అమెరికన్ ‘నెట్ ఫ్లిక్స్’ కు ప్రవేశం ఇవ్వని చైనా!

అదే భారత పాలకవర్గాలైతే ఎగిరి గంతేసి ఉండేవాళ్లు. చట్టాలు నిర్దేశించిన నియమ నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కేసి ‘రండి రండి రండి దయ చేయండీ! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!’ అని పాడుతూ స్వాగత సత్కారాలు పలికేవాళ్లు.

“చైనాలోకి జొరబడడం ఎంతవరకు వచ్చింది?” అని రాయిటర్స్ వార్తా సంస్ధ ‘నెట్ ఫ్లిక్స్ ఇంక్.’ కంపెనీ సి‌ఈ‌ఓ రీడ్ హేస్టింగ్స్ ని అడిగింది. దానికాయన నిరాశగా పెదవి విరిచి “ప్చ్! ఎలాంటి పురోగతి లేకుండా పోయింది” అని పాపం నిస్పృహతో బదులిచ్చాడు.

నెట్ ఫ్లిక్స్ ఇంక్ అంటే అమెరికాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ కంపెనీ. హాలీవుడ్ సినిమాలను, టి.వి సీరియళ్లను ప్రసారం చేసే అమెరికా సినిమా ఛానెళ్లు ఉన్నట్లే వాటిని ఇంటర్నెట్ మాధ్యమంలో స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేసేందుకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ వెలిసింది.

ఇంటర్నెట్ అంటే ప్రపంచంలో అన్ని చోట్లా ఉంటుంది గనక పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచం లోని నలుమూలలకీ చొరబడి లాభాలు గుంజుకునే వెసులుబాటు నెట్ ఫ్లిక్స్ కి ఉంటుంది.  ఈ కంపెనీకి గత కొంత కాలంగా అమెరికాలో లాభాలు పడిపోతున్నాయి. వృద్ధి మందగించింది. దానితో అది కొత్త మార్కెట్ వెతుకులాటలో పడిపోయింది.

నెట్ ఫ్లిక్స్ వినియోగదారుడికి కంప్యూటర్ అయితే గనక బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఏ ల్యాప్ టాప్ గానీ, టాబ్లెట్ గానీ చివరికి స్మార్ట్ ఫోన్ అయినా సరే, 3G లేదా 4G కనెక్షన్ ఉంటే సరిపోతుంది. నెట్ ఫ్లిక్స్ కి నెలకి ఇంత అని గానీ, సినిమాకి ఇంత అని గాని చెల్లిస్తే దానిని స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేస్తారు.

సినిమాని డౌన్ లోడ్ చేసుకుంటే ఒక రేటు, స్త్రీమింగ్ ద్వారా ఒకసారి మాత్రమే చూడదలిస్తే ఒక రేటు వసూలు చేస్తారు. నెట్ ఫ్లిక్స్ అప్లికేషన్ ని యాండ్రాయిడ్ ఓ‌ఎస్ అయితే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటివి అయితే యాపిల్ కంపెనీకి చెందిన ఆప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఈ వ్యవహారంలో నెట్ ఫ్లిక్స్ కంపెనీ పెట్టే పెట్టుబడి దాదాపు ఏమీ ఉండదు. ప్లే స్టోర్, ఆప్ స్టోర్ వాళ్ళకి ఎంతో కొంత ఫీజు చెల్లించడం తప్ప వ్యవస్ధాగత ఖర్చులు దాదాపు నిల్.

ఇలాంటి కంపెనీకి అమెరికాలో వృద్ధి మందగించడంతో చైనా మార్కెట్ పైన కన్ను పడింది. కానీ చైనా అంత తేలికగా పర్మిషన్ ఇవ్వదు. మొదట తన ప్రయోజనం చూసుకున్నాకనే విదేశీ కంపెనీలను అనుమతిస్తుంది. పైసా కూడా పెట్టుబడి తేని నెట్ ఫ్లిక్స్ కి అనుమతి ఇవ్వాల్సిన అవసరం చైనాకు అసలే లేదు. అందుకని కంపెనీకి చైనా ప్రభుత్వం తన షరతులు పాటిస్తేనే అనుమతి ఇస్తాం అని చెబుతోంది.

netflix-logo
Netflix logo

ఇండియాలో ప్రవేశానికి మనవాళ్లు ఎప్పుడో ఒప్పేసుకున్నారు. మన సినిమాలకు గిరాకీ పడిపోతుందనీ, మన సినిమా వాళ్ళ వ్యాపారం దెబ్బ తింటుందనీ తెలిసినా కూడా అడిగిందే తడవుగా పర్మిషన్ ఇచ్చేశారు. హాలీవుడ్ సినిమాల దూకుడుతో అంత స్ధాయిలో సినిమాలు తీయలేని భారతీయ సినిమాలు కొండెక్కుతున్నాయి.

‘రాజుని చూసిన కంటితో మొగుడ్ని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది’ అన్నట్లుగా టికెట్ కొని చూసేవాడు కంటికి ఇంపుగా ఉన్న సినిమా చూస్తాడు గానీ ‘మన సినిమా, మనవాళ్లని ప్రోత్సహించాలి’ అనుకోడు కదా! ఇది గ్రహించని సినిమా నిర్మాతలు పైరసీ తమ లాభాల్ని నాశనం చేస్తోందని వాపోతూ, జనం పైన దాడి చేయడం, చిన్న చిన్న వ్యాపారుల మీదికి దండెత్తడం చేస్తున్నారు.

ఆ మధ్య మన హీరో మహేష్ గారు వరంగల్ లో సి‌డి షాపు మీద దాడి చేసి వీర ఫోజు కొట్టడం గుర్తుండే ఉంటుంది. ఈ అరివీర శత్రు భయంకర హీరోలు హాలీవుడ్ సినిమాలని విచ్చలవిడిగా అనుమతించడం పైన ఒక్క ముక్కా మాట్లాడరు. దాదాపు సమస్త భారతీయ భాషలలోకి డబ్బింగ్ చేసుకుని మరీ మార్కెట్ ని కబళిస్తుంటే అదేమని అడిగిన పాపాన పోరు. తమ సమస్త కష్టాలకీ ఉదర పోషణ కోసం కక్కుర్తి పడే చిన్న వ్యాపారుల మీదికి మాత్రం సినిమా హీరోలకు మల్లేనే విరుచుకుపడటం మాత్రం చేతనవుతుంది.

చైనాకు మర్మం తెలుసు గనక, తన మార్కెట్ ని తన కోసం ఎలా భద్రపరుచుకోవాలో తెలుసు గనక నెట్ ఫ్లిక్స్ కి ఏకాఎకిన అనుమతి ఇవ్వడం లేదు. ఆ దేశం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) లు పెట్టినా కూడా ‘దేశీయ గడ్డ పైన విదేశీ ప్రాంతం లాగా ఉండాలి’ అంటూ వెర్రి మొర్రి చట్టాలు చేయలేదు. తన మానవ వనరులను పెట్టుబడిగా పెట్టి, తన షరతుల ప్రకారమే సెజ్ లు ఏర్పాటు చేసింది. పేరు పొందిన మహా మహా కంపెనీలన్నీ పరుగెట్టుకుని వచ్చేలా చేసింది. యేటేటా వాణిజ్య మిగులు పోగేసుకుంది. ఆ మిగులుతోనే ఆర్ధిక శక్తిగా అవతరించింది.

“లేదు. మేము ఇంకా ఆ విషయంలో పని చేస్తూనే ఉన్నాం. సమస్య ఏమిటి అంటే… ఇప్పటికే ఎప్పటి సమస్యే, ప్రభుత్వ అనుమతి లేదు. చైనాలో ప్రవేశించాలంటే మేము నిర్దిష్ట లైసెన్స్ పొందవలసి ఉంటుంది” అని రాయిటర్స్ ప్రశ్నకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ సి‌ఈ‌ఓ సమాధానం ఇచ్చాడు.

మనవాళ్లేమో మన చట్టాలను మనమే ‘లైసెన్స్ రాజ్’ అంటూ అవహేళన చేసుకుని చట్టాలన్నీ రద్దు చేసుకుని, నిబంధనలన్నీ సరళీకరించేసి, గేట్లు బార్లా తెరుచుకుని ‘రండి బాబూ రండి!’ అని ఎలుగెత్తి పిలుస్తున్నారు. ఏం లాభం? మన ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఉంటే ఆ మార్కెట్ కోసం కంపెనీలు పరుగెట్టుకుని వచ్చేవి. కానీ 69 యేళ్ళ స్వాహాతంత్రంలో విదేశాలకు దోచి పెట్టి, అందులో తామూ భాగం పంచుకోవడం తప్ప అశేష ప్రజానీకపు ఆర్ధిక వనరులను అభివృద్ధి చేసిన పాపానికి ఎప్పుడు ఒడిగట్టారు?

చైనాలో 1949లో అక్కడి ప్రజలు నూతన ప్రజాస్వామిక విప్లవం’ ను విజయవంతం చేసుకున్నారు. సోషలిస్టు ప్రభుత్వం 40 యేళ్ళ పాటు పని చేసి ప్రజల ఆర్ధిక శక్తిని ఇనుమడింపజేయడమే కాకుండా శక్తివంతమైన రాజ్య వ్యవస్ధలను, ఆర్ధిక నిర్మాణాలను నిర్మించి పెట్టింది. ఇప్పటి చైనా సక్సెస్ కు పునాది ఆనాటి సోషలిస్టు నిర్మాణం వేసినదే.

ఇండియాలో జరిగింది అది కాదు కదా! ప్రజలు తిరుగుబాటు చేశారు కానీ వాళ్ళు తెల్లవాడి జేబులో ఉన్న కాంగ్రెస్ ని నమ్మారు. వాళ్లేమో ప్రజల తిరుగుబాటుని భద్రంగా దారి మళ్లించి, బ్రిటిష్ ఆర్ధిక దోపిడితో పాటు ఇతర సామ్రాజ్యవాద దేశాల దోపిడి కూడా నిరాఘాటంగా కొనసాగేందుకు దోహదం చేసే ‘అధికార మార్పిడి’కి మాత్రమే ఒప్పుకుని జనం ప్రయోజనాలను నట్టేట ముంచారు.

నెట్ ఫ్లిక్స్ కి ఇండియా ఎగురుకుంటూ అనుమతి ఇవ్వడానికీ, చైనా ఆచితూచి అడుగు వేయడానికి మధ్య తేడా ఇందు వల్లనే ఏర్పడింది.

 

సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది.

రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది.

గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ను బ్యాలన్స్ షీట్ లో చూపించకుండా దాచి పెట్టే వెసులుబాటు ఉండేది. దానివల్ల మొండి బాకీలను బ్యాలన్స్ షీట్ లో చూపేవారు కాదు. ఫలితంగా బ్యాంకు బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తోందని చూపించేవారు. మొండి బాకీ కాస్తో కూస్తో వసూలైతే అప్పుడే లాభంగా పుస్తకంలో చూపేవారు.

ఈ వెసులుబాటు రుణాల ఎగవేతదారులకు గొప్ప వరం అయింది. (అసలు వాళ్ళకు వరం ఇవ్వడం కోసమే బాకీలు దాచిపెట్టే దారుణాన్ని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.) పుస్తకాలలో కనపడని బాకీలు వసూలు చేయాలన్న ధ్యాసే ఉండేది కాదు. పొరబాటున వసూలు అయినవి పోగా మిగిలిన మొండి బాకీలను కొన్నేళ్ళ తర్వాత రద్దు చేసేసేవాళ్ళు. అప్పు రద్దు చేస్తే బాకీదారులకు వరమే కదా!

రఘురాం రాజన్ ఈ వెసులుబాటు లేకుండా చేశారు. ఎన్‌పి‌ఏ లు అన్నింటినీ పుస్తకాల్లో చూపాల్సిందే అని నిబంధన విధించారు. దానితో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. భారత బ్యాంకుల సంక్షోభం గురించి పశ్చిమ పత్రికలు కూడా మాట్లాడటం మొదలెట్టాయి.

రఘురాం రాజన్ చర్య ఫలితాన్ని తెలుసుకోవాలంటే ఒక అంశాన్ని చూడొచ్చు. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి బాకీలు 4.6 శాతం ఉండేవి. కొత్త నిబంధన విధించాక అది ఈ యేడు జూన్ నాటికి అమాంతం 8.7 శాతానికి పెరిగింది (ఆర్‌బి‌ఐ).  దాదాపు రెట్టింపు అయిందన్నమాట!

రీ షెడ్యూల్ చేసిన రుణాలు, వాయిదా వేసిన రుణాలు కూడా కలిపితే మొత్తం బాకిల్లో మొండి బాకీలు, ఈ యేడు జూన్ చివరి నాటికి, 12 శాతంగా తేలాయి.

ఈ సంక్షోభం నుండి భారతీయ బ్యాంకులు బైట పడుతున్నాయని మూడిస్ ‘సర్టిఫికేట్’ ఇచ్చింది. బ్యాంకుల రేటింగ్ ని ‘నెగిటివ్’ నుండి ‘స్టేబుల్’ కి మార్చినట్లు ప్రకటించింది. ఈ రేటింగు వచ్చే 12 నుండి 18 నెలల దాకా ఉంటుందని హామీ ఇచ్చింది.

ఈ కాలంలో మొండి బాకీల పరిణామం పెరగడం కొనసాగినప్పటికీ, పెరుగుదల రేటు గతం కంటే తక్కువ ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అందుకే రేటింగ్ ని పెంచింది.

BIS in Switzerland
BIS in Switzerland

బేసెల్ III స్టాండర్డ్ ని చేరుకోవడానికి ఇండియన్ బ్యాంకులు 2019 లోపల మరో 1.2 ట్రిలియన్ రూపాయలు (ట్రిలియన్ = లక్ష కోట్లు) లేదా 18 బిలియన్ డాలర్లు సమీకరించాల్సి ఉంటుందని మూడీస్ తేల్చింది.

బేసెల్ అనేది స్విట్జర్లాండ్ లో ఓ నగరం. ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు బేసెల్ నగరం వద్ద కలుస్తాయి.  ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రమాణాలను నిర్దేశించే ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈ నగరంలోనే ఉన్నది.

2008-09 నాటి ద్రవ్య ఆర్ధిక సంక్షోభం తర్వాత అటువంటి పరిస్ధితి మళ్ళీ రాకుండా ఉండేందుకు అని చెబుతూ ఈ బి‌ఐ‌ఎస్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రమాణాల కలయికని బేసెల్ III గా పిలుస్తారు.
ఈ ప్రమాణాలు సంక్షోభాల నివారణకు అని చెప్పడం పూర్తి వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి అంటే ఈ ప్రమాణాల అసలు లక్ష్యం ప్రపంచ వ్యాపిత ద్రవ్య వనరులను ఒక పద్ధతి ప్రకారం సమీకరించి అంతర్జాతీయ ఫైనాన్స్ కేపిటల్ కు సేవ చేసేదిగా మార్చడం. మూడో ప్రపంచ దేశాల ద్రవ్య వ్యవస్ధలు ఈ తరహా సేవ చేయటానికి వీలు లేకుండా వెనకబడి ఉన్నాయి. తమకు అందుబాటులో ఉండటానికి వీలుగా మూడో ప్రపంచ దేశాల ద్రవ్య మార్కెట్ ను రూపొందించుకోవటానికి పశ్చిమ ఫైనాన్స్ కేపిటల్ బేసెల్ III ప్రమాణాలను రూపొందించింది.

బేసెల్ III ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్ధను మార్చేందుకు మొదట 2015 గడువుగా విధించారు. అది సాధ్యం కాదని 2017 కి జరిపారు. అదీ కుదరదని గ్రహించి మార్చి 2019కి జరిపారు. మూడిస్ చెబుతున్న 2019 మార్చి లక్ష్యం ఈ కోణంలో నుండి చూడాలి.

 

WTO: అమెరికా చేతిలో ఇండియాకు మరో ఓటమి

సోలార్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఇండియాకు మరో ఓటమి ఎదురయింది. అమెరికాకు అనుకూలంగా WTO ఇచ్చిన తీర్పుపై ఇండియా అప్పీలుకు వెళ్లగా అప్పిలేట్ బోర్డు కూడా అమెరికా వాదనకు మద్దతుగా వచ్చింది. దానితో అమెరికా సోలార్ విద్యుత్ కంపెనీలు ఇండియాలో ముడి సరుకులను వినియోగించి ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేయాలన్న ఇండియా వాదన మరో ఓటమి ఎదుర్కొంది. 

జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ పధకం కింద కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాకాలు ప్రకటించింది. ఈ పధకం కింద దేశీయ సోలార్ పరిశ్రమలను ప్రోత్సహించడం మానుకుని ‘పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పేరుతొ దొడ్డి దారిన విదేశీ కంపెనీలకు స్వాగతం పలికింది. దానితో ‘ఒంటె గుడారం’ సామెత తరహాలో మొత్తం సోలార్ విద్యుత్ మార్కెట్ ప్రక్రియను తమ చేతుల్లో తీసుకునేందుకు విదేశీ కంపెనీలు ఉపక్రమించాయి. 

అమెరికన్ కంపెనీలు పధకం లోని లొసుగులను ఉపయోగించుకుని సోలార్ విద్యుత్ మార్కెట్ ను చేజిక్కించుకునే కృషిలో నిమగ్నం కావడంతో ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న భారత కంపెనీలు మూసివేతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. మోజర్ బేర్, ఇండో సోలార్ తదితర కంపెనీలు తమకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్ధితుల గురించి కేంద్రానికి మొర పెట్టుకున్నాయి. 

దానితో దేశీయ కంపెనీలకు కొంతయినా తోడ్పడాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం కొన్ని షరతులు ప్రవేశపెట్టింది. అమెరికా లేదా ఇతర విదేశీ కంపెనీలు సరఫరా చేసే సోలార్ ప్యానెళ్ల తయారీలో కనీసం 8 శాతం అయినా దేశీయంగా సేకరించిన ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి అయి ఉండాలని నిర్దేశించింది. అనగా భారత ప్రభుత్వం లక్శ్యంగా నిర్దేశించిన 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కేవలం 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతీయ సరుకుల ద్వారా తయారయిన సోలార్ విద్యుత్ పరికరాల ద్వారా ఉత్పత్తి కావాలని పేర్కొన్నది. 

ఇది కూడా అమెరికా కంపెనీలకు ఇష్టం లేకపోయింది. ఒకసారి భారతీయ కంపెనీలకు అవకాశం ఇస్తే అవి తమ కంపెనీలకు పోటీగా తయారు అవుతాయని అమెరికా కంపెనీలకు బాగానే తెలుసు. అందుకే, భారత ప్రభుత్వం విధించిన షరతులు WTO ఒప్పందం నిర్దేశించిన వాణిజ్య సూత్రాలకు విరుద్ధం అంటూ WTO కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారించిన WTO విచారణ విభాగం అమెరికా వాదనకు మద్దతు ఇస్తూ తీర్పు ఇచ్చింది. భారత ప్రభుత్వం విధించిన షరతు “విదేశీ కంపెనీలకు కూడా స్వదేశీ కంపెనీల లాగానే చూడాలన్న” సూత్రానికి విరుద్ధంగా ఉన్నదని, కాబట్టి షరతును ఎత్తివేయాలని తీర్పు చెపింది. 

WTO తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అప్పీలుకు వెళ్ళింది. అప్పిలేట్ బోర్డు కూడా అదే తీర్పు చెబుతూ పాత తీర్పును సమర్ధించింది. దానితో ఇపుడిపుడే వృద్ధిలోకి వస్తున్న భారతీయ సోలార్ విద్యుత్ కంపెనీలు అభివృద్ధి చెందడానికి దారులు మూసుకుపోయినట్లు అయింది. ఇక చచ్చినట్లు  కొత్తగా ఉత్పత్తిలోకి ప్రవేశించిన భారతీయ కంపెనీలు, ఇప్పటికే అభివృద్ధి సాధించిన, పెట్టుబడి వనరులు దండిగా కలిగిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ కంపెనీలతో పోటీ పడవలసిన అగత్యం ఏర్పడింది. 

పశ్చిమ కంపెనీలు తమ పెట్టుబడి వనరుల సాయంతో ఆరంభంలో తక్కువ ధరలకు సోలార్ పరికరాలను అందుబాటులోకి తెస్తాయి. దానితో భారతీయ కంపెనీలు అనివార్యంగా అంటాము తమకు లాభదాయకం కాని ధరలకు మార్కెట్ చేయాల్సి వస్తుంది. లాభాలు లేనప్పుడు పరిశ్రమ మూసుకోవడం తప్ప మరో దారి ఉండదు. ఆ విధంగా విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీల నుండి ఎదురయ్యే పోటీని మోసపూరితంగా తప్పిస్తాయి. పోటీ కంపెనీలు మూత పడ్డాక ఇక మార్కెట్ ప్రక్రియలను అమెరికా, విదేశీ కంపెనీలే శాసిస్తాయి. ఆ కంపెనీలు ఏ ధర చెబితే అదే ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవలసి వస్తుంది. 

ఒక వేళ ప్రతికూల పరిస్ధితులలో కూడా దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవచ్చు. మెరుగైన ఉత్పత్తి ప్రక్రియలను కనుగొని, చౌక ధరలకు సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని తద్వారా విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగల స్ధితికి అభివృద్ధి కావచ్చు. అటువంటి పరిస్ధితి ఏర్పడితే బహుళజాతి కంపెనీలు మెర్జర్ & అక్విజిషన్ ఎత్తుగడ ద్వారా పోటీని లేకుండా చేసుకుంటాయి. అనగా పోటీ ఇవ్వగల కంపెనీలను తామే కొనుగోలు చేస్తాయి. తగిన ధర కంటే ఎక్కువే చెల్లించి ప్రత్యర్థి కంపెనీలను కైవసం చేసుకుంటాయి. 

కొనుగోలుకు ఒప్పుకోకపొతే ఒప్పుకోక తప్పని పరిస్ధితిని కల్పిస్తాయి. భారత అధికారులను కొనుగోలు చేసి వారి చేతనే ఒత్తిడి తెస్తాయి. లేదా పారిశ్రామిక కుట్రలకు (industrial sabotage) చర్యలకు పాల్పడతాయి. మార్కెటీకరణ కష్టం అయేలా చేస్తాయి. ఈ గొడవంతా ఎందుకు లెమ్మని దేశీయ కంపెనీలు ఇష్టం లేకపోయినా తమ వ్యాపారాన్ని, సంస్ధను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేస్తాయి.  

కనీసం 8 శాతం దేశీయ వనరుల నుండి ప్రొక్యూర్ మెంట్ జరిగినా కూడా దేశీయ కంపెనీలకు గ్యారంటీ కలిగిన మార్కెట్ సమకూరుతుంది. దేశీయ కంపెనీలు ఆ కనీస మార్కెట్ తోనే నిలదొక్కుకోగలుగుతాయి. ఆ మాత్రం మార్కెట్ మన కంపెనీలకు ఇవ్వడానికి అమెరికా ఒప్పుకోలేదంటే బహుళజాతి కంపెనీల వ్యూహాలు, ఎత్తుగడలు ఏ స్ధాయిలో పక్కాగా, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అమలు చేస్తాయో ఒక అవగాహనకు రావచ్చు. 

అప్పిలేట్ బోర్డు తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పు ఇచ్చిన 15 నెలల లోపు దానిని అమలు చేయాల్సి ఉంటుంది. మరి ప్రత్యేక పరిస్ధితులు ఉన్నట్లయితే ఈ గడువు 18 నెలల వరకు ఉండవచ్చు. కాని పత్రికల కధనం ప్రకారం చూస్తే 15 నెలలకు కూడా అమెరికా కంపెనీలు ఒప్పుకోవని తెలుస్తున్నది. WTO రూలింగ్ ఆయుధం చేసుకుని అమెరికా కంపెనీలు మరింత కఠినంగా వ్యవహరిస్తామని భారత వాణిజ్య అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 

జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ కింద ఉత్పత్తి చేసే విద్యుత్ ను భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కనుక సోలార్ విద్యుత్ బ్యాటరీలు, ప్యానెల్ల ఉత్పత్తి ‘కాంపిటీటివ్ రిలేషన్ షిప్’ కిందకు వస్తుందని, కాబట్టి కనీస మొత్తంలో ముడి సరుకులను దేశీయంగా సేకరించాలన్న WTO షరతులను వర్తింపజేయాలని భారత్ వాదించగా WTO ప్యానెల్ ఈ వాదనకు అంగీకరించలేదు. పధకం ఏదైనప్పటికీ విద్యుత్ అనే సరుకు సదరు షరతుల కిందికి రాదనీ ప్యానెల్ తేల్చింది. 

ఇండియా-అమెరికాల మధ్య తలెత్తిన వివాదాలలో మెజారిటీ అమెరికాకు అనుకూలంగానే పరిష్కారం కావడం ఈ సందర్భంగా గుర్తించవలసిన అంశం. ఒకటి రెండు కేసుల్లో ఇండియాకు అనుకూలంగా తీర్పు వఛ్చినప్పటికీ ఆ తీర్పులను అమలు చేయకుండా భారత అధికారులను, ప్రభుత్వంలో పలుకుబడిని వినియోగించడంలో అమెరికా కంపెనీలు సఫలం అవుతున్నాయి.  

WTO ఒప్పందం ఉనికిలోకి వచ్చ్చిందే మూడో ప్రపంచ దేశాలలో పారిశ్రామిక అభివృద్ధిని నిరోధించే లక్ష్యంతో. కనుక WTO ఫిర్యాదుల వ్యవస్ధను ఉపయోగించుకుని అమెరికా, పశ్చిమ బహుళజాతి కంపెనీలపై పై చేయి సాధించవచ్చుఁ అనుకోవడమే ఒక భ్రాంతి.

బేయర్ మాన్ శాంటో విలీనం, మహా రాకాసి అవతరణం

రాకాసి, రాకాసి విలీనం అయితే ఏమవుతుంది? మహా రాకాసి పుడుతుంది. 

రెండు రాకాసులు కలిస్తే ఏ పాటి విధ్వంసం జరుగుతుంది? ఆ రాకాసులు విడి విడి గా చేయగల విధ్వంసం కంటే ఇంకా ఎక్కువగా విధ్వంసం జరుగుతుంది. ఇద్దరు పని వాళ్ళు విడి విడిగా పని చేసినప్పటి కంటే సమిష్టిగా పని చేసినప్పటి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రాకాసితనం కూడా అంతే అన్నమాట! నిజానికి బహుళజాతి కంపెనీలు విలీనయం అయేది, స్వాధీనం చేసుకునేది కూడా అలా రాకాసితనం పెంచుకునేందుకే!  

బేయర్ అనే జర్మన్ బహుళజాతి వ్యవసాయ రాక్షస కంపెనీ, మాన్ శాంటో అనే అమెరికన్ బహుళజాతి రాక్షస కంపెనీలు రెండు విలీనం అయినట్లు ప్రకటించడంతో ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా భారత దేశ వ్యవసాయ రంగానికి మరిన్ని గడ్డు రోజులు రానున్నాయి. 

దీనిని విలీనం (మెర్జర్) అనటం కంటే స్వాధీనం (అక్విజిషన్) అనడమే కరెక్ట్. ఎందుకంటే బేయర్ కంపెనీ మాన్ శాంటో కంపెనీకి 66 బిలియన్ డాలర్లు  (రమారమి 4.4 లక్షల కోట్ల రూపాయలకు సమానం) చెల్లించింది. కొన్ని పత్రికలు దీనిని మెర్జర్ అనడం లేదు, అక్విజిషన్ అని కూడా అనడం లేదు. టేకోవర్ అంటున్నాయి. అనగా కంపెనీని ప్రత్యర్థి కంపెనీలో కలిపేయక తప్పని పరిస్ధితి ఏర్పడటం వల్ల కలిపేయడం/అమ్మేయటం. 

ఈ టేకోవర్ ద్వారా గ్లోబల్ మార్కెట్ ని స్ధిరీకరించుకోగల (మార్కెట్ కన్సాలిడేషన్) శక్తి బేయర్ కు వచ్చింది. ఇండియాలో విత్తన మార్కెట్ ప్రధానంగా మాన్ శాంటో కంపెనీ చేతుల్లోనే ఉన్నది. ఇతర పేర్లు వినిపించినప్పటికీ వాటిని కూడా మాన్ శాంటో కంపెనీయే కంట్రోల్ చేస్తోంది. తద్వారా మార్కెట్ లో అనేక వెరైటీలు ఉన్న భ్రమలను కలిగిస్తుంది. 

ఇండియాలోని మహికో కంపెనీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారత్ లో అడుగు పెట్టిన మాన్ శాంటో ఆనతి కాలం లోనే, భారత ప్రభుత్వాలు అమలు చేసిన వ్యవసాయ విధ్వంసక ఆర్ధిక సంస్కరణల విధానాలు ఆలంబనగా, మార్కెట్ ను కైవసం చేసుకుంది. భారతీయ సాంప్రదాయ ఉత్పత్తిదారుల సహజ విత్తన సేకరణ, నిల్వల పద్ధతులను దెబ్బ తీసింది. దానితో రైతులకు విత్తనాలు కావాలంటే మార్కెట్ తప్ప మరో గతి లేకుండా పోయింది.  

బేయర్ టేకోవర్ తో మాన్ శాంటో మరింత శక్తివంతం అయినట్లే. ప్రపంచ స్ధాయి మార్కెట్ కన్సాలిడేషన్ జరిగినపుడు చిన్న స్ధాయి ఉత్పత్తిదారుల మార్కెట్ మరింతగా కుచించుకుపోతుంది. మాన్ శాంటో కంపెనీని బేయర్ కంపెనీ టేకోవర్ చేయడం వల్ల భారత రైతుల మరింత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటారు. బహుళజాతి కంపెనీలు పోటీ పడుతున్నపుడే పరస్పర అవగాహన ద్వారా రైతులకు వివిధ రకాలుగా నష్టం జరుగుతుంది. కన్సాలిడేషన్ జరిగి పోటీ లేకుండా పోయాక రైతుల పరిస్ధితి మరింత దిగజారడం ఖాయం.  

టేకోవర్ ద్వారా ఏర్పడిన ఏకీకృత కంపెనీ ఇండియాలో విత్తన మార్కెట్ లో దాదాపు పూర్తిగా గుత్త స్వామ్యం వహిస్తుంది. రెండు కంపెనీలకు ఇండియాలో ఉన్న అనుబంధ కంపెనీలు, ఉమ్మడి కంపెనీల ద్వారా వరి, పత్తి, జొన్న, కూరగాయలు లాంటి పంటల మార్కెట్ లో మెజారిటీ వాటా కైవసం చేసుకుంటుంది.

టేకోవర్ ద్వారా వ్యవసాయ రసాయన మార్కెట్ లో కూడా మరింతగా గుత్తస్వామ్యం పెరుగుతుందని నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది శక్తి ఒకే చోట కేంద్రీకృతం కావటానికి దారి తీస్తుంది. మార్కెట్ మళ్లింపుకు దారి తీస్తుంది. ఇటీవల కాలంలో భారీ విత్తన కంపెనీలు విలీనం కావటం ఇది మూడోసారి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ లో 3 కంపెనీలు మాత్రమే మిగులుతాయి. భారత వ్యవసాయంపై వినాశకర ప్రభావం కలుగజేస్తుంది” అని నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎన్ ప్రభాకరరావు వ్యాఖ్యానించడం గమనార్హం.     

బేయర్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ అని, మాన్ శాంటో కంపెనీ ఏమో విత్తన కంపెనీ అని కాబట్టి విలీనం వల్ల పెద్ద ప్రభావం ఉండబోదని సమర్ధకులు వాదిస్తున్నారు. బేయర్, మాన్ శాంటో కంపెనీ షేర్లు కొని లాభపడేవారికి మాత్రమే ఈ వాదన నచ్చుతుంది. కానీ బలం పెరిగినపుడు కళ్ళు నెత్తి మీదికి వస్తాయన్నది సాధారణ విషయం. బహుళజాతి కంపెనీల బలం పెరిగినపుడు మార్కెట్ ఎలా నడవాలి శాసించడం మొదలు పెడతాయన్నది అందరికి తెలిసిన సత్యం. 

“అవి దోపిడీ మారి వ్యవసాయ-వాణిజ్య కంపెనీలు. వాటి దృష్టి ఎప్పుడు పోటీని రూపుమాపి లాభాలు పెంచుకోవడం పైనే ఉంటుంది. అది కూడా రైతుల జీవనాన్ని, వారి భవిష్యత్తును ఫణంగా పెట్టి దోపిడీ చేస్తాయి” అని ఆల్-ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ విజు కృష్ణన్ చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యం.