రాఫెలే ఫైటర్: ఫ్రాన్స్ తో ఒప్పందం ఖరారు!

36 రాఫెలే ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం ఖరారు చేసుకుంది. యూ‌పి‌ఏ హయాంలోనే కుదిరిన ఈ ఒప్పందాన్ని మోడి ప్రభుత్వం ఖరారు చేసింది.

7.87 బిలియన్ యూరోలు చెల్లించి 36 రాఫెలే ఫైటర్ జెట్ యుద్ధ విమానాలని ఇండియా కొనుగోలు చేస్తుంది. మన కరెన్సీలో ఇది రమారమి 58.94 వేల కోట్లకు రూపాయలకు సమానం.

రాఫెలే జెట్, MMRCA తరహా యుద్ధ విమానం. అనగా మీడియం మల్టీ-రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అర్ధం. రాఫెలేతో నాలుగు ఐరోపా దేశాల (జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ) ఉమ్మడి ఉత్పత్తి అయిన యూరో ఫైటర్ టైఫూన్, బోయింగ్ (అమెరికా) కంపెనీకి చెందిన సూపర్ హార్నెట్, లాక్ హిడ్ మార్టిన్ (అమెరికా) కు చెందిన F-16 ఫాల్కన్, రష్యాకు చెందిన MiG-35, స్వీడన్ కు చెందిన సాబ్ జే‌ఏ‌ఎస్ 39 గ్రిపెన్ లు పోటీ పడ్డాయి.

ఇండియా, యూ‌పి‌ఏ హయాం లోనే, యూరో ఫైటర్, డసాల్ట్ రాఫెలే లను షార్ట్ లిస్ట్ చేసింది. అంతిమంగా రాఫెలే ను ఎంపిక చేసుకుంది. అమెరికా కంపెనీలు రెండింటినీ తప్పించినప్పుడు అమెరికా మండిపడటం కూడా జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రాఫెలే వైపే మొగ్గు చూపడంతో అదే కాంట్రాక్టు గెలుచుకుంది.

Multi Role of Rafale
Multi Role of Rafale

ఫ్రెంచి రక్షణ మంత్రి జీన్ వేస్ ల డ్రియాన్, భారత రక్షణ మంత్రి మనోహర పరికర్ లు ఒప్పందం పైన ఢిల్లీలో సంతకాలు చేసారు. డసాల్ట్ కంపెనీ సి‌ఈ‌ఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఒప్పందంలో 36 ఫైటర్ జెట్ లు, ఆయుధాలు, విడిభాగాలు, మద్దతు మరియు నిర్వహణ… అన్నీ భాగంగా ఉంటాయి.

ప్రస్తుతం జరిగింది ప్రభుత్వాల మధ్య ఒప్పందం మాత్రమే. అసలు కాంట్రాక్టు పైన సంతకాలు జరగాల్సి ఉన్నది. కాంట్రాక్టు సంతకం అయిన 3 యేళ్లకు మొదటి జెట్ మనకు అందుతుంది. 30 నెలల లోపు చివరి ఫైటర్ జెట్ అందాలి. ఒప్పందం ప్రకారం, విమానాల సరఫరా పూర్తయ్యాక, ఏ సమయంలో నైనా కనీసం 75 శాతం విమానాలు (27) ఆపరేషన్ కు సిద్ధంగా ఉండాలి.

అలాగే కాంట్రాక్టు మొత్తంలో సగం విలువని తిరిగి ఇండియాలో పెట్టుబడిగా పెట్టాలని మరో షరతు. దీని అర్ధం సగం వెనక్కి ఇవ్వడం కాదు. కనీసం 30 వేల కోట్ల మేర ఇండియాలో ఎఫ్‌డి‌ఐలు గా రావాలని అర్ధం. ఎఫ్‌డి‌ఐల మోజు ఉన్నోళ్ళకి ఇది గొప్పగా కనిపిస్తుంది. ఎఫ్‌డి‌ఐలు దేశానికి చేస్తున్న నష్టం తెలిసిన వాళ్ళకి మన వేలితో మన కంటినే పొడుచుకోవడంగా అర్ధం అవుతుంది.

ఆరంభంలో 126 ఫైటర్ జెట్ ల కొనుగోలుకి (2007లో) టెండర్ లు ఆహ్వానించారు. చర్చలు వివిధ కారణాలతో కొనసాగుతూ పోవడంతో మోడి ప్రభుత్వం వచ్చిన తోడనే 36 జెట్ లను నేరుగా కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. మిగిలిన 90 జెట్ ల కొనుగోలుని ఇండియాలో తయారు చేయాలన్న షరతుతో కొత్త టెండర్ ఆహ్వానానికి మోడి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.