వీసా పోటీ: ఐరోపాకు విస్తరిస్తున్న రష్యా చెల్లింపు వ్యవస్ధ

రష్యా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధ ఐరోపాకు విస్తరించడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. పశ్చిమ దేశాలకు ఈ రంగంలో ఇప్పటి వరకు ఆధిపత్యంలో ఉండడంతో అమెరికా, ఐరోపాలు ఆడింది ఆటగా చెల్లిపోయింది. ఈ పరిస్ధితిని మార్చే లక్ష్యంతో రష్యా, చైనాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. 

మిర్ నేషనల్ పేమెంట్ సిస్టం (మిర్ జాతీయ చెల్లింపుల వ్యవస్ధ) పేరుతొ రష్యా తన సొంత జాతీయ మరియు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్ధను గత ఏడు ప్రారంభించింది. ఏప్రిల్ 1, 2015 తేదిన రష్యాలో ప్రారంభం అయిన ఈ వ్యవస్ధ ఇప్పుడు అంతర్జాతీయ చెల్లింపులకు కూడా విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు వీసా, మాస్టర్ కార్డు లతో చర్చలు జరుగుతున్నాయని నేషనల్ కార్డు పేమెంట్ సిస్టం (NSPK) అధిపతి వ్లాదిమిర్ కొమ్లెవ్ తెలిపాడు. 

ఉక్రెయిన్ లో అమెరికా, ఈయూ ప్రవేశ పెట్టిన  కృత్రిమ తిరుగుబాటుకు సహకరించడానికి రష్యా నిరాకరించడంతో పాటు క్రిమియా రిఫరెండంను గౌరవించి రష్యాలో కలిపేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యపై అమెరికా, ఈయూ లు ఆగ్రహించాయి. రష్యాపై ఆంక్షలు ప్రకటించి అమలు చేశాయి. ఆంక్షలలో భాగంగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధలో రష్యా వాణిజ్య చెల్లింపులను కొనసాగకుండా నిరోధించింది. ఫలితంగా రష్యా, తన సొంత ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించింది. రష్యాను కష్ట పెట్టి నష్టం తలపెట్టిన అమెరికా చివరికి రష్యాకు మేలు చేసింది. ఇప్పుడిక అంతర్జాతీయ ఆంక్షలతో రష్యా వాణిజ్యానికి నష్టం తెస్తానని అమెరికా బెదిరించేందుకు -ఒక కోణంలో- అవకాశం లేకుండా పోయింది. 

అమెరికా ఆంక్షలతో రష్యా వాణిజ్య చెల్లింపులను సాగకుండా నిరోధించిన పశ్చిమ చెల్లింపుల వ్యవస్ధలు వీసా, మాస్టర్ కార్డు తదితర వ్యవస్ధలు ఇప్పుడు తామే స్వయంగా రష్యన్ NSPK వ్యవస్ధతో సంబంధాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తుండటం గమనార్హం. 

“మేము వీసా తో చర్చలు జరుపుతున్నాము. ప్రపంచ చెల్లింపుల వ్యవస్ధలు ఇప్పటికే మమ్ములను ఆకర్షణీయ భాగస్వాములుగా గుర్తిస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలోనే మా కార్డు విస్తృతమైన నెట్ వర్క్ కలిగిన కార్డుగా అవతరించడం దానికి కారణం. ఇప్పుడు మూడు పెద్ద యూరోపియన్ ప్రాసెసర్ కంపెనీలు, ఉదాహరణకి ఫ్రాన్స్, జర్మనీలు, NSPK తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వారంతట వారే మమ్మల్ని సంప్రతించారు. యూరోపియన్ రిటైలర్ కంపెనీలు NSPK ద్వారా రష్యన్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని కొమ్లెవ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు (-ఇజ్వేస్తియా). 

NSPK ఇప్పటికే మాస్టర్ కార్డు, జేసీబీ, ఆమెక్స్, యూనియన్ పే తదితర చెల్లింపు వ్యవస్ధలతో ఒప్పందానికి వఛ్చినట్లు తెలుస్తున్నది. కేవలం రిటైలర్ కంపెనీల వరకే కాకుండా రిటైలర్ కంపెనీలతో కార్యకలాపాలు నిర్వహించే భారీ అగ్రిగేటర్ కంపెనీలతో కూడా కార్యకలాపాలు నిర్వహించే దశకు NSPK చేరుకున్నది. 

రష్యాపై ఆంక్షలను సంజ్ఞగా/సందేశంగా స్వీకరించిన చైనా సైతం తన సొంత చెల్లింపుల వ్యవస్ధను -CIPS (చైనా ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టం) – అభివృద్ధి చేస్తున్నది. ఈ వ్యవస్ధ దన్నుతో స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా తనను రుజువు చేసుకునేందుకు చైనా ప్రయత్నం చేసి సఫలం అవుతున్నది. అందులో భాగంగా IMF నిర్వహించే వివిధ అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్ లో ఒకటిగా చైనా కరెన్సీ రెన్ మిన్ బి / యువాన్ ను IMF గుర్తించింది.

వచ్చే అక్టోబర్ 1 నుండి IMF నిర్వహించే SDR బాస్కెట్ లో యువాన్ ఉనికిలోకి రానున్నది. SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అర్ధం. వీటిని అత్యంత భద్రమైన లిక్విడ్ ఆస్తులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి. ఆయా దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఇవి కూడా కలిసి ఉంటాయి. కాబట్టి యువాన్ SDR లో భాగం కావటం చైనా సాధించిన ఆర్ధిక విజయం. కాగా ఈ విజయం చైనా ప్రజల ప్రయోజనాలను, కార్మికవర్గం హక్కులను ఫణంగా పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యం అయింది.