పౌండ్: సెకన్లలో 10% పతనం

బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ శుక్రవారం లిప్తపాటు కాలంలో భారీగా పతనమై కలకలం సృష్టించింది. అనంతరం తిరిగి కోలుకున్నప్పటికీ పౌండ్ క్రాష్ తో ప్రపంచ మార్కెట్లు  ఒక్కసారిగా కలవర పడ్డాయి. 

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం అయ్యాక ఒక దశలో పౌండ్ విలువ 1.2600 డాలర్ల వద్ద ఉన్నది. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా పతనం కావడం మొదలయింది. ఎంత వేగంగా పతనం అయిందంటే కొద్ది సెకన్ల తర్వాత చూస్తే పౌండ్ విలువ 1.1378 డాలర్లుగా తెరల పైన ప్రత్యక్షం అయింది. ఇది 10 శాతం పతనంతో సమానం. 

ఇంతకీ పౌండ్ స్టెర్లింగ్ ఎందుకు క్రాష్ అయిందో ఎవరికీ అంతుబట్టలేదు. సాంకేతిక కారణం వలన (కంప్యూటర్ లో సాఫ్ట్ వేర్ బగ్) క్రాష్ అయి ఉంటుందని కూడా ఎవరు చెప్పకపోవడం విశేషం. స్టాక్ మార్కెట్లు ముఖ్యానంగా పశ్చిమ దేశాల స్టాక్ మార్కెట్లు  కంప్యుటర్ సాఫ్ట్ వేర్ ల సహాయంతో అత్యంత వేగంగా నడుస్తుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ట్రాఫిక్ లో ఆటంకాలు తలెత్తడంతో లేదా ఇతర కారణాల వల్లనో (కంప్యుటర్ గ్లిచ్ అని వీటిని అంటూ ఉంటారు) సాధారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటి క్రాష్ కి దానిని కూడా కారణంగా చెప్పడం లేదు. 

కారణం ఏమిటో చెప్పలేదు గాని ఈ కొద్ది సెకన్ల ట్రేడింగ్ ని రద్దు చేశారని రాయిటర్స్ న్యూస్ తెలిపింది. రద్దు  చేసాక పౌండ్ విలువ 1.1491 గా నిర్ధారించారని తెలిపింది. 31 ఏళ్ళ క్రితంతో (1985) పోల్చితే ఇది కూడా అత్యల్ప స్ధాయి కావడం గమనార్హం.  

అనంతర ట్రేడింగ్ లో పౌండ్ విలువ కోలుకుని 1.2460 డాలర్లకు చేరినట్లు తెలుస్తున్నది. ఇది 1.2% తగ్గుదలకు సమానం. మార్కెట్ల రియాక్షన్ చూసేందుకు కావాలని పౌండ్ విలువను పతనం చేశారా అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే దీనికి చాలా చాలా తక్కువ అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. 

ఆదివారం నాడు ధెరెసా మే బ్రెగ్జిట్ గురించిన ప్రకటన చేసిన తర్వాత మార్కెట్లు ఆందోళనలో పడ్డాయని కొందరు సూచిస్తున్నారు. మార్చి 2017 చివరి కల్లా ఆర్టికల్ 50 కింద ఈయూ కు ఎగ్జిట్ నోటీసు ఇస్తామని, బ్రిటిష్ ప్రజల తీర్పు ని శిరసా వహించ వలసిందేనని ఆమె తమ పార్టీ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.  

“యూరోపియన్ యూనియన్ బ్రిటన్ తో గట్టిగా వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ ప్రధాని ధెరేసా మే యూరప్ నుండి కఠినమైన షరతులతో వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది” అని నిన్న -గురువారం- ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండే సూచించారు. ఆయన ప్రకటనను మార్కెట్లు పరిగణించినట్లు కనిపిస్తున్నదని కొందరు సూచించారు.  

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సరళతరమైన విత్త విధానం అనుసరించడం పట్ల బ్రిటిష్ ప్రధాని స్వల్పంగా విమర్శించారు. మానిటరీ పాలసీని కఠినం కావించాలని ఆమె సూచించినట్లుగా భావించి మార్కెట్లు మరింత ఆందోళనకు గురైనాయని కొందరు విశ్లేషకులు సూచించారు. 

ఈ వారంలో పౌండ్ విలువ ఇప్పటి వరకు 4% పడిపోయింది. దేశాధినేతల ప్రసంగాలు, వ్యాఖ్యలు, షేర్ మార్కెట్ల కదలికలతో పాటు కరెన్సీ విలువలను కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పౌండ్ స్టెర్లింగ్ విలువ పతనం తెలియజేస్తున్నది. కాగా పౌండ్ పతనం డాలర్ బలీయం కావడానికి దారి తీసి మరింత ఆశాజనకమైన భవిష్యత్తును అమెరికా ఆర్ధిక వ్యవస్ధ చూసేలా ప్రభావం కలగజేయడం దీనికంతటికి  కొసమెరుపు!

స్పెక్ట్రమ్ వేలం: లాభం 65 వేల కోట్లు, తప్పిన అంచనాలు!

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 4G స్పెక్ట్రమ్ పూర్తయింది. భారీ మొత్తంలో 4G స్పెక్ట్రమ్ ని వేలానికి పెట్టిన ప్రభుత్వానికి అంచనా వేసినంత భారీ ఆదాయం మాత్రం దక్కలేదు. కొన్ని కేటగిరీలలోని స్పెక్ట్రమ్ ని కంపెనీలు అసలు ముట్టుకొనే లేదు. బేస్ ధర చాలా ఎక్కువగా ఉన్నదని కంపెనీలు పెదవి విరిచాయి. మొత్తం మీద వేలంలో 65,789 కోట్ల మేర స్పెక్ట్రమ్ కొనుగోలు జరిగింది. అందులో ఈ సంవత్సరం రు 32,000/- ప్రభుత్వానికి ఆదాయంగా రానుంది. 

అమ్మకానికి పెట్టిన స్పెక్ట్రమ్ మొత్తం అమ్ముడు పొతే 5.65 లక్షల కోట్లు  ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 2354.55 మెగా హర్ట్జ్ ల స్పెక్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు. అందులో 965 MHz కు మాత్రమే కంపెనీల నుండి బిడ్లు అందాయి. ఇది మొత్తం స్పెక్ట్రంలో 41 శాతం మాత్రమే. 59% శాతం స్పెక్ట్రమ్ కు అసలు బిడ్ లు అందలేదు. 

700, 800, 900, 1800, 2100, 2300, 2500 MHz ల ఫ్రిక్వెన్సీల స్పెక్ట్రమ్ లు వేలానికి పెట్టగా వాటిలో 700, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ఒక్క బిడ్ కూడా రాలేదని తెలుస్తోంది. తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అత్యధిక విలువ కలిగి ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ తరంగాలు గోడల గుండా చొచ్చుకు వెళ్లగల శక్తిని కలిగి ఉంటాయి. ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు. కాబట్టి టవర్లు  ఎక్కువగా నిర్మించవలసిన అవసరం లేదు. బేస్ ధర అధికంగా ఉండటంతో తాము కొనలేకపోయామని కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

4G స్పెక్ట్రమ్ వేలం ద్వారా రు 98,995/- కోట్ల ఆదాయం వస్తుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో అంచనా వేశారు. 5.63 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ ధరకు గాను ముందస్తు ఫీజు కింద ఈ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ 41% స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడు కావడంతో ముందస్తు ఫీజు కూడా తగ్గిపోయింది. 700, 800, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ముందస్తు ఫీజు 25% గా నిర్ణయించగా ఇతర అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లకు ముందస్తు ఫీజు 50% గా నిర్ణయించారు. 

చిత్రంగా, ఆదాయం అంచనాకు తగ్గిపోయినప్పటికీ, కేవలం 41% మాత్రమే స్పెక్ట్రమ్ వేలంలో పోయినప్పటికీ వేలం విజయవంతం అయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రు 32,000 కోట్ల ఆదాయం రావటం తక్కువ మొత్తం కాదని టెలికం మంత్రి మనోజ్ సిన్హా గొప్పలు పోయారు. “5 ఏళ్లలో ఇదే అత్యధిక ముందస్తు ఫీజు” అని ఆయన భుజం చరుచుకున్నారు. బడ్జెట్ లో అంచనా వేసిన దాదాపు లక్ష కోట్లకు రు 32,000 కోట్లు మాత్రమే రావడం తక్కువ కాకుండా ఎలా పోయింది? ఎంత సేపూ వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడమే గాని, వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తూ  దాన్ని జనానికి చెప్పడం మంత్రులకు ఎప్పటికి సాధ్యం అయ్యేను? 

 

ఈసారి స్పెక్ట్రమ్ వేలం 5 రోజుల్లో పూర్తి కావడం గమనార్హం. అక్టోబర్ 1 న మొదలై సెప్టెంబర్ 5 తో బిడ్ లు పూర్తయ్యాయి. వాస్తవానికి సెప్టెంబర్ 29 నే వేలం మొదలు కావలసి ఉన్నది. కానీ దుర్ముహూర్తం అని ఎవరో చెప్పటంతో అక్టోబర్ 1 కి వాయిదా వేశారు. దుర్ముహూర్తాన్ని తప్పించినా వేలం వైఫల్యం (అనుకున్నంత ఆదాయం రాకపోవడం) మాత్రం తప్పలేదు అని అనుకోవచ్చా? 

2010 లో 2G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు 30 రోజులకు పైగా వేలం కొనసాగింది. 2010 లో 3G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు 10 రోజులకు పైగా వేలం కొనసాగింది. 4G స్పెక్ట్రమ్ వేలానికి వచ్చేసరికి 5 రోజులతో ముగిసిపోయింది. ఇదంతా దుర్ముహూర్తానికి అంటగట్ట వచ్చా? 

భారత దేశంలో అతి పెద్ద టెలికం కంపెనీగా పేరు పొందిన ఎయిర్ టెల్ కంపెనీ, తాము రు 14,244 కోట్లు ఖర్చు పెట్టి 173.8 MHz ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశామని ప్రకటించింది. 1800, 2100, 2300 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేశామని చెప్పింది. “ఈ వేలం ద్వారా వచ్ఛే 20 సం.లకు సరిపడా స్పెక్ట్రమ్ అవసరాలను కొనుగోలు చేసాము. ఈ కొనుగోలుతో 4G, 3G స్పెక్ట్రమ్ లకు సంబంధించి అన్ని సర్కిళ్లలోను ఇప్పుడు మేము స్పెక్ట్రమ్ సంపాదించినట్లయింది” అని ఎయిర్ టెల్ చెప్పింది. 

వోడా ఫోన్ కంపెనీ తాము రు 20,000 కోట్లకు పైగా పెట్టుబడితో తాజా వేలంలో కొనుగోళ్లు జరిపామని తెలిపింది. 

రు 13,672 కోట్లు పెట్టి 22 సర్వీస్ ఏరియాలలో 269 MHz ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశామని రిలయన్స్ జియో తెలిపింది. “ఈ కొనుగోలుతో మా స్పెక్ట్రమ్ పాద ముద్రలను దేశ వ్యాపితంగా విస్తరించుకున్నాము. భారత దేశాన్ని ప్రపంచ డిజిటల్ లీడర్ గా అభివృద్ధి చెందేలా తీర్చి దిద్దెందుకు రిలయన్స్ జియో కట్టుబడి ఉన్నది” అని రిలయన్స్ జియో తన సొంత బాజా మోగించుకుంది. 

దేశ వ్యాపితంగా వైర్ లెస్ బ్రాడ్ బంద్ సేవలు అందించే శక్తిని ఈ వేలం ద్వారా సంపాదించామని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. తాము రు 12,798 కోట్లతో 349.20 MHz ల స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేశామని కంపెనీ తెలిపింది. “4G LTE టెక్నలాజి రంగంలో మేము ప్రధానంగా కేంద్రీకరిస్తాం. 100 కోట్ల మందికి పైగా భారతీయులకు ఈ టెక్నలాజి అందించాలని మా లక్ష్యం” అని ఐడియా కంపెనీ ప్రకటించింది.  

అమ్మకానికి ట్విట్టర్!

150 అక్షరాల మైక్రో బ్లాగింగ్ సామాజిక వెబ్ సైట్ అయిన ట్విట్టర్ అమ్మకానికి వచ్చింది. కంపెనీని అమ్మకానికి పెట్టిన వ్యవస్ధాపకులు తమ బేరం అమ్మకం రూపం ధరించేది లేనిది చెప్పకున్నప్పటికీ ఇంటర్నెట్ బడా కంపెనీలు ట్విట్టర్ కోసం బిడ్ లు దాఖలు చేస్తున్నాయి. 

ట్విట్టర్ కొనుగోలుకు గూగుల్ కూడా రంగం లోకి దిగిందని ఆరంభంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ వార్తలు వెనక్కి వెళ్లాయి. ట్విట్టర్ యజమానుల అనిర్దిష్ఠ ధోరణి గూగుల్ కంపెనీ వెనక్కి తగ్గటానికి కారణం అని తెలుస్తున్నది. 

అక్టోబర్ 27 లోపు మొత్తం అమ్మకం ప్రక్రియ పూర్తీ కావాలని ట్విట్టర్ అధినేతలు తాజాగా ప్రకటించినట్లు తెలుస్తోంది. దానితో ట్విట్టర్ అమ్మకంపై మళ్ళీ మార్కెట్ వర్గాల్లో కదలిక వచ్చింది. ట్విట్టర్ ను ఇటీవలనే అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో అమ్మకం పూర్తి కావటం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. అసాధ్యమైన టైం లైన్ ప్రకటించడం ద్వారా అమ్మకానికి సిద్ధమా లేదా అన్న అనుమానాన్ని ట్విట్టర్ మిగిల్చిందని వారు చెబుతున్నారు. 

 

కంపెనీ భవిష్యత్తు పైన వాటా దారులకు, ఉద్యోగులకు ఒక స్పష్టత ఇవ్వడం కోసమే సాధ్యమైనంత త్వరగా అమ్మకాన్ని పూర్తీ చేయాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ భావిస్తున్నారని ట్విట్టర్ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్ఛే రెండు వారాల్లో బిడ్ లు పూర్తి చేసినట్లయితే వాటాదారులకు (షేర్ హోల్డర్లు) ఒక స్పష్టత వస్తుందని షేర్ విలువ పడిపోకుండా ఆపినట్లు అవుతుందని వారు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు సేల్ ఫోర్స్ డాట్ కామ్ ఇంక్., గూగుల్ ఓనర్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్., వాల్ట్ డిస్ని లు ట్విట్టర్ అక్విజిషన్ (సొంతం) కు ఆసక్తి ప్రదర్శించాయి. ట్విట్టర్ కోసం తాము బిడ్ వేయకపోవచ్చని గూగుల్ కంపెనీ వర్గాలు చెప్పారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక సేల్ ఫోర్స్, వాల్ట్ డిస్ని లు మాత్రమే రంగంలో మిగిలి ఉన్నాయని భావించవచ్చు. 

బిడ్ ప్రక్రియ అమ్మకంగా మారుతుందన్న నమ్మకం లేకనే గూగుల్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ట్విట్టర్ నిరాకరించింది. ట్విట్టర్ కు చెందిన సామాజిక కోణాన్ని, న్యూస్ కోణాన్ని వినియోగించుకోవడానికీ గూగుల్ ఆసక్తి చూపిందని, ఇప్పుడు బిడ్ దాఖలుకు వెనక్కి తగ్గడంతో గూగుల్ తదుపరి చర్య ఏమిటో ఎదురు చూస్తున్నామని పరిశీలకులు చెబుతున్నారు. గూగుల్ పూర్తిగా వెనక్కి తగ్గలేదని ఈ సమాచారం చెబుతోంది. ట్విటర్ కు సంబంధించిన ట్వీట్ ల డేటా బేస్, మైనింగ్ ప్రక్రియ పరిజ్ఞానం, వ్యాపార తెలివితేటలు పట్ల సేల్ ఫోర్స్ డాట్ కామ్ ఆసక్తిగా ఉన్నది. కాగా వాల్ట్ డిస్ని సంస్ధ తన స్పోర్ట్స్ మరియు ఎంటర్ టైన్మెంట్ ల కోసం ట్విట్టర్ వేదికను వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 

అసలు అమ్మకానికి పెట్టడానికి కారణం ఏమిటి? 2013 లో ట్విట్టర్ IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రకటించడం ద్వారా వాటా సంస్ధగా ఉనికిలోకి వచ్చింది. అనంతరం వార్తల ప్రసారాన్ని చేపట్టి వాటా విలువ పెంచుకోగలిగింది. కానీ ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలం అవుతూ వచ్చింది. ఇతర ఇంటర్నెట్ కంపెనీలతో పాటుగా వినియోగదారుల పునాదిని విస్తరించుకోవడంలో విఫలం అవుతోంది. దానితో పూర్తిగా పుట్టి మునగక ముందే సంస్ధను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని వ్యవస్ధాపకులు భావించారు.  

ఉదాహరణకి 2016 మొదటి, రెండవ త్రైమాసికంలలో వాల్ స్ట్రీట్ అంచనాలకు తగ్గట్లుగా వృద్ధిని ట్విట్టర్ నమోదు చేయలేకపోయింది. గత 11 త్రైమాసికాలలో లాభం (డివిడెండ్) అన్నదే నమోదు చేయలేకపోయింది. షేర్ విలువ పడిపోవడం మొదలయింది. దానితో షేర్ హోల్డర్ లలో తొక్కిడి మొదలయింది. షేర్లను వదిలించుకునే ప్రయత్నంలో పడ్డారు. 

26$ షేర్ విలువతో పబ్లిక్ సంస్ధగా మారిన ట్విట్టర్ త్వరలోనే 74$ కు చేరింది. ఆ తర్వాత అక్కడే స్ధిరపడి అనంతరం మెల్ల మెల్లగా విలువ కోల్పోతున్నది. మరోవైపు పేస్ బుక్, గూగుల్ లాంటి కంపెనీలు వరుస వృద్ధి నమోదు చేస్తూ  దూసుకెళ్తున్నాయి. దానితో అమ్మకానికి పెట్టక తప్పలేదు ట్విట్టర్ వ్యవస్ధాపక యజమానులకు. 

RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి. 

అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ  సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు. 

తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి.

మాజీ గవర్నర్ తప్పు కోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చేత అదుపు లేని ఆరోపణలు చేయించారు. ఆయన వల్లే జీడీపీ పెరగడం లేదని, ఆయనకీ దేశభక్తి లేదని, అమెరికా పౌరుడని… ఇంకా ఏవేవో. ఈ ఆరోపణల లక్ష్యం రాజన్ తనంతట తానె తప్పుకునేలా చేయడం. 

ఎందుకని? ఎందుకంటే, ద్రవ్యోల్బణం పైన చూపుతో వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచుతున్నాడని రాజన్ పైన పరిశ్రమ వర్గాలు, స్వామి లాంటి నేతలు కత్తి గట్టారు. ఆయన తప్పుకోవాలని భావించారు. నేరుగా చెప్పలేక ‘పొమ్మన లేక పొగ పెట్టారు.’ 

ద్రవ్యోల్బణం పెరగడం అంటే ధరలు పెరగడం. ధరలు పెరగడం అంటే వ్యవస్ధలో ద్రవ్య చెలామణి ఎక్కువగా ఉండడం. కాబట్టి వడ్డీ రేటు పెంచి, లేదా తగ్గించకుండా కొనసాగించి అదనపు ద్రవ్యాన్ని చలామణి నుండి ఉపసంహరించడానికి RBI ప్రయత్నిస్తుంది. ఇది ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినా చేసే పనే. అయినా బీజేపీ గణాలు కత్తిగట్టి, రాజన్ ని పంపించారు.  

రాజన్ పోయాక RBI – వడ్డీ కోత/పెంపు లకు సంబంధించి కొన్ని పాలనా నిర్ణయాలు, కొన్ని విధాన నిర్ణయాలలో మార్పులు తెచ్చారు. 

పాలనా నిర్ణయాలు: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ని ఏర్పాటు చేయటం. ఇక ఇప్పుడు వడ్డీ రేటు మార్పులు గవర్నర్ ఒక్కరే కాకుండా కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సభ్యులను కొందరిని కేంద్రం నియమిస్తుంది. తద్వారా RBI నడకని తన నియంత్రణలోకి కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంది.

వాస్తవానికి ఏ దేశంలో నైనా సెంట్రల్ బ్యాంకు -చట్టం ప్రకారం- స్వతంత్రంగా వ్యవహరించాలి. చట్టాలలో కొన్ని సవరణలు తెఛ్చి RBI స్వతంత్రతను మోడీ ప్రభుత్వం హరించివేసింది. తద్వారా మానిటరీ విధానాల్లో ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు చేసే అవకాశాన్ని గవర్నర్ నుండి ప్రభుత్వం లాగేసుకుంది. కేంద్రం మాట వినక తప్పని పరిస్ధితిని కల్పించింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు మంచిది కాదు.

img_0386

విధాన నిర్ణయాలు: గతంలో రాజన్, ద్రవ్యోల్బణం 4 శాతంగా నిర్ణయించి దానిని సాధించడానికి 2018 సంవత్సరాన్ని గడువుగా పెట్టారు. ఇప్పుడు కమిటీ ద్వారా దీనిని 2021 కి పొడిగింపు జేశారు. మధ్య కాలిక ద్రవ్యోల్బణం లక్ష్యం 4% అనే చెబుతూ గడువుని మరో 3 ఏళ్ళు పొడిగించారు. అనగా స్వల్ప కాలిక లక్ష్యం కాస్తా మధ్య కాలిక లక్ష్యంగా మార్చారు. 

ఇందువల్ల ఏం ఒరిగింది? చాలా ఒరిగింది. ద్రవ్యోల్బణం లక్ష్యం దూరం జరిపితే వడ్డీ రేటుని తగ్గించే గడువు కూడా పెరిగింది. అనగా మరింత ఖాళి సమయం దొరికింది. గడువు దగ్గరగా ఉంటె దాన్ని సాధించాలన్న తొందరలో త్వరత్వరగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (ఆగస్టు 2016 నాటికీ) 5% ఉండగా, హోల్ సేల్ ధరల ద్రవ్యోల్బణం 5.05% (డిసెంబర్ 2015 నాటికి) ఉంది. కాబట్టి 4% లక్ష్యం చేరాలంటే వడ్డీ రేటు పెంచవలసి ఉంటుంది. 

ఎందుకని? ఎందుకంటే, ఇటీవల ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. ఇది నవంబర్ లో అమలులోకి రావచ్చుఁ. ఉత్పత్తి తగ్గితే ధరలు పెరుగుతాయి. మన ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రభుత్వాల పనితనం కానీ కాదు. చమురు ధరలు చారిత్రకంగా అత్యంత తక్కువగా ఉండడం వల్లనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నది. కాబట్టి చమురు ధరలు పెరిగితే ఇక ద్రవ్యోల్బణం పెరగడమే గాని తగ్గడం ఉండదు. కాబట్టి 2018 లోపు వడ్డీ రేటు తగ్గించే అవకాశం తక్కువగా ఉన్నది. పెంచడానికే అవకాశం కనిపిస్తున్నది తప్ప తగ్గించేందుకు కనిపించడం లేదు. 

గడువు పెంచితే లక్ష్యం సాధించేందుకు కావలసిన ఊపిరి/కాలం చిక్కుతుంది. ప్రస్తుతానికి వడ్డీ రేటు తగ్గించేసి లక్ష్యం చేరుకోవడానికి ఇంకా గడువు ఉన్నది కదా! అని తాము సంతృప్తి పడవచ్చూ, అడిగేవాడికి గట్టిగా చెప్పనూవచ్చు. 

మరో అంశం ఏమిటి అంటే రాజన్ వెళ్లే నాటికి న్యూట్రల్ రేటు 1.5% నుండి 2% వరకు ఉన్నదని అంచనా వేశారు. న్యూట్రల్ రేటు అంటే రిస్క్ లేని రేటు కి ద్రవ్యోల్బణ రేటుకి మధ్య ఉండే తేడా. సులువుగా చెప్పాలంటే ఒక దేశంలో ద్రవ్యోల్బణం స్ధిరంగా ఉన్నదని భావిస్తూ  ఆర్ధిక వ్యవస్ధ వాస్తవంగా ఎంత శాతం వృద్ధి అవుతున్నదో అంచనా వేస్తె అదే న్యూట్రల్ రేటు. రాజన్ ఉన్నప్పుడు భారత ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ అర్ధంలో (ద్రవ్యోల్బణం ప్రభావం తీసి వేస్తె) 1.5% నుండి 2% వరకు పెరుగుతోందని అంచనా వేయగా ఇప్పుడు ఆ అంచనాని 1.25% కి తగ్గించుకున్నారు. అనగా వృద్ధి రేటు అనుకున్నంతగా లేదని మోడీ ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ అంచనా వేస్తున్నాయన్నమాట!

కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో ఇది మొట్టమొదటి విత్త విధాన సమీక్ష. అధికారాలు పరోక్షంగా కత్తిరించబడిన రిజర్వ్ బ్యాంకుకు ఆయన ఇప్పుడు రాజు. ఆయన విత్త పాలన అనివార్యంగా కేంద్రం చెప్పు చేతల్లో ఉండబోతున్నదని, ఆర్ధిక మంత్రి – ఆర్బీఐ గవర్నర్ల మధ్య తగువులాట, అలకలు ఇక పెద్దగా ఉండకపోవచ్చని ఈ సమీక్ష చెబుతున్నది.

31 ఏళ్ళ స్ధాయికి పడిపోయిన బ్రిటన్ కరెన్సీ

బ్రెగ్జిట్ విషయమై సోమవారం నాడు బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటన ప్రభావం చూపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ కు స్పష్టమైన టైం టేబుల్ ను ఆమె ప్రకటించడంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 31 ఏళ్ళ కనిష్ట స్ధాయికి పడిపోయింది. దానితో బ్రిటిష్ ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో బ్రిటిష్ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచి FTSE 16 నెలల గరిష్ట స్ధాయికి పెరిగింది. 

అధికార కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రధాని ధెరిసా మే ‘బ్రెగ్జిట్ ప్రక్రియ మార్చి 2017 చివర్లో ప్రారంభం అవుతుంది. ఆ నెలలో ఆర్టికల్ 50 కింద ఈయూ కు నోటీసు ఇస్తాను’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో బ్రెగ్జిట్ తీర్పు అమలు కావటం ఖాయమే అని మార్కెట్లు నిర్ధారించుకుని తదనుగుణంగా స్పందించాయి. బ్రెగ్జిట్, దీర్ఘ కాలికంగా బ్రిటన్ కు లాభకరమే అయినప్పటికీ స్వల్ప కాలికంగా కొన్ని ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కారణం వల్లనే బ్రిటిష్ కరెన్సీ పతనం అయింది. 

అమెరికన్ డాలర్ తో పోల్చితే పౌండ్ స్టెర్లింగ్ విలువ 1.2757 డాలర్లకు పడిపోయిందని పత్రికలు తెలిపాయి. 1985 నుండి ఇదే అత్యల్ప విలువ అని తెలుస్తున్నది. యూరోతో పీల్చితే పౌండ్ స్టెర్లింగ్ విలువ 3 సంవత్సరాల కనిష్ట స్ధాయికి (87.56 పెన్నీలు) పడిపోయింది. 

“బ్రెగ్జిట్ దిశలో పటిష్టమైన టైం టేబుల్ ప్రకటించినందున స్టెర్లింగ్ కు ఇటీవల తగిలిన గాయాలకు కట్టు కట్టడం కష్టతరం అయినట్లు  కనిపిస్తున్నది” అని స్ప్రెడ్ ఎక్స్ ట్రేడింగ్ సంస్ధ నిపుణుడు -పౌండ్ పతనాన్ని ఉద్దేశిస్తూ- వ్యాఖ్యానించాడు. 

ఒక దేశ కరెన్సీ పతనం అయితే ఆ దేశంలో తయారయ్యే సరుకుల ధరలు పడిపోతాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో ఆ సరుకులకు గిరాకీ పెరుగుతుంది. అనగా బ్రిటిష్ సరుకుల ఎగుమతులు పెరుగుతాయి. అందుకే FTSE 100 షేర్ సూచీలో లిస్ట్ అయిన బ్రిటిష్ బహుళజాతి కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. ఫలితంగా షేర్ సూచి కూడా పెరుగుదల నమోదు చేసింది. 

గత 16 నెలల్లో మొదటిసారిగా FTSE 100 సూచి 7000 మార్కును దాటింది. సోమవారంతో పోల్చితే 1.1 శాతం పెరిగి 7060 పాయింట్లకు అది చేరింది.

పాచికలో ఒపెక్ పాత్ర -ద హిందూ…

ప్రపంచ చమురు మార్కెట్ లో సరఫరా, గిరాకీ (డిమాండ్) ల మధ్య సమతూకం నెలకొల్పే ప్రయత్నంలో రోజుకి 700,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని ఉమ్మడిగా తగ్గించడానికి అల్జీర్స్ లో జరిగిన అసాధారణ సమావేశంలో చమురు ఎగుమతి దేశాల సంఘం (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ -ఒపెక్) కుదుర్చుకున్న ఒప్పందం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్లుగా దిగజారుతున్న ప్రపంచ క్రూడ్ ధరలు మరింత పడిపోకుండా నిలబెట్టడానికి ఈ గ్రూపు నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ జారుడు వలన 2014 ఆగస్టు  చివర్లో బ్యారెల్ కు 103 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ ఈ ఏడు సెప్టెంబర్ 1 నాటికి సగానికి పైగా పడిపోయి 45.5 డాలర్లకు చేరింది. అయినప్పటికీ ఉత్పత్తి కోతలకు సంబంధించి విభేదాలతో, వివక్షలతో నిండిన ఒపెక్ సభ్య దేశాల మధ్య అర్ధవంతమైన ఏకాభిప్రాయం ఉన్నది లేనిది అస్పష్టంగానే ఉన్నది -ఈ గ్రూపులో అతి చిన్నదే అయినా సంపన్నవంతమైన పశ్చిమాఫ్రికా దేశం గాబన్ -సంక్షోభాలలో మునిగి తేలుతున్న వెనిజులా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి ముఠాలతో నిండిన పశ్చిమాసియా దేశాలు ఈ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఒక్కో దేశం నిర్దిష్టంగా ఉత్పత్తిలో ఎంత కోత విధించుకోవాలన్న అంశాన్ని నవంబర్ లో జరగనున్న సమావేశానికి వదిలివేసినప్పటికీ, 56 ఏళ్ళ వయసు గల ఈ సంస్ధలోని అత్యధిక చమురు ఉత్పత్తి దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు పరిస్ధితి ఎంతటి నిస్పృహాత్మకంగా మారిందో ఈ ఒప్పందం తెలియజేస్తున్నది. గత 8 ఏళ్లలో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఉత్పత్తి కోత, ఒపెక్ లో అతి పెద్ద ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా అనుసరించిన ‘ఇష్టారీతిన ఉత్పత్తి తీసే’ విధానాన్ని, తాను ప్రధానంగా ఏ ఉత్తర అమెరికా దేశాలనైతే -అమెరికా షేల్ ఉత్పత్తి ప్రయోజనాలతో సహా- లక్ష్యంగా పెట్టుకుని అనుసరించిందో ఆ దేశాలను ఎంతగా నష్టపరిచిందో, తనను కూడా అంతే నష్టపరిందని -బహుశా అంతకంటే ఎక్కువే నష్టపరిచి వుండవచ్చుఁ కూడా- ఆ దేశం పరోక్షంగా అంగీకరించినట్లే.   

అమెరికా బడా షేల్ ఉత్పత్తిదారులు తీవ్ర ప్రతిఘటన ధోరణితో తమ నిర్ణయానికి అంటిపెట్టుకుని ఉండగా -ఈ ఏడు మరిన్ని ఎకరాలలో పెట్టుబడిని విస్తరించారు కూడాను- సౌదీ అరేబియా బడ్జెట్ లో పెద్ద కంత ఏర్పడింది. 2015 లో కోశాగారా లోటు (బడ్జెట్ లోటు) ఆ దేశ జీడీపీ లో 16% గా నమోదు కాగా ఈ ఏడు కాస్త తగ్గి 13% మేర నమోదు కావొచ్చని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తన ఖర్చులను తగ్గించుకోక తప్పలేదు; ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలను సైతం అది తగ్గించుకోవలసి వచ్చింది. ఈ సంవత్సరం, గత పదేళ్లలో మొట్టమొదటి సారిగా సౌదీ రాజు విదేశీ రుణాలు -వచ్చే ఐదేళ్ళలో 10 బిలియన్ డాలర్లు- సేకరించేందుకు పూనుకోవలసి వచ్చింది. 2016 లో సౌదీ ఆర్ధిక వృద్ధి 1 శాతానికి నెమ్మదించనున్న నేపథ్యంలో ఆ దేశం తన ఆర్ధిక వ్యవస్ధకు ప్రధాన ఇంజన్ అయిన క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి వైపుకే తిరిగి రావటం తప్ప మరో దారి లేదు. ఈ (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలోని ఘర్షణలతో నిండా మునిగి ఉన్నందున -యెమెన్ లో ప్రత్యక్షంగానూ, సిరియాలో పరోక్షంగానూ- ప్రతి బ్యారెల్ చమురుకు మరింత ఆదాయం పిండుకోవాలని, బహుశా సౌదీ పాలకులు నిర్ణయించుకుని ఉండవచ్చు. ఒప్పందంలో ఇరాన్ ని కూడా భాగస్వామిని చేయడం కోసం తక్షణ ఉత్పత్తి కోత నుండి ఇరాన్ కి మినహాయింపు ఇవ్వడానికి ఒపెక్ అంగీకరించినట్లు  తెలుస్తున్నది. చమురు డిమాండ్ గతంలో అంచనా వేసినదాని కంటే వేగంగా క్షీణిస్తుండడంతో చమురు ధరలను పునరుద్ధరించడంలో ఉత్పత్తి కోత చర్య యొక్క విజయం, నిర్ణయాన్ని పాటించడంలో గ్రూఫు సభ్య దేశాల క్రమ శిక్షణ పైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది -గతంలో ఈ క్రమ శిక్షణే లోపించడం గమనించవలసిన విషయం.

*********

రెండేళ్ల నుండి అమెరికా షేల్ గ్యాస్ క్షేత్రాల నుండి చమురు, సహజ వాయువుల నుండి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నది. అమెరికా ఉత్పత్తి సౌదీ అరేబియాకు పోటీగా మారిందని, అమెరికా షేల్ ఉత్పత్తిని నిరుత్సాహపరిచేందుకు సౌదీ అరేబియా ‘చిత్తానుసారం ఉత్పత్తి తీసే’ ఎత్తుగడను అనుసరిస్తున్నదని అందువల్లనే చమురు ధరలు అమాంతం పడిపోయాయని ద హిందూ సంపాదకీయం చెబుతున్నది. ఈ వాదనలో నిజం పాళ్ళు చాలా తక్కువ. సౌదీ అరేబియాలో చమురు వెలికి తీసున్నది ప్రధానంగా అమెరికా కంపెనీలే. కనుక అమెరికా షేల్ క్షేత్రాల వల్ల నష్టం అంటూ జరిగితే దానివల్ల అమెరికా కంపెనీలే ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కనుక చమురు ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడంలో అమెరికాకు వ్యతిరేకంగా సౌదీ పాల్పడుతున్న కుట్రదే పాత్ర అని చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. 

చమురు ధరల పతనం వల్ల సౌదీ అరేబియా బాగా నష్టపోయింది అనడంలో సందేహం లేదు. కానీ ఆ నష్టాన్ని అమెరికా షేల్ క్షేత్రాల కంపెనీలు కూడా అంతే స్ధాయిలో ఎదుర్కొంటున్నాయి. అలాంటప్పుడు కుట్ర నుండి అమెరికాను మినహాయించడం నమ్మదగ్గది కాదు. అది కాక అమెరికా-సౌదీలు నమ్మకమైన మిత్ర దేశాలు. ఇటీవలి కాలంలో అమెరికా ఆర్ధిక శక్తి బలహీన పడుతూ భౌగోళిక రాజకీయాలలో రష్యా-చైనాల ప్రాబల్యం పెరుగుతున్నందున సౌదీ లాంటి దేశాలు అమెరికా శిబిరంలో కొనసాగడమా లేదా అని ఊగిసలాడుతుండడం కూడా ఒక వాస్తవమే. కానీ ఇది ఊగిసలాట వరకే ఉన్నది తప్ప పూర్తిగా శిబిరం మారడం మాత్రం జరగలేదు. ఒక జంఝాటంలో సౌదీ లాంటి దేశాలు ఉండడం నిజమే అయినా, అది పరస్పరం వాణిజ్య కొట్లాటకు దారి తీసే పరిస్ధితిగా మారలేదు. అమెరికాతో వాణిజ్య తగాదా మాములుగా ఉండదు. అమెరికాతో తగాదా వస్తే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నిశ్శబ్దంగా ఉండవు. తగాదా పడుతున్న దేశం పైన ఏడేడు సముద్రాలకు సరిపోని విషాన్ని కుమ్మరిస్తాయి. అలాంటిది అమెరికా-సౌదీ వాణిజ్య తగాదా పైన పశ్చిమ పత్రికలు సాదా సీదా విశ్లేషణలతో సరిపెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. 

చమురు ధరల పతనం వెనుక అమెరికా-సౌదీల ఉమ్మడి కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర లక్ష్యం రష్యాతో పాటు వెనిజులా లాంటి దక్షిణ అమెరికా చమురు ఉత్పత్తి దేశాలు. అమెరికాకు పక్కలో బల్లెంగా మారిన వెనిజులా, చమురు ధరల పతనం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలు అత్యంత తీవ్ర స్ధాయిలో కొనసాగుతున్నాయి. అమెరికా అనుకూల ప్రతిపక్షం వెనిజులా ప్రభుత్వాన్ని దాదాపు చక్ర బంధంలో పట్టి ఉంచగలుగుతోంది. పార్లమెంటు ఎన్నికలలో చావెజ్ పార్టీ ఓటమిని సైతం ఎదుర్కొన్నది. ఆ మేరకు అమెరికా కుట్ర లక్ష్యం చాలా వరకు నెరవేరినట్లే. ఒక్క రష్యా మాత్రమే అమెరికా ఊహించినట్లు లొంగి రాలేదు. అందుకు చైనా వాణిజ్య సహకారం మెండుగా తోడ్పడింది. 

పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో ప్రతీకార చర్యలు అమలు చేసిన వారికే ఎదురు తిరగడం సాధారణం. ప్రపంచ దేశాల మార్కెట్లు పరస్పరం పెనవేసుకుని ఉన్న నేపథ్యంలో ఒక చర్య ప్రభావం అలల వలే (ripple effect ) మల్లి బయలుదేరిన చోటికే తిరిగి వస్తుంది. అమెరికా, సౌదీ అరేబియాలకు చమురు ధరల పతనం ప్రభావం తమ వరకు వస్తుందని తెలియకుండా ఏమి పోలేదు. కానీ ఆ ప్రభావాన్ని, తమకు తాకే లోపు, అధిగమించవచ్చని అవి అంచనా వేసి ఉండవచ్చు. అనగా తాము లక్ష్యంగా  చేసుకున్న చోటికి వెళ్లి తమను తాకే లోపు ప్రత్యర్థి దేశం నష్టపోతాయని, ఆ తర్వాత తమ చర్యలను వెనక్కి తీసుకోవచ్చని అంచనా వేసాయి. ఆ మేరకు, వెనిజులా విషయంలో, వాటి అంచనా తప్ప లేదనే భావించవలసి ఉంటుంది. 

అలాగని అమెరికా – సౌదీల మధ్య పూర్తిగా స్నేహమే ఉన్నదని భావించనవసరం లేదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఉండలేవు. వివిధ శక్తుల మధ్య, శిబిరాల మధ్య పరిస్ధితిని బట్టి ఐక్యత, ఘర్షణలు సహజమే. కనుక పెట్టుబడిదారీ దేశాల మధ్య రీ గ్రూపింగ్ జరుగుతున్న క్రమంలో దాని ప్రభావం అమెరికా-సౌదీల సంబంధాల పైన కూడా పడుతున్నది. అయితే అటువంటి రీ గ్రూపింగ్ పాత్ర చమురు ధరల పట్నంలో అమెరికా-సౌదీల మధ్య ఘర్షణగా మారే విధంగా పని చేసింది అనటానికి తగిన పరిణామాలు ఏవి కనపడలేదు. కనుక ద హిందూ విశ్లేషణలో, పైన చెప్పినట్లు  వాస్తవాల మద్దతు, నామమాత్రంగా కనిపిస్తున్నది.

 

15 లక్షలు ఇస్తామని రు. 245 కి దిగారు!

నల్ల డబ్బుకి సంబంధించి ఎన్నికల్లో నరేంద్ర మోడి ఇచ్చిన వాగ్దానం గుర్తుందా?

అధికారం లోకి రావడం తోటే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం అన్నారు. అలా తెప్పించిన డబ్బుని ఉపయోగ పెట్టి ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో రు 15 లక్షలు జత చేస్తాం అన్నారు. అనగా రు. 18 కోట్ల కోట్లు మేర భారతీయులు దాచిన నల్ల ధనం విదేశాల్లో మూలుగుతోంది అని చెప్పారు.

ఇంతదాకా ఆ డబ్బు వెనక్కి తెచ్చే సరైన కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటీ మొదలు పెట్టలేదు. ఆరంభంలో ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు, అంతే. మళ్ళీ అటువైపు చూస్తే ఒట్టు! అసలా హామీ ఆయనకు గుర్తుందో లేదో?!

ఈ రోజు ఆర్ధిక మంత్రి ఓ ప్రకటన చేశారు. తాము ప్రకటించిన ‘(రహస్య) ఆదాయ ప్రకటన పధకం’ (Income Declaration Scheme) కింద ఇప్పటి వరకు 65,250 కోట్ల మేర ఆస్తులను ప్రకటించారని ఆయన చెప్పారు. 64,275 మంది లెక్కలు చూపని నల్ల ఆదాయాన్ని ప్రకటించారని చెప్పారు. అంటే ఒక్కొక్కరు సగటున రు కోటికి కాస్త పైనే నల్ల డబ్బు ప్రకటించారు.

కేవలం ఒక కోటి నల్ల డబ్బు ఉన్నవాళ్ళు “స్వచ్ఛందంగా” ప్రకటించిన నల్ల డబ్బే 65 వేల కోట్లు దాటింది. అది కూడా విదేశాల్లో దాచిన డబ్బు కాదు, ఇండియాలో దాచిన డబ్బు. ఇక వందలు, వేల కోట్ల నల్ల డబ్బు దాచిన వాళ్ళు కూడా ప్రకటిస్తే? దానికి విదేశాల్లో దాచిన డబ్బుని కూడా జత చేస్తే?! ఊహించడం కూడా సాధ్యం కావటం లేదు సుమా!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి లెక్క తప్ప లేదన్నమాట! ఆయన చెప్పిన లెక్క ఏదో నోటి దురదతో చెప్పింది కాదన్నమాట! నిజంగా నిపుణులను కనుక్కుని, విదేశాల్లో నల్ల డబ్బు ఎంత ఉంటుందో అంచనా వేయించే ఆ లెక్క చెప్పారన్నమాట!

జన్ ధన్ పధకం ప్రకటించిన ప్రధాని ప్రతి ఒక్కరికీ ఉచితంగా బ్యాంకు ఖాతా ఉండేలా చేశారు. ఇక ఆయన నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ఒక్కో ఖాతాలో రు 10 లక్షలు వేయడమే మిగిలింది. మరి ఆ విదేశీ నల్ల డబ్బు ఎప్పుడు వెనక్కి తెస్తారు?

ఆ మధ్య ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ పేరుతో పనామా పేపర్లు లీక్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ పేపర్లలో కొందరు భారతీయుల పేర్లు కూడా బైటికి వచ్చాయి. ఆ పేపర్లను మన వాళ్ళు కూడా వెతికారట. వాటిలో 9,000 కోట్ల భారతీయ నల్ల ధనం ఉన్నట్లు తెలిసిందని, ఆ ఖాతాలకు సంబంధించి 50 కేసులు కూడా పెట్టామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంటే, ఎవరో లీక్ చేస్తే మన వాళ్ళు వెతుకుతారు తప్ప మన ప్రయత్నాలు ఏవీ ఉండవా?

స్విట్జర్లాండ్ బ్యాంకు HSBC మనకి భారతీయుల ఖాతాల పేర్ల జాబితా ఇచ్చింది. యూ‌పి‌ఏ హయాంలోనే ఆ జాబితా మనకు అందింది. దాన్ని బైట పెట్టడానికి యూ‌పి‌ఏ ప్రభుత్వం ఒప్పుకోకపోతే బి‌జే‌పి విమర్శించింది. బి‌జే‌పి ప్రభుత్వం వచ్చింది. అందునా అవినీతి పట్ల చండశాసనుడైన మోడి ప్రధాని అయ్యారు. అయినా వారి పేర్లు బైటపడవేల? బైట పెట్టమని సుప్రీం కోర్టు కోరినా ఎందుకు ఒగ్గడం లేదు?

ఇంతకీ, ఇప్పుడు నల్ల ఆదాయం ప్రకటించిన 64,275 మంది పేర్లు కూడా జైట్లీ గారు ఎవరికీ చెప్పరట! వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు గనక దానిని పాటిస్తామని చెప్పారు. మరి రు 15 లక్షలు ఖాతాలో వేస్తామని ఇచ్చిన హామీ మాట ఏమిటి?

జనానికి ఇచ్చిన హామీలనేమో గంగలో కలిపేస్తారా? కోటీశ్వరులకి ఇచ్చిన హామీలనేమో భద్రంగా నెరవేర్చుతారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనవచ్చునా?

ప్రకటించిన నల్ల ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని జైట్లీ చెప్పారు. కాబట్టి ప్రకటించిన మొత్తానికి మరింత డబ్బు జత చేరుతుందని ఆయన సంతోషంగా చెప్పారు.

ఈ మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుందా? అబ్బే, అదేం లేదు. ప్రకటించిన ఆదాయం పైన పన్ను, అపరాధ రుసుము వసూలు చేసి మిగిలింది ప్రకటించిన వాళ్ళకి ఇచ్చేస్తారు. పన్ను, రుసుము కలిపి 45% వసూలు అవుతుంది. ఆ లెక్కన రు 29,000 కోట్ల పై చిలుకు కేంద్రం బొక్కసంలో చేరుతుంది. దీనిని 120 కోట్ల మందికి పంచితే ఒక్కొక్కరికి జన్ ధన్ ఖాతాలో రు 245/- చేరుతుంది.

కానీ అలా జనం ఖాతాలో వెయ్యడం లేదు. ఆ డబ్బుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని జైట్లీ ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ప్రజా సంక్షేమం ఏమిటో నిర్దిష్టంగా చెప్పరు. అది రహస్యం! ఇంతోసి దానికి ప్రధాని గారు జైట్లీకి (ట్విట్టర్ లో) కంగ్రాట్స్ చెప్పడం కూడానా?

జనానికి ఇవ్వకపోతే పోయే, ప్రజా సంక్షేమానికి నిజంగా ఖర్చు పెట్టకపోతే మానే. కనీసం ఇక నుండైనా పెట్రోలు రేటు పెరగకుండా చూస్తారా? ఉల్లి, కంది తదితర పప్పులు, వేరు శనగ.. ఇత్యాది రేట్లు పెరగకుండా చూస్తారా? విదేశీ కంపెనీల కోసం మరిన్ని ప్రభుత్వ కంపెనీలని అమ్మకుండా ఉంచి ఉద్యోగాలని ప్రజల కోసం కాపాడతారా? ఎల్‌ఐ‌సి, బ్యాంకులు, పెన్షన్, గ్రాట్యుటీ నిధుల్ని విదేశీ కంపెనీలకి అప్పగించే ఆలోచనల్ని మానేస్తారా?

అబ్బే, అది కుదరదు. కుదరదంటే కుదరదు! కుదరదు గాక కుదరదు!!

కుదరనప్పుడు ‘ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తాం’ అంటూ ఉత్తుత్తి కబుర్లు ఎందుకు, సొల్లు కాకపోతే?!