31 ఏళ్ళ స్ధాయికి పడిపోయిన బ్రిటన్ కరెన్సీ

బ్రెగ్జిట్ విషయమై సోమవారం నాడు బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటన ప్రభావం చూపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ కు స్పష్టమైన టైం టేబుల్ ను ఆమె ప్రకటించడంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 31 ఏళ్ళ కనిష్ట స్ధాయికి పడిపోయింది. దానితో బ్రిటిష్ ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో బ్రిటిష్ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచి FTSE 16 నెలల గరిష్ట స్ధాయికి పెరిగింది. 

అధికార కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రధాని ధెరిసా మే ‘బ్రెగ్జిట్ ప్రక్రియ మార్చి 2017 చివర్లో ప్రారంభం అవుతుంది. ఆ నెలలో ఆర్టికల్ 50 కింద ఈయూ కు నోటీసు ఇస్తాను’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో బ్రెగ్జిట్ తీర్పు అమలు కావటం ఖాయమే అని మార్కెట్లు నిర్ధారించుకుని తదనుగుణంగా స్పందించాయి. బ్రెగ్జిట్, దీర్ఘ కాలికంగా బ్రిటన్ కు లాభకరమే అయినప్పటికీ స్వల్ప కాలికంగా కొన్ని ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కారణం వల్లనే బ్రిటిష్ కరెన్సీ పతనం అయింది. 

అమెరికన్ డాలర్ తో పోల్చితే పౌండ్ స్టెర్లింగ్ విలువ 1.2757 డాలర్లకు పడిపోయిందని పత్రికలు తెలిపాయి. 1985 నుండి ఇదే అత్యల్ప విలువ అని తెలుస్తున్నది. యూరోతో పీల్చితే పౌండ్ స్టెర్లింగ్ విలువ 3 సంవత్సరాల కనిష్ట స్ధాయికి (87.56 పెన్నీలు) పడిపోయింది. 

“బ్రెగ్జిట్ దిశలో పటిష్టమైన టైం టేబుల్ ప్రకటించినందున స్టెర్లింగ్ కు ఇటీవల తగిలిన గాయాలకు కట్టు కట్టడం కష్టతరం అయినట్లు  కనిపిస్తున్నది” అని స్ప్రెడ్ ఎక్స్ ట్రేడింగ్ సంస్ధ నిపుణుడు -పౌండ్ పతనాన్ని ఉద్దేశిస్తూ- వ్యాఖ్యానించాడు. 

ఒక దేశ కరెన్సీ పతనం అయితే ఆ దేశంలో తయారయ్యే సరుకుల ధరలు పడిపోతాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో ఆ సరుకులకు గిరాకీ పెరుగుతుంది. అనగా బ్రిటిష్ సరుకుల ఎగుమతులు పెరుగుతాయి. అందుకే FTSE 100 షేర్ సూచీలో లిస్ట్ అయిన బ్రిటిష్ బహుళజాతి కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. ఫలితంగా షేర్ సూచి కూడా పెరుగుదల నమోదు చేసింది. 

గత 16 నెలల్లో మొదటిసారిగా FTSE 100 సూచి 7000 మార్కును దాటింది. సోమవారంతో పోల్చితే 1.1 శాతం పెరిగి 7060 పాయింట్లకు అది చేరింది.