నోట్ల రద్దు: ఇండియా వృద్ధి రేటు తగ్గించిన ఐ‌ఎం‌ఎఫ్

ప్రపంచ కాబూలీవాలా కూడా ఒప్పేసుకున్నాడు. డీమానిటైజేషన్ వల్ల ఇండియా జి‌డి‌పి వృద్ధి రేటు అంచనాను ఐ‌ఎం‌ఎఫ్ కూడా తగ్గించేసుకుంది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ఐ‌ఎం‌ఎఫ్ ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి తగ్గించుకుంది.

“ఇండియాలో ప్రస్తుత సంవత్సరానికి (2016-17) మరియు ఆ తర్వాత సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను వరుసగా 1 శాతం మరియు 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఇటీవల ప్రవేశపెట్టిన (పెద్ద) కరెన్సీ నోట్ల ఉపసంహరణ మరియు (నగదు రహిత) మారకం వైపుగా తీసుకున్న చొరవ. వీటి వల్ల వినియోగంలో ప్రతికూల (నెగిటివ్) షాక్ చొప్పించబడింది. చెల్లింపుల్లో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి”

అని ఐ‌ఎం‌ఎఫ్ ప్రచురించిన “వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్” నివేదిక పేర్కొంది.

ఆ విధంగా “ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటి గా మన దేశం ప్రసిద్ధి చెందింది” అని ఇన్నాళ్లూ దేనినైతే ప్రధాని మోడి పదే పదే చెప్పుకుని సంతోషపడుతూ, మనల్నీ సంతోషపడమన్నారో ఆ గొప్ప కిరీటాన్ని దభెల్ మని తానే కిందకు విసిరి కొట్టారు.

ఇండియా వృద్ధి 6.6% నమోదు కావటం అంటే అది చైనా (6.7%) తక్కువ వేగంగా వృద్ధి చెందినట్లే. “చైనా కంటే కూడా మనమే వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. ప్రపంచం అంతా దీనిని అంగీకరిస్తోంది” అని కూడా ప్రధాని మోడి అనేకసార్లు చెప్పుకున్నారు. భారత జనానికి చెప్పారు. డీమానిటైజేషన్ పుణ్యమాని ఆ గొప్ప కూడా దక్కకపోవచ్చని ఐ‌ఎం‌ఎఫ్ చెబుతోంది.

చైనా జి‌డి‌పి 2016లో 6.7 శాతం, 2017లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఐ‌ఎం‌ఎఫ్ తాజా అంచనాలో పేర్కొంది. 2015లో చైనా  జి‌డి‌పి 11 ట్రిలియన్ డాలర్లు. ఇండియా జి‌డి‌పి 2 ట్రిలియన్ డాలర్లు. జి‌డి‌పి పరిణామం పెరిగేకొందీ జి‌డి‌పి వృద్ధి రేటు సహజంగానే తగ్గుతూ ఉంటుంది.

ఎందుకంటే వృద్ధి రేటును లెక్కగట్టే మూల సంఖ్య తక్కువగా ఉంటే వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. మూల సంఖ్య పెద్దదిగా ఉంటే వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. ఇది గణిత శాస్త్రంలో ఇమిడి ఉండే అంతర్గత వాస్తవం.

గత యేడు జి‌డి‌పిని మూల సంఖ్యగా తీసుకుని వృద్ధి రేటును లెక్కిస్తారు. ఉదాహరణకి 2015లో చైనా జి‌డి‌పి 10$ ట్రిలియన్లు, ఇండియా జి‌డి‌పి 2$ ట్రి అనుకుందాం. 2016లో ఇండియా 10% వృద్ధి చెందాలంటే 2.2 ట్రిలియన్ల జి‌డి‌పి నమోదు కావాలి. అనగా 0.2 ట్రిలియన్లు అదనంగా 2016 లో ఉత్పత్తి జరగాలి. అదే చైనా అంతే వృద్ధి రేటు (10%) నమోదు చేయాలంటే 2016లో 11 ట్రిలియన్లకు ఉత్పత్తి పెరగాలి.

అనగా 10% వృద్ధి కోసం ఇండియా జి‌డి‌పి 0.2 ట్రి పెరిగితే సరిపోతుంది. కానీ చైనా జి‌డి‌పి అందుకు 5 రెట్లు (1 ట్రిలియన్) పెరగాలి. మూల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ అడ్వాంటేజీ ఉంటుంది.

అందువలన “చైనా కంటే మనమే వేగంగా వృద్ధి చెందుతున్నాం” అని గొప్పలు చెప్పుకోవడంలో ఏ మాత్రం రేషనాలిటీ లేదని అర్ధం చేసుకోవచ్చు. వృద్ధి రేటు ప్రజా జీవనం మెరుగుదలలో ప్రతిబింబించినప్పుడే దాని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్ధం ఉంటుంది. కానీ వాస్తవం అందుకు విరుద్ధం. వృద్ధి రేటుకూ, ప్రజల జీవితాలకు అసలే సంబంధం ఉండదు. ఎందుకంటే జరుగుతున్న వృద్ధి అంతా ధనిక వర్గాలకు చెందినదే గనుక.

కాబట్టి ప్రజలకు సంబంధించినంతవరకు జి‌డి‌పి, వృద్ధి రేటు లెక్కలే ఉత్త అసంబద్ధం. ఆ అసంబద్ధ లెక్కల్లో కూడా డీమానిటైజేషన్ ద్వారా మోడి ప్రభుత్వం ఇండియా పనితనాన్ని దెబ్బ కొట్టింది.

ఎమర్జింగ్ ఎకానమీలు కలిగి ఉన్న దేశాలు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయని ఐ‌ఎం‌ఎఫ్ పేర్కొంది.

  • అధిక కార్పొరేట్ రుణాలు
  • లాభదాయకత తగ్గుదల
  • బ్యాంకుల బలహీన బ్యాలన్స్ షీట్లు
  • పలుచని విధానపర మద్దతు

ఈ ప్రమాదాల వల్ల ఎమర్జింగ్ ఎకానమీలు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. అవి:

  • ఇరుకైన గ్లోబల్ ద్రవ్య పరిస్ధితులు
  • పెట్టుబడి ప్రవాహం వెనక్కి మళ్లింపు
  • బ్యాలన్స్ షీట్ల బలహీనం ఫలితంగా తీవ్ర స్ధాయి విలువ కోత (depreciation)

ఎమర్జింగ్ ఎకానమీలలో ఇండియా కూడా ఒకటి. ప్రముఖమైనది కూడా. పైన పేర్కొన్న ప్రమాదాలు, పరిణామాలు అన్నీ ఇండియాకు వర్తిస్తాయి. అవి ఇప్పటికే కనిపిస్తున్నాయి కూడా.

ఉదాహరణకి భారత కార్పొరేట్ రుణాలు పేరుకుపోయాయి. అవి బ్యాంకుల్లో ఎన్‌పి‌ఏల పెరుగుదలగా, మాల్యాల ఎగవేతలుగా, విదేశాలకు పారిపోవడంగా, ఎన్‌పి‌ఏల రద్దుగా మనకు కనిపిస్తున్నాయి. ఎన్‌పి‌ఏ లు పెరగడం వల్ల బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు ఖరాబు అయ్యాయి. అమెరికా బ్యాంకు రేటు (మన రెపో రేటు) ను వేగంగా పెంచడానికి ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో ఇండియా నుండి ఎఫ్‌ఐ‌ఐలు తరలిపోతున్నాయి. అనగా పెట్టుబడులు వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఎఫ్‌డి‌ఐలు ఉరికి పడటం అటుంచి మామూలుగా వస్తున్న దాఖలా కూడా లేదు. వస్తున్నాయని చెబుతున్న ఎఫ్‌డి‌ఐలలో అధిక భాగం మన వాళ్ళు విదేశాల్లో దాచిన నల్ల డబ్బు మారిషస్ రూట్ లో తెల్లధనంగా వస్తున్నదే అని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ ఐ‌ఎం‌ఎఫ్ పేర్కొన్న ప్రమాదాలు, పరిణామాలే అని గమనించవచ్చు.

మోడి చెప్పే గొప్పలు ‘కింద పడ్డా పై చేయి నాదే’ అని చూపేందుకు పడుతున్న తిప్పలే.

One thought on “నోట్ల రద్దు: ఇండియా వృద్ధి రేటు తగ్గించిన ఐ‌ఎం‌ఎఫ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s