వడ్డీలో మార్పు లేదు, జీడీపీ అంచనా తగ్గింపు

 

RBI జెల్ల కొట్టింది. వడ్డీ రేటు తగ్గింపు కోసం బడా కంపెనీలు, బడా బాబులు ఆశగా ఎదురు చూస్తుంటే వారి ఆశల్ని వమ్ము చేసింది. వడ్డీ రేట్లలో మార్పులు లేవు పొమ్మంది. పైగా 2016-17 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు విషయమై గతంలో వేసిన అంచనాను తగ్గించేసుకుంది. వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం రేపో రేటు (స్వల్ప కాలిక వడ్డీ రేటు – దీనినే క్లుప్తంగా బ్యాంకు రేటు / వడ్డీ రేటు అంటారు) 6.25% గా ఉంది. దీనిని 6%కి తగ్గిస్తారని కొన్ని సంస్ధలు అంచనా వేస్తె మరి కొందరు 5.75% కి తగ్గిస్తారని అంచనా వేశారు. ఎవరి అంచనా కూడా నిజం కాలేదు. 

వీరి అసలు, అంచనాకు ప్రధాన కారణం బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున డిపాజిట్లు ఉండడం (12.6 లక్షల కోట్లు జమ అయినట్లు బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ చెప్పింది. 11.55 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు   ఈ రోజు RBI తన సమీక్షా ప్రకటనలో పేర్కొంది.) డబ్బు చలామణి తగ్గిపోవడం, కనుక ధరలు తగ్గడం. 

వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించడానికి RBI చెప్పిన కారణాలు: అమెరికా ఎన్నికల అనంతరం ప్రపంచంలో నెలకొన్న పరిస్ధితులు; ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితులు; రెండో క్వార్టర్ లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడం. 

భారత బ్యాంకుల్లో భారీగా ద్రవ్య నిల్వలు చేరినప్పటికీ “ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితుల”ను వడ్డీ రేటు తగ్గించకపోవడానికి కారణాల్లో ఒకటిగా చెప్పడం అంటే ఏమిటి అర్ధం? వడ్డీ రేట్లు తగ్గుతాయని, తేలికగా రుణాలు అందుబాటులోకి వస్తాయని, పెట్టుబడులు వృద్ధి అవుతాయని, కొత్త ఉద్యోగాలు వఛ్చి ఉపాధి పెరుగుతుందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పిన మాటలు నిజాలు కావా? 

డీమానిటైజేషన్ వలన జీడీపీ పెద్దగా ఏమి పడిపోదని, మహా అయితే 0.2 తగ్గుతుందని ఇదేమంత విషయం కాదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఛానెళ్ల  చర్చల్లో బీజేపీ ప్రతినిధులు కూడా ఇదే చెప్పారు. అయితే జీడీపీ వృద్ధి రేటు ముందు అనుకున్నట్లు 7.6 % కాకుండా  7.1 శాతంగా నమోదు అవుతుందని సమీక్షా ప్రకటనలో RBI తెలిపింది. ఈ తగ్గుదలకు డీమానిటైజేషన్ కారణం అని కూడా చెప్పింది. ఇక్కడ కూడా బీజేపీ నేతల లెక్క తప్పింది.        

“వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని RBI ప్రకటించింది. అనగా RBI నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం చొరబడిందని చెప్పవచ్చని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

“దొంగ నోట్లు, నల్ల డబ్బు, టెర్రరిజం ఫైనాన్సింగ్ లను అరికట్టేందుకుకే డీమానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు” అని RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఇది వింత ప్రకటన. RBI గవర్నర్ చెప్పవలసింది తాము చేపట్టిన డీమానిటైజేషన్ చర్యకు కారణాలు ఏమిటన్నది గాని ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కాదు. జనం ఏమి అనుకుంటున్నారో జనానికి చెప్పాల్సిన బాధ్యత RBI గవర్నర్ కి ఎవరు అప్పజెప్పారు? 

ఆయన బ్యూరోక్రాట్ అధికారి. చట్టబద్ధంగా ఆయన కొన్ని విధులు నిర్వర్తించాలి. అంతవరకే ఆయన ప్రకటన పరిమితం కావాలి. జనం మదిలోని భావాలను కనిపెట్టి ద్రవ్య సమీక్షా విధానంలో ప్రకటించటం ఆయన విధి కాదు. అయినా ఆయన జనం గురించి చెప్పారంటే అది రాజకీయ నాయకులు ప్రేరేపించిన ప్రకటనను విడుదల చేశారని అర్ధం అవుతున్నది.    

రాజకీయ నాయకులు లేదా కేంద్ర ప్రభుత్వమూ మరియు మంత్రులు RBI విధుల్లోకి చొరబడి ఆ సంస్ధ ప్రకటనలను కూడా ప్రభావితం చేయడం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎంతమాత్రం మంచిది కాదు. ప్రజలకు అసలే మంచిది కాదు. 

 

One thought on “వడ్డీలో మార్పు లేదు, జీడీపీ అంచనా తగ్గింపు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s