెప్పినా జనానికి మాత్రం మూడినట్లే అర్ధం!