స్మార్ట్ సిటీ: ఇంతవరకు ఒక్క పైసా రాలింది లేదు!

మోడి ప్రభుత్వం మరో విడత స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించింది. స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఎంపిక అయిన నగరాలను కేంద్రం ప్రకటించడం ఇది మూడోసారి. ఇన్నిసార్లు ప్రకటించినప్పటికీ ఈ రెండేళ్ల మోడి పాలనలో విదేశీ పెట్టుబడి ఒక్క రూపాయి కూడా (విదేశీ పెట్టుబడి కాబట్టి ఒక్క డాలర్ కూడా అందాం పోనీ) దేశంలోకి, స్మార్ట్ సిటీల్లోకి రాలేదు.

మొదటి విడత 20 నగరాల జాబితా విడుదల చేయగా రెండో విడత 13 నగరాల పేర్లను ప్రకటించారు. ఈసారి అత్యధికంగా 27 నగరాల పేర్లను విడుదల చేశారు. మూడో విడత నగరాలలో ప్రధాన మంత్రి నియోజకవర్గం వారణాసి కూడా ఉన్నది.

100 స్మార్ట్ సిటీలు అంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడి ఒకటే ఊదరగొట్టడమే గానీ అలా అనడంలో అర్ధం ఏమిటో చెప్పినవారు లేరు. స్మార్ట్ సిటీ పధకం నిజానికి అమెరికాకు చెందిన స్మార్ట్ సిటీ కౌన్సిల్ బ్రెయిన్ చైల్డ్ అన్న సంగతి తెలిసిన వాళ్లు కూడా చాలా తక్కువ మందే.

స్మార్ట్ సిటీగా ఎంపిక అయిన నగరాలకు సంవత్సరానికి 100 కోట్ల చొప్పున అయిదేళ్ళ పాటు కేంద్రం ఇస్తుందని చెప్పారు. అంటే అయిదేళ్లలో 500 కోట్లు! ఈ డబ్బుతో కొత్తగా సౌకర్యాలు అభివృద్ధి చేస్తారా అంటే సమాధానం అవును/కాదు అని చెప్పాల్సి ఉంటుంది.

ఎందుకంటే అప్పటికే నిర్దిష్ట స్ధాయికి సౌకర్యాలు అభివృద్ధి అయితేనే స్మార్ట్ సిటీగా నిధులు పొందడానికి అర్హత సాధిస్తాయి.

గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మూడే మూడు రెసిడెన్షియల్ పాఠశాలల్ని (మూడు ప్రాంతాలకు ఒక్కోటి చొ.న) రాష్ట్ర ప్రభుత్వం నడిపేది. రాష్ట్ర వ్యాపితంగా తెలివిగల విద్యార్ధులను సమీకరించి వారికి మరింత శిక్షణ ఇచ్చి మరింత తెలివిమంతులుగా తయారు చేయడం ప్రకటిత లక్ష్యం.

“ఆల్రెడీ తెలివి గల వాళ్ళకి వాళ్ళు ఇచ్చేదేంటి శిక్షణ? అలాంటి వాళ్ళని మాకు అప్పజెపితే వాళ్ళకు రాష్ట్ర ర్యాంకులు వచ్చేలా మేమూ చేయలేమా?” అని ఆగ్రహంగా ప్రశ్నించేవాళ్లు సాధారణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు. స్మార్ట్ సిటీల వ్యవహారం కూడా అలానే తగలడింది.

ఎంపిక కావాలంటే: ఈ-గవర్నెన్స్, ఆన్ లైన్ సమస్యల పరిష్కార వ్యవస్ధ అభివృద్ధి చేసి ఉండాలి; ఈ-న్యూస్ లెటర్ ప్రింట్ అవుతూ ఉండాలి; జనానికి ప్రభుత్వ చెల్లింపులు అన్నీ ఆన్ లైన్ లో జరుగుతూ ఉండాలి; 2011 నాటికంటే కనీసం 5 శాతం పెచ్చు లెట్రిన్ లు నిర్మించి ఉండాలి; ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్న రికార్డు ఉండాలి; పట్టణ సంస్కరణలు, పౌరుల పాత్ర అమలు అవుతూ ఉండాలి.

ఇవన్నీ ఈ దేశంలో ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్క గ్రామానికి అవసరం కాదా? స్మార్ట్ సిటీలేనా, స్మార్ట్ విలేజ్ లు అవసరం లేదా? అసలు అభివృద్ధికి నోచుకోని పట్టణాలు, గ్రామాలు ఎంపిక చేసి స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజ్ లుగా మార్చాలి గాని అప్పటికే అభివృద్ధి అయిన సిటీలని స్మార్ట్ సిటీలుగా చేస్తే అది గొప్ప ఎలా అవుతుంది.

పై సౌకర్యాలు కల్పించాక/స్మార్ట్ సిటీగా ఎంపిక అయ్యాక కేంద్రం ఏం చేస్తుంది? గ్యారంటీ నీటి-విద్యుత్ సరఫరా అయేలా చూస్తుంది; పరిశుభ్రత, వృధా నిర్వహణ చక్కగా జరిగేలా చూస్తుంది; సమర్ధ ప్రజా రవాణా అభివృద్ధి చేస్తుంది; బ్రహ్మాండమైన ఐ.టి కనెక్టివిటీ (హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్, వైఫై, 4G, 5G ఉంటే అదీ కూడా) కల్పిస్తుంది; పౌరులకు రక్షణ, భద్రతలు కల్పిస్తుంది.

అలాగే ఈ సౌకర్యాలకు స్మార్ట్ వసతులు జత చేస్తుంది. ప్రజలకు సమాచారం, సమస్యల సత్వర పరిష్కారం, సేవలను ఎలక్ట్రానికల్ అందజేయడం, వృధా నుండి విద్యుత్ & ఎరువులు తయారు చేయడం; వృధా నీటిని 100 శాతం ట్రీట్ చేయడం; స్మార్ట్ మీటర్లు & నిర్వహణ, నీటి శుభ్రత నిర్వహణ, సమర్ధవంతమైన పచ్చని గృహ నిర్మాణం, స్మార్ట్ పార్కింగ్, తెలివైన ట్రాఫిక్ నిర్వహణ…. ఇలా అనేకం.

ఇవన్నీ స్మార్ట్ సిటీలుగా ఎంపిక కానీ నగరాలకు వద్దా? అసలు గ్రామాలు ఏం పాపం చేసుకున్నాయి? పాలకులు ఎప్పుడూ వల్లించే ‘ఇంక్లూజివ్ గ్రోత్’ సంగతి ఏమిటి? బహిరంగంగానే, అధికారికంగానే పట్టణాల మధ్య ఇంత తేడా చూపించే ప్రభుత్వం పల్లెల పైన శీత కన్ను వేయదంటే ఎలా నమ్మటం?

ఒక్క డాలర్ కూడా…!

అదంతా ఒక ఎత్తైతే స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని తీసుకెళ్లి విదేశీ కంపెనీలకు అప్పగించడం. చెప్పడానికి పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్ అంటున్నారు గాని విధి విధానాలు అన్నీ అమెరికా కంపెనీయే చూస్తోందని తెలుస్తున్నది. స్మార్ట్ సిటీల కోసం దరఖాస్తులు స్వీకరించడం, ‘సిటీ ఛాలెంజ్’ అంటూ పోటీ పెట్టడం, ఎంపిక చేయడం అన్నీ అమెరికా కంపెనీ చేతుల మీదుగా నడుస్తోంది. మంత్రులు, అధికారులూ ఉంటారు గానీ వారి పాత్ర ఎంతవరకు అన్నది అనుమానం.

కాగా ఈ నెల ఆరంభంలో ద హిందు పత్రిక ఒక ఆర్‌టి‌ఐ అప్లికేషన్ పెట్టింది. ఇంతవరకు ఎంత విదేశీ పెట్టుబడి స్మార్ట్ సిటీ ల నిర్మాణం లోకి ప్రవహించింది, అని అడుగుతూ. ‘ఇప్పటికీ అసలేమీ రాలేదు’ అని తిరుగు టపాలో పట్టణాభివృద్ధి శాఖ నుండి సమాధానం వచ్చింది. వెంకయ్య నాయుడు ఈ శాఖకు మంత్రివర్యులు.

ప్రత్యేకంగా స్మార్ట్ సిటీల కోసమే వెంకయ్య నాయుడు గారు పలు మార్లు విదేశాలు వెళ్ళి ‘పెట్టుబడులు తెండి ప్లీజ్’ అని బతిమాలుకున్నారు. ఆయన వెళ్ళిన చోటల్లా వాగ్దానాల సిరులు తప్ప ఒక్క డాలర్ చుక్కా రాలి పడలేదు. విదేశాలు వెల్లడమే కాకుండా విదేశాల నుండి ఏ చిన్న అధికారి గానీ, మంత్రి గానీ వచ్చినప్పుడు కూడా నాయుడు గారు టంచనుగా హాజరు వేసుకుని పెట్టుబడి అడుగుతున్నారు.

ఎంత పెట్టుబడి వస్తుందని ఆశిస్తున్నారు అని అడిగితే దానిపైన ఇంకా అధ్యయనం చేయలేదని మంత్రి నుండి సమాధానం వచ్చింది. అంటే ఎలాంటి అధ్యయనాలు చేయకుండా 60 స్మార్ట్ సిటీల కోసం 66,883 కోట్ల నిధులు అయిదేళ్ళ పాటు ఇస్తామని కేంద్రం ఎలా చెబుతుందో తెలియకుంది.

స్వర్ణ చతుర్భుజి అనీ, ఎక్స్ ప్రెస్ హైవేలు అనీ నాలుగు, ఆరు లైన్ల రోడ్లను, ఎక్కడంటే అక్కడ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. పి‌పి‌పి కింద నిర్మించిన ఈ రోడ్ల పైన ఎక్కడంటే అక్కడ టోల్ ప్లాజాలు కట్టి ప్రైవేటు కంపెనీలు కోట్లు గుంజుతున్నాయి.

ఇదే తరహాలో పి‌పి‌పి కింద నిర్మించే స్మార్ట్ సిటీలలో ఎన్నెన్ని ఫీజులు జనం చెల్లించుకోవలో ఊహకు కూడా అందడం లేదు. ‘ఆ సౌకర్యం కల్పిస్తాం, ఈ సౌకర్యం కల్పిస్తాం’ అని ప్రభుత్వాలు చెప్పినంత మాత్రాన అవన్నీ వచ్చేస్తాయని భ్రమ పడనవసరం లేదు. ఓ శుభ ముహూర్తాన మనకు తెలియకుండానే మనం నివసించే నగరం ‘స్మార్ట్ సిటీ’ అయిపోయిందని ప్రకటన విడుదల అయితే ఆశ్చర్యపోవద్దు. ఏవో కొన్ని కొత్త నిర్మాణాలు కనపడతాయి గానీ ఆ పేరుతో వీర బాదుడు ఫీజులు వసూలు చేస్తారని మరవకూడదు.

ఆ ఫీజుల్లో ప్రైవేటు కంపెనీలకు, వాటి వెనుక ఉన్న విదేశీ ఫైనాన్స్ పెట్టుబడికి సింహభాగం వెళ్లిపోతుందని ప్రత్యేకంగా చెప్పాలా?

అమెరికన్ ‘నెట్ ఫ్లిక్స్’ కు ప్రవేశం ఇవ్వని చైనా!

అదే భారత పాలకవర్గాలైతే ఎగిరి గంతేసి ఉండేవాళ్లు. చట్టాలు నిర్దేశించిన నియమ నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కేసి ‘రండి రండి రండి దయ చేయండీ! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!’ అని పాడుతూ స్వాగత సత్కారాలు పలికేవాళ్లు.

“చైనాలోకి జొరబడడం ఎంతవరకు వచ్చింది?” అని రాయిటర్స్ వార్తా సంస్ధ ‘నెట్ ఫ్లిక్స్ ఇంక్.’ కంపెనీ సి‌ఈ‌ఓ రీడ్ హేస్టింగ్స్ ని అడిగింది. దానికాయన నిరాశగా పెదవి విరిచి “ప్చ్! ఎలాంటి పురోగతి లేకుండా పోయింది” అని పాపం నిస్పృహతో బదులిచ్చాడు.

నెట్ ఫ్లిక్స్ ఇంక్ అంటే అమెరికాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ కంపెనీ. హాలీవుడ్ సినిమాలను, టి.వి సీరియళ్లను ప్రసారం చేసే అమెరికా సినిమా ఛానెళ్లు ఉన్నట్లే వాటిని ఇంటర్నెట్ మాధ్యమంలో స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేసేందుకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ వెలిసింది.

ఇంటర్నెట్ అంటే ప్రపంచంలో అన్ని చోట్లా ఉంటుంది గనక పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచం లోని నలుమూలలకీ చొరబడి లాభాలు గుంజుకునే వెసులుబాటు నెట్ ఫ్లిక్స్ కి ఉంటుంది.  ఈ కంపెనీకి గత కొంత కాలంగా అమెరికాలో లాభాలు పడిపోతున్నాయి. వృద్ధి మందగించింది. దానితో అది కొత్త మార్కెట్ వెతుకులాటలో పడిపోయింది.

నెట్ ఫ్లిక్స్ వినియోగదారుడికి కంప్యూటర్ అయితే గనక బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఏ ల్యాప్ టాప్ గానీ, టాబ్లెట్ గానీ చివరికి స్మార్ట్ ఫోన్ అయినా సరే, 3G లేదా 4G కనెక్షన్ ఉంటే సరిపోతుంది. నెట్ ఫ్లిక్స్ కి నెలకి ఇంత అని గానీ, సినిమాకి ఇంత అని గాని చెల్లిస్తే దానిని స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేస్తారు.

సినిమాని డౌన్ లోడ్ చేసుకుంటే ఒక రేటు, స్త్రీమింగ్ ద్వారా ఒకసారి మాత్రమే చూడదలిస్తే ఒక రేటు వసూలు చేస్తారు. నెట్ ఫ్లిక్స్ అప్లికేషన్ ని యాండ్రాయిడ్ ఓ‌ఎస్ అయితే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటివి అయితే యాపిల్ కంపెనీకి చెందిన ఆప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఈ వ్యవహారంలో నెట్ ఫ్లిక్స్ కంపెనీ పెట్టే పెట్టుబడి దాదాపు ఏమీ ఉండదు. ప్లే స్టోర్, ఆప్ స్టోర్ వాళ్ళకి ఎంతో కొంత ఫీజు చెల్లించడం తప్ప వ్యవస్ధాగత ఖర్చులు దాదాపు నిల్.

ఇలాంటి కంపెనీకి అమెరికాలో వృద్ధి మందగించడంతో చైనా మార్కెట్ పైన కన్ను పడింది. కానీ చైనా అంత తేలికగా పర్మిషన్ ఇవ్వదు. మొదట తన ప్రయోజనం చూసుకున్నాకనే విదేశీ కంపెనీలను అనుమతిస్తుంది. పైసా కూడా పెట్టుబడి తేని నెట్ ఫ్లిక్స్ కి అనుమతి ఇవ్వాల్సిన అవసరం చైనాకు అసలే లేదు. అందుకని కంపెనీకి చైనా ప్రభుత్వం తన షరతులు పాటిస్తేనే అనుమతి ఇస్తాం అని చెబుతోంది.

netflix-logo
Netflix logo

ఇండియాలో ప్రవేశానికి మనవాళ్లు ఎప్పుడో ఒప్పేసుకున్నారు. మన సినిమాలకు గిరాకీ పడిపోతుందనీ, మన సినిమా వాళ్ళ వ్యాపారం దెబ్బ తింటుందనీ తెలిసినా కూడా అడిగిందే తడవుగా పర్మిషన్ ఇచ్చేశారు. హాలీవుడ్ సినిమాల దూకుడుతో అంత స్ధాయిలో సినిమాలు తీయలేని భారతీయ సినిమాలు కొండెక్కుతున్నాయి.

‘రాజుని చూసిన కంటితో మొగుడ్ని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది’ అన్నట్లుగా టికెట్ కొని చూసేవాడు కంటికి ఇంపుగా ఉన్న సినిమా చూస్తాడు గానీ ‘మన సినిమా, మనవాళ్లని ప్రోత్సహించాలి’ అనుకోడు కదా! ఇది గ్రహించని సినిమా నిర్మాతలు పైరసీ తమ లాభాల్ని నాశనం చేస్తోందని వాపోతూ, జనం పైన దాడి చేయడం, చిన్న చిన్న వ్యాపారుల మీదికి దండెత్తడం చేస్తున్నారు.

ఆ మధ్య మన హీరో మహేష్ గారు వరంగల్ లో సి‌డి షాపు మీద దాడి చేసి వీర ఫోజు కొట్టడం గుర్తుండే ఉంటుంది. ఈ అరివీర శత్రు భయంకర హీరోలు హాలీవుడ్ సినిమాలని విచ్చలవిడిగా అనుమతించడం పైన ఒక్క ముక్కా మాట్లాడరు. దాదాపు సమస్త భారతీయ భాషలలోకి డబ్బింగ్ చేసుకుని మరీ మార్కెట్ ని కబళిస్తుంటే అదేమని అడిగిన పాపాన పోరు. తమ సమస్త కష్టాలకీ ఉదర పోషణ కోసం కక్కుర్తి పడే చిన్న వ్యాపారుల మీదికి మాత్రం సినిమా హీరోలకు మల్లేనే విరుచుకుపడటం మాత్రం చేతనవుతుంది.

చైనాకు మర్మం తెలుసు గనక, తన మార్కెట్ ని తన కోసం ఎలా భద్రపరుచుకోవాలో తెలుసు గనక నెట్ ఫ్లిక్స్ కి ఏకాఎకిన అనుమతి ఇవ్వడం లేదు. ఆ దేశం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) లు పెట్టినా కూడా ‘దేశీయ గడ్డ పైన విదేశీ ప్రాంతం లాగా ఉండాలి’ అంటూ వెర్రి మొర్రి చట్టాలు చేయలేదు. తన మానవ వనరులను పెట్టుబడిగా పెట్టి, తన షరతుల ప్రకారమే సెజ్ లు ఏర్పాటు చేసింది. పేరు పొందిన మహా మహా కంపెనీలన్నీ పరుగెట్టుకుని వచ్చేలా చేసింది. యేటేటా వాణిజ్య మిగులు పోగేసుకుంది. ఆ మిగులుతోనే ఆర్ధిక శక్తిగా అవతరించింది.

“లేదు. మేము ఇంకా ఆ విషయంలో పని చేస్తూనే ఉన్నాం. సమస్య ఏమిటి అంటే… ఇప్పటికే ఎప్పటి సమస్యే, ప్రభుత్వ అనుమతి లేదు. చైనాలో ప్రవేశించాలంటే మేము నిర్దిష్ట లైసెన్స్ పొందవలసి ఉంటుంది” అని రాయిటర్స్ ప్రశ్నకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ సి‌ఈ‌ఓ సమాధానం ఇచ్చాడు.

మనవాళ్లేమో మన చట్టాలను మనమే ‘లైసెన్స్ రాజ్’ అంటూ అవహేళన చేసుకుని చట్టాలన్నీ రద్దు చేసుకుని, నిబంధనలన్నీ సరళీకరించేసి, గేట్లు బార్లా తెరుచుకుని ‘రండి బాబూ రండి!’ అని ఎలుగెత్తి పిలుస్తున్నారు. ఏం లాభం? మన ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఉంటే ఆ మార్కెట్ కోసం కంపెనీలు పరుగెట్టుకుని వచ్చేవి. కానీ 69 యేళ్ళ స్వాహాతంత్రంలో విదేశాలకు దోచి పెట్టి, అందులో తామూ భాగం పంచుకోవడం తప్ప అశేష ప్రజానీకపు ఆర్ధిక వనరులను అభివృద్ధి చేసిన పాపానికి ఎప్పుడు ఒడిగట్టారు?

చైనాలో 1949లో అక్కడి ప్రజలు నూతన ప్రజాస్వామిక విప్లవం’ ను విజయవంతం చేసుకున్నారు. సోషలిస్టు ప్రభుత్వం 40 యేళ్ళ పాటు పని చేసి ప్రజల ఆర్ధిక శక్తిని ఇనుమడింపజేయడమే కాకుండా శక్తివంతమైన రాజ్య వ్యవస్ధలను, ఆర్ధిక నిర్మాణాలను నిర్మించి పెట్టింది. ఇప్పటి చైనా సక్సెస్ కు పునాది ఆనాటి సోషలిస్టు నిర్మాణం వేసినదే.

ఇండియాలో జరిగింది అది కాదు కదా! ప్రజలు తిరుగుబాటు చేశారు కానీ వాళ్ళు తెల్లవాడి జేబులో ఉన్న కాంగ్రెస్ ని నమ్మారు. వాళ్లేమో ప్రజల తిరుగుబాటుని భద్రంగా దారి మళ్లించి, బ్రిటిష్ ఆర్ధిక దోపిడితో పాటు ఇతర సామ్రాజ్యవాద దేశాల దోపిడి కూడా నిరాఘాటంగా కొనసాగేందుకు దోహదం చేసే ‘అధికార మార్పిడి’కి మాత్రమే ఒప్పుకుని జనం ప్రయోజనాలను నట్టేట ముంచారు.

నెట్ ఫ్లిక్స్ కి ఇండియా ఎగురుకుంటూ అనుమతి ఇవ్వడానికీ, చైనా ఆచితూచి అడుగు వేయడానికి మధ్య తేడా ఇందు వల్లనే ఏర్పడింది.